Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 31 Jan 2017 22:44:32 IST

ప్రయోగాత్మక నాటక రచయిత

ప్రయోగాత్మక నాటక రచయిత

  • అబ్బూరి గోపాలకృష్ణ కన్నుమూత
  • 81 ఏళ్ల వయసులో విశాఖలో మృతి
  • అన్నమయ్యకు చిత్రకళా రూపం
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత చిత్రకారుడు, ప్రయోగాత్మక నాటక రచయిత, దర్శకుడు అబ్బూరి గోపాలకృష్ణ (81) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన తండ్రి రామకృష్ణారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం మొదటి లైబ్రేరియన్‌ కాగా, అన్నయ్య వరద రాజేశ్వరరావు, వదిన ఛాయాదేవి ప్రసిద్ధ తెలుగు రచయితలు. కొద్దిరోజులుగా గోపాలకృష్ణ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య ప్రమీలాదేవి, కుమారుడు హరి ఉన్నారు. మరణానంతరం తన మృతదేహాన్ని ఆంధ్ర వైద్యకళాశాలకు అప్పగించాలని అబ్బూరి వీలునామా రాశారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న హరి బుధవారం విశాఖ చేరుకుంటారని, కుమారుడి సమక్షంలో తండ్రి మృతదేహాన్ని దానం చేస్తామని కుటుంబీకులు తెలిపారు. చిత్రలేఖనం, లేఖనం, దర్శకత్వం ఇలా.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన గోపాలకృష్ణ 1936 మార్చి రెండోతేదీన విశాఖలో జన్మించారు. తండ్రి, అన్నయ్యలు రాయిస్టులు (ఎంఎన్‌ రాయ్‌ అనుచరులు) కావడంతో, చిన్నతనం నుంచీ వామపక్ష, మానవతావాద రాజకీయ వాతావరణంలో అబ్బూరి స్వేచ్ఛగా పెరిగారు. తన పదమూడో యేట విజయనగరంలో ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు వద్ద చిత్రలేఖనం అభ్యసించారు. హైదరాబాద్‌ ప్రభుత్వ గవర్నమెంట్‌ కళాశాలలో ఫైన్‌ ఆర్ట్స్‌లో హానర్స్‌ పూర్తిచేసి..అక్కడే నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో క్యూరేటర్‌గా చేరారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటకశాఖలో అధ్యాపకునిగా చేరి విభాగాధిపతిగా పనిచేశారు. ప్రయోగాత్మక నాటక రచనలో అబ్బూరిది అందెవేసిన చేయి. ఆయన రాసిన త్రిజకా యమదర్శనం నాటకం మంచి పేరు తెచ్చిపెట్టింది. గిరీష్ కర్నాడ్‌ కన్నడంలో రాసిన నాటకాలను తెలుగులోకి ఆయన అనువదించి.. ప్రదర్శించారు. రంగస్థల రూపకల్పన, దర్శకత్వం, పురాతత్వ పరిశోధనలో విశేష సేవలు అందించారు. అన్నమామార్యుల యక్షగానం సంప్రదాయంపై చేపట్టిన పరిశోధనకు గాను డాక్టరేట్‌ అందుకొన్నారు. చిత్రకారుడు కూడా కావడంతో.. క్షేత్రస్థాయిలో అనేకమందిని కలిసి వారి నుంచి అనేక వివరాలు తీసుకుని, అన్నమయ్య ఇలా ఉండవచ్చునని ఊహించి చిత్రం గీశారు. ఆయన తన కళాఖండాలు విశాఖ మ్యూజియానికి అందించారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.