Jan 22 2017 @ 21:50PM

పడి లేచిన కెరటం

చెట్టంత మనిషి ఉన్నట్లుండి కుప్పకూలిపోతే.. కష్టమే ఎరుగని జీవితం కన్నీటి
సుడిగుండంలో చిక్కుకుపోతే.. అక్కడే ఒక ఆశల మొలక పుట్టింది. కూలిపోయిన ఆ చెట్టంత మనిషే తనలాంటి అభాగ్యులకు నీడనిచ్చే స్వచ్ఛందసంస్థలా విస్తరించింది. ఆమే ముప్పయి ఆరేళ్ల స్వర్ణలత. ఒక కార్పొరేట్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ హోదాలో పనిచేస్తున్న ఆమెను.. ఒక వింతవ్యాధి కబళించి.. కాళ్లు చచ్చుపడిపోయేలా చేసినా.. ఆమె విజయాన్ని ఆపలేకపోయింది విధి. మన దేశంలోని దివ్యాంగుల్లో అతి తక్కువ మంది మోటివేషనల్‌స్పీకర్స్‌లో ఒకరిగా ఎదిగిన స్వర్ణలత జీవితంలో అసలేం జరిగిందో చదవండి..

ఇంటికి వెళ్లగానే మంచం మీద పడిపోయా. నా శరీరంలో ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు’’ అని గత విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. పారాసిటమాల్‌ మాత్రలు వేసుకున్నా తగ్గలేదు. కొన్ని రోజులకే ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వారం రోజులు గడిచింది. అయినా స్వర్ణలతకు జ్వరం తగ్గలేదు. పైగా కాళ్లలో బొత్తిగా స్పర్శ లేదు. వైద్యులు రకరకాల వైద్య పరీక్షలు చేశారు. ఆమెకున్నది మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ (ఎంఎస్‌) అని రూడి అయ్యింది.


ఆడుతూపాడుతూ సాగే జీవితం. హఠాత్తుగా చేతికి వాకింగ్‌స్టిక్‌ వచ్చిందేమిటి? స్వర్ణలత తట్టుకోలేకపోయింది. కడుపులో నుంచి ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె బాధను చూసిన భర్త ‘‘ఏ వ్యక్తి అయినా కళ్లజోడు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందీ అంటే ఆ వ్యక్తి అంధుడు అయిపోయాడని కాదుకదా!’’ అన్నాడు. ఆ మాట మనసును కాస్త కుదుట పడేలా చేసింది. అప్పటి నుంచి ఊతకర్రతో మెల్లగా ఒక్కో అడుగు వేయడం ప్రారంభించింది స్వర్ణలత. కన్నీటిని దిగమింగుకుని ఆశగా భవిష్యత్తును వెతుక్కునేందుకు సిద్ధమైందామె. ‘‘కానీ ఇవన్నీ చెప్పుకునేంత సులభం కాదు. ఒక రోజు నా కొడుకు ‘నీ అంగవైకల్యం చూస్తే నాకు చాలా బాధగా ఉంది మమ్మీ’ అన్నాడు. అప్పుడూ కన్నీళ్లను ఆపుకోలేకపోయా’’ అన్నారు లత. అయితే ఇటీవల ఆమె ఇచ్చిన ఓ మోటివేషనల్‌ స్పీచ్‌ ముగిశాక.. సభికులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసినప్పుడు.. స్వర్ణలత కొడుకు ఎంతో గర్వంగా ఫీలయ్యాడు. 36 ఏళ్ల స్వర్ణలత భర్త సహకారంతో ‘స్వర్గ ఫౌండేషన్‌’ అన్న పేరుతో ఒక చారిటబుల్‌ట్ర్‌స్టకు శ్రీకారం చుట్టారు. వీల్‌ చెయిర్‌ ఆసరాగా ఈ ట్రస్ట్‌ ద్వారా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ.. వికలాంగుల్లో జీవచైతన్యాన్ని నింపుతున్నారామె. ఈ విజయం వెనక ఆమెదొక విషాద కథ.

 
హఠాత్తుగా ఒక రోజు
స్వర్ణలత, గురుప్రసాద్‌ భార్యాభర్తలు. స్థిరనివాసం బెంగళూరు. స్వర్ణ ఒక బహుళజాతి కార్ల తయారీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌. ‘‘అప్పట్లో దేశమంతా తిరిగేదాన్ని. క్రికెటర్లు, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్‌లను తరచూ కలిసి మా సంస్థను ప్రమోట్‌ చేసే పని నాది. జీవితం హాయిగా గడిచిపోయేది. కానీ ఒక రోజు ఉన్నట్లుండి విపరీతమైన జ్వరం వచ్చింది. ఆఫీసులో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లిపోయాను. ఇంటికి వెళ్లగానే మంచం మీద పడిపోయా. నా శరీరంలో ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు’’ అని గత విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. పారాసిటమాల్‌ మాత్రలు వేసుకున్నా తగ్గలేదు. కొన్ని రోజులకే ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వారం రోజులు గడిచింది. అయినా స్వర్ణలతకు జ్వరం తగ్గలేదు. పైగా కాళ్లలో బొత్తిగా స్పర్శ లేదు. వైద్యులు రకరకాల వైద్య పరీక్షలు చేశారు. ఆమెకున్నది మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ (ఎంఎస్‌) అని రూడి అయ్యింది. ‘‘అప్పటి వరకు కనీవినీ ఎరుగని వ్యాధి అది. నేను కానీ, నా భర్త కానీ ఆ జబ్బు గురించి వినడం అదే తొలిసారి’’ అని ఆ రోజును తల్చుకుందామె.
 
కాళ్ల కింద నేల కూలినట్లు..
ఇదొక వింత వ్యాధి. దీనివల్ల కాళ్లు పూర్తిగా నిర్జీవం అవుతాయి. సొంతంగా నడవలేవు.. అని వైద్యులు చెప్పడంతో ఆమె హృదయం ముక్కలైంది. రోజుల తరబడి ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆఖరికి ఉద్యోగం వదులుకోక తప్పలేదు. కళ్ల ముందే వృత్తిగత, వ్యక్తిగత జీవితాలు కుప్పకూలిపోవడం పెను విషాదం. ‘‘నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నన్ను పరామర్శించేందుకు ఎవరొచ్చినా.. నాకెందుకు ఇలా జరిగింది..? నేనేం పాపం చేశాను అని అడిగేదాన్ని’’ అన్నారామె. అంగవైకల్యంతో బాధ పడుతూనే తనకు బిడ్డ కావాలని ఆరాటపడింది. ఆమె ఆశించినట్లుగానే పాప పుట్టింది. తన పేరు ‘గాన’. మళ్లీ జీవితం పట్ల ఆశ చిగురించింది. అయితే రోజులు మాత్రం భారంగానే గడిచిపోతున్నాయి. ఈ దుస్థితి నుంచి బయట పడటం సాధ్యం కాదని అర్థమైపోయింది. ఒక గట్టి సంకల్పబలం, ఒక సానుకూలదృక్పథం లేకపోతే ముందుకు వెళ్లడం కష్టమని తెలిసింది. ఈ సుడిగుండం నుంచి బయటపడేందుకు ఆ రెండు లక్షణాలను అలవర్చుకోక తప్పదనుకుంది.
 
ఆశల మొలక
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. స్వర్ణలత విషయంలోను అదే జరిగింది. ఉద్యోగరీత్యా తన భర్త బెంగళూరు నుంచి కొయంబత్తూరుకు బదిలీ కావడం. ఆమె జీవితానికి ఒక పెద్ద మలుపు. కొత్త నగరంలో రెండు పడగ్గదుల ప్లాట్‌కు చేరుకుందీ కుటుంబం. కొత్త వాతావరణం ఆమెలో ఉల్లాసాన్ని నింపింది. వీల్‌చెయిర్‌లో కూర్చుని అపార్ట్‌మెంట్‌ మొత్తం కలియతిరిగింది. మెల్లగా నగరంలోకి వెళ్లి.. స్వచ్ఛందసంస్థల ప్రతినిధులను కలవడం మొదలైంది. ‘‘వారందరి సహకారంతో ‘స్వర్గ’ అన్న స్వచ్ఛంద సేవా సంస్థకు శ్రీకారం చుట్టాను. నేను, నా భర్త కలిసి ఆ సంస్థను ఏర్పాటు చేశాము. అంగవైకల్య బాధితులకు దీన్నొక స్వర్గంగా మార్చాలన్నది మా ఆశయం. మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, న్యూరోమస్క్యులర్‌ డిసో్ట్రఫీ, పారాప్లేజియా, పార్కిన్‌సన్‌ వంటి మొండి వ్యాధుల బాధితుల్ని ఎంచుకుని.. వాళ్ల జీవితంలో కొత్త కాంతులు నింపేందుకు నడుంకట్టాము’’ అని పేర్కొన్నారు స్వర్ణ. దివ్యాంగులను సామూహికంగా నడిపించే సైక్లోధాన్స్‌, మారథాన్స్‌లతో వారి ఉత్సాహాన్ని ప్రజలు గుర్తించేలా చేయాలన్నది కూడా సంస్థ విధుల్లో ఒక బాధ్యత. ఇటువంటి వ్యాధుల నుంచి విముక్తి కలిగించే మరింత మెరుగైన ఔషధాలను తయారుచేసే దిశగా జరుగుతున్న పరిశోధనలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నాము అంటున్నారీ భార్యాభర్తలు.
 
మరో అడుగు
విజయాలు కొందరి సొంతమే కాదు. న్యూరలాజికల్‌ డిజార్డర్‌ బాధితుల్లోను అద్భుతమైన విజేతలు ఉన్నారు. కానీ ఆ విషయం ప్రపంచానికి తెలియదు. అందుకని అందర్నీ ఒకచోట చేర్చి.. వారి ముఖచిత్రాలతో ఆకర్షణీయమైన క్యాలెండర్‌ను ప్రచురించింది స్వర్ణలత. ‘‘ఈ చిన్న పని నాలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. దాంతోపాటు దివ్యాంగులు, వృద్ధులకు సౌకర్యవంతమైన వాహనాన్ని రూపొందించాం. ఆ వాహనం పేరు ‘సారథి’. ఇది వీల్‌చెయిర్‌లా ఉన్నా కూడా.. ఒక రెస్ట్‌రూమ్‌లా అనిపిస్తుంది. ఇందులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఉంటుంది. ఒక పడక, మూడు కుర్చీలు ఉంటాయి. ఈ వాహనాన్ని ఎవరైనా స్వర్గ సంస్థ నుంచి అద్దెకు తీసుకోవచ్చు..’’ అని తెలిపారు. ఇవన్నీ ఇలా ఉంచితే.. స్వర్ణలత ప్రస్తుతం కొయంబత్తూరులో పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్న మోటివేషనల్‌ స్పీకర్‌ అయ్యారు. దేశం నలుమూలలా తిరుగుతూ దివ్యాంగులలో స్పూర్తినింపుతున్నారు. అద్భుతమైన వాక్చాతుర్యంతో కొత్త శక్తిని నింపుతున్నారామె. ఆ అనుభవాలనే చెప్పుకొస్తూ ‘‘ఒకవేళ నేను అదే ఉద్యోగంలోనే ఉండుంటే.. ఇంతమందిని కలిసుండేదాన్ని కాను. జీవితం గురించి నాకు పెద్దగా తెలిసేది కాదు. నా నుంచి ఇంతమంది స్ఫూర్తి పొందేవారు కాదు. నేను కూడా ఇంత ఉల్లాసంగా.. ఉత్సాహంగా బతికేదాన్ని కానేమో! నాకొచ్చిన ఈ వ్యాధి.. ఎన్నో సుదూరతీరాలను తాకేలా చేసింది. అందుకే ఒక ఉత్పాతం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అది నిజమని అర్థమయ్యాక.. మనదైన ప్రపంచాన్ని మనం సృష్టించుకోక తప్పదు’’ అంటున్న స్వర్ణలతను మెచ్చుకోని వారుంటారా? గ్రేట్‌ సెల్యూట్‌ లత!!