Jan 6 2017 @ 10:14AM

వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు

తెలుగు తెరపై భిన్నంగా కనిపించే నటుడు కృష్ణుడు. ‘మొదటి సినిమా’తో తెరంగేట్రం చేసి ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో దూసుకుపోతున్నాడు. రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను, దర్శకులను కూడా మెప్పిస్తున్న నంది అవార్డు నటుడు. కొత్త ఆలోచనలతో, కొత్తపంథాలో, లోబడ్జెట్‌ చిత్రాలు నిర్మించాలనే ఆశయంతో యువదర్శకులెందరో సినిమారంగంలో ప్రవేశించారంటున్న కృష్ణుడు ఇంటర్వ్యూ....


కవులు, కళాకారులకు నిలయమైన విజయనగరంలో జన్మించాను. మా నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, నైన్త్‌ వరకు విశాఖపట్నంలో, టెన్త్‌ క్లాస్‌ కాకినాడలో చదివాను. బెంగళూరులో పాలిటెక్నిక్‌ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాను.

 
ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ
1997లో హైదరాబాద్‌ చేరుకుని కమలాపూర్‌ కాలనీలో ఉన్న దేవదాస్‌ కనకాలగారి ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. రాజీవ్‌ కనకాలగారు కూడా అప్పుడప్పుడు మాకు క్లాసులు చెప్పేవారు. వారి అమ్మగారు లక్ష్మిగారు రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవారు. 1998లో ఈ కోర్సు పూర్తిచేశాను. నాతోపాటు శ్రీవాస్తవ్‌గారు కూడా డైరెక్షన్‌లో ట్రైనింగ్‌ పూర్తిచేసి ఎన్నో చిత్రాలకు కో డైరెక్టర్‌గా చేస్తున్నారు. శిక్షణ పూర్తయి ఆఫర్స్‌ వస్తున్న సమయంలో నా స్కూటర్‌ని లారీ డీకొట్టి మేజర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ఫ్రాక్చర్‌ కావడంతో రాజోలు సమీపంలోని మా సొంతూరు చింతపల్లి వెళ్లిపోయాను. నటీమణి హేమ కూడా రాజోలు నివాసే. వారి సహకారం నాకు బాగా లభించింది.
 
పూరీజగన్నాథ్‌ సలహా
నేను లావుగా ఉంటాను కదా. దాంతో ఇద్దరు ముగ్గురు దర్శకులు నిరుత్సాహపరిచారు. నువ్వు సినిమాలకి పనికిరావు అన్నారు. నాకు మొదటి నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. పూరీజగన్నాథ్‌గారు నాకు సన్నిహితులు. ఫొటోగ్రఫీ కోర్స్‌ నేర్చుకోమన్నారు. ముంబయ్‌లో ఫొటోగ్రఫీ నేర్పేవాళ్లున్నారు, వెళ్లమని సలహా ఇచ్చారు. బొంబాయిలో ఫొటోగ్రఫీ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు వస్తుంది.
 
ఫొటోగ్రఫీలో శిక్షణ
పూరీగారి సలహాతో బొంబాయి వెళ్లి ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ భరత్‌మీర్‌చందాని వద్ద శిక్షణ పొందాను. తర్వాత రామ్‌గోపాల్‌వర్మగారి బావ సుబ్బరాజుగారు నన్ను ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌ సుబిశామ్యూల్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేర్చారు. అలా ఫొటోగ్రఫీలో బ్రహ్మాండంగా తర్ఫీదు పొంది మెళకువలన్నీ నేర్చుకుని హైదరాబాద్‌ వచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌-3లో ‘ది ఫేసెస్‌’ అనే ఫొటో స్టూడియో పెట్టాను. పూరీజగన్నాథ్‌గారితోనే ప్రారంభోత్సవం చేయించాను. స్టూడియోకు ఎంతో మంచి పేరు వచ్చింది. 2001 నుండి 2004 వరకు స్టూడియో నడిపి మంచి అనుభవం సంపాదించుకున్నాను.
 
అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా
కెమెరామేన్‌ రసూల్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఆయన దర్శకుడు కూడా. ఆయన పూర్తిపేరు రసూల్‌ ఎల్లోర్‌. ఆయన దర్శకత్వంలో భగీరథ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను. ఈ చిత్రం ఎంతో విజయవంతంగా ఆడింది. ఇది నా సినీ జీవితానికి ఒక ప్లస్‌ పాయింట్‌. ఇటు ఫొటోగ్రాఫర్‌గా, అటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఒకే ఒక సినిమాతో మంచి అనుభవం సంపాదించుకున్నాను. రవితేజ, శ్రియ, ప్రకా్‌షరాజ్‌ నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం సమకూర్చారు. 2005లో ఈ చిత్రం విడుదలైంది.
 
షార్ట్‌ ఫిలిమ్‌ హీరోగా
భగీరథ చిత్రం షూటింగ్‌ చివర్లో ఉండగా, సందీప్‌ అనే నా మిత్రుడొకరు నాతో ఒక షార్ట్‌ఫిలిమ్‌ చేద్దామని నన్ను సంప్రదించాడు. అదో హిందీ చిత్రం. ‘చ్ఛే ఫీట్‌నిచ్చే’ అని పేరు పెట్టాం. ఇందులో నాది మెయిన్‌ రోల్‌. మాఫియా డాన్‌ క్యారెక్టర్‌. ఈ పాత్రలో నేను బాగా క్లిక్‌ అయ్యాను.
 
మనోడు
ఒక యాడ్‌ ఫిలిమ్‌ ఓనర్‌ నేను నటించిన యాడ్‌ ఫిలిమ్‌ చూశారు. చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. నీ నటన నాకు నచ్చింది, ‘మనోడు’ చిత్రంలో నటిస్తావా? అని అడిగారు. ఈ చిత్రంలో నేను ‘బీర్బల్‌’ పాత్ర పోషించాను. (అంటే బీరు తాగి బాగా బలంగా ఉండే పాత్ర అన్నమాట, నవ్వు). ఓ మోస్తరుగా ఆడింది. టెన్త్‌క్లాస్‌ చిత్రం హీరో భరత్ ఇందులో నటించాడు. ఈ చిత్రంలో ఇంకా రాధికాదీప్తి, విశ్వేందర్‌రెడ్డి, కె.జె.శర్మ, రత్నకుమారి తదితరులున్నారు. 2006లో ఈ చిత్రం విడుదలైంది.
 
‘మొదటి సినిమా’
నా మొదటి చిత్రం మనోడు. కానీ ఆ తర్వాత నటించిన ‘మొదటి సినిమా’ దీనికంటే ముందుగా విడుదలైంది. కూచిపూడి వెంకట్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం పూర్తి రొమాంటిక్‌ చిత్రం. నవదీప్‌, పూనమ్‌బజ్వా తదితరులు నటించారు. 2005లో ఈ చిత్రం విడుదలైంది.
 
హీరో స్నేహితుడి పాత్రలు
ఈ రెండు చిత్రాల తర్వాత ఇక నిదానంగా సినిమాలు చేయడం ప్రారంభించాను. హీరోలకు స్నేహితుడు పాత్రల్లో నటించాను. మహేష్‌బాబు నటించిన పోకిరి చిత్రంలో అతడి స్నేహితుడిపాత్రలో చేశాను. దాదాపు ఈ వేషాలన్నీ బాగా పండాయి.
 
హ్యాపీడేస్‌
శేఖర్‌ కమ్ములగారు హ్యాపీడేస్‌ చిత్రంలో పిలిచి అవకాశం ఇచ్చారు. నాకు చిన్న పాత్ర ఇద్దాం అనుకున్నారు. కానీ నా అంకితభావం ఆయనకు నచ్చింది. లోగడ కొన్ని సినిమాల్లో ఆయన నన్ను గమనించారు. నా పాత్ర పొడిగించి గుర్తింపు వచ్చేలా చేశారు. ఇందులో నాది సీనియర్‌ స్టూడెంట్‌ పాత్ర. నాకంటూ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చిన చిత్రం ‘హ్యాపీడేస్‌’. ఆయన నిర్మించిన గోదావరి చిత్రం నాకెంతో ఇష్టం. ఐదారుసార్లు చూశాను.
 
ఊహించని మలుపు ‘వినాయకుడు’ చిత్రం
‘హ్యాపీడేస్‌’ షూటింగ్‌ సమయంలో సాయికిరణ్‌గారు పరిచయమయ్యారు. ‘వినాయకుడు’ చిత్ర దర్శకుడు ఆయనే. అప్పటికే ఆయన దగ్గరున్న ఈ చిత్ర కథను నాతో షేర్‌ చేసుకున్నారు. ఆ కథ నాకు బాగా నచ్చింది. దాంతో నువ్వే హీరోగా చెయ్యాలన్నారు. హీరో పాత్రలో అదృష్టం నాకు అలా తన్నుకొచ్చిందనే చెప్పాలి. హాస్యరస ప్రధాన చిత్రమిది. ఇందులో నాతోపాటు సోనియాదీప్తి, పూనమ్‌కౌర్‌, సత్యాకృష్ణన్‌, అంకిత తదితరులు నటించారు. నా నట జీవితాన్ని మలుపుతిప్పిన సూపర్‌హిట్‌ చిత్రమిది. ఈ చిత్రానికి నంది అవార్డు, నాకు ఉత్తమనటుడు అవార్డు లభించింది.
 
ఇన్ఫీరియారిటీని దూరంచేసే చిత్రం
‘వినాయకుడు’ నాకు బాగా నచ్చిన చిత్రమే కాదు, ప్రేక్షకులు మెచ్చిన చిత్రం. థియేటర్‌లో జనం హర్షధ్వానాలు కురిపిస్తుంటే నేనెంతో హాయిని అనుభవించాను. తృప్తిగా అనిపించింది. లావుగా ఉన్నామనీ, పొట్టిగా ఉన్నామనీ, మరుగుజ్జుగా ఉండిపోయామనీ ఇన్ఫీరియారిటీతో బాధపడేవారు ఎందరో. నల్లగా ఉన్నామనీ, అంగవైకల్యం ఉందనీ బాధపడుతుంటారు. అలాంటి కాంప్లెక్స్‌ను పోగొట్టడానికి ఎంతో దోహదం చేసే చిత్రం వినాయకుడు. ఈ చిత్రం చూసి ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు. మంచిమనసు ఉన్న మనిషి ఎలా ఉన్నాగానీ పట్టుదలతో అనుకున్నది సాధిస్తాడన్నదే ఈ చిత్ర కథ. అలాంటి కథకు హాస్యం జోడించి ప్రేక్షకులకు అందించారు దర్శకుడు సాయికిరణ్‌. ముఖ్యంగా మనుషుల్లో ఆత్మస్థైర్యం కలిగించే చిత్రం. 2008లో విడుదలైంది. 2009లో విడుదలైన మరో చిత్రం ‘విలేజ్‌లో వినాయకుడు’. ఈ చిత్రం కూడా ఎంతో బాగా ఆడింది.
 
గోపాల గోపాల
‘గోపాల గోపాల’ చిత్రంలో వెంకటేష్‌గారికి అసిస్టెంట్‌ పాత్రలో నటించాను. ఇది కూడా నాకు మంచిపేరు తెచ్చిపెట్టింది. వెంకటే్‌షగారిలో ఉండే సిన్సియారిటీ, డిసిప్లిన్‌ నాకు ఎంతో నచ్చాయి. ఆయన నాకు మంచి స్ఫూర్తిని ఇచ్చారు. నటనలో ఎన్నో మెళకువలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. పవన్‌కల్యాణ్‌గారితో ఈ చిత్రంలో ఒక సీన్‌లో నటించాను. ఆయన నాకు మంచి మిత్రుడు కూడా.
 
నచ్చిన పాత్రలు చేస్తా
హీరో పాత్రలకే నేను పరిమితం కాలేదు. నాకు నచ్చిన పాత్రలన్నీ నేను చేస్తాను, అది ఎలాంటిదైనా సరే. ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో నాగచైతన్య స్నేహితుడిగా నటించాను. ఓయ్‌ చిత్రంలో సిద్దార్ధ స్నేహితుడిగా నటించాను. ఈ పాత్రలన్నీ బాగా పండాయి. నాకు ఎంతో పేరు తీసుకువచ్చాయి. ఇలా దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించాను.
 
మరువలేని ఘటన
వినాయకుడు చిత్రంలో సాయికిరణ్‌గారు నాకు హీరోగా అవకాశం ఇవ్వడం నా జీవితంలో నేను ఎప్పటికీ మరువలేని సంఘటన. నేను ఎన్నో ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు నటుడుగా నేను నిలదొక్కుకునేందుకు, నటనపైనే నా దృష్టి కేంద్రీకృతమయ్యేందుకు దోహదపడ్డారు సాయికిరణ్‌గారు. నన్ను ప్రోత్సహించి పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఆదరించారు. ఈ మధ్య ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌ అన్నయ్య పాత్ర చేశాను. అందరూ మెచ్చుకున్నారు. ఫోన్లు చేస్తున్నారు.
 
ఇప్పుడు కళాకారులకు అవకాశాలు ఎన్నెన్నో!
ఐదేళ్లక్రితంతో పోలిస్తే ఇప్పుడు సినిమా రంగం పచ్చపచ్చగా ఉంది. ఇప్పుడు కళాకారులకు ఎన్నోరకాలుగా అవకాశాలు వస్తున్నాయి. షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తున్నారు. తక్కువ బడ్జెట్‌ చిత్రాలు తీస్తున్నారు. ఇవన్నీ బాగా క్లిక్‌ అవుతున్నాయి. ఈ మధ్య వచ్చిన ‘పెళ్లిచూపులు’, ‘మిథునం’ చిత్రాలు ఈ కోవకు చెందినవే. పైగా ఎన్నో ఛానల్స్‌ కూడా వచ్చాయి. మీడియా ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కళాకారుడికి మంచి గుర్తింపు తీసుకొస్తోంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కొత్త ఆలోచనలతో, కొత్త పంథాలో, లోబడ్జెట్‌లో చిత్రాలు నిర్మించాలి అనే దృక్పథంతో ఎంతోమంది యువదర్శకులు పరిశ్రమలోకి వచ్చారు. ఇదెంతో సంతోషకరమైన విషయం. ప్రేక్షకుల నాడిని బట్టి ప్రజంట్‌ ట్రెండ్‌లో సినిమాలు తీస్తున్నారు. కనుక సినీ పరిశ్రమలో అప్పటికీ ఇప్పటికీ పోల్చిచూస్తే చాలా మార్పులు వచ్చాయి. ప్రయోగాత్మకమైన మార్పులు వస్తాయి. ప్రయోజనాత్మకమైన కుటుంబ కథా చిత్రాలు కూడా ఎన్నో వస్తాయి. ప్రస్తుత హీరోల్లో అందరూ బాగా నటిస్తున్నారు. నేను చిరంజీవి ఫ్యాన్‌ని. ప్రస్తుతం పెద్దవంశీగారి దర్శకత్వంలో ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రంతోపాటు మరో రెండుమూడింటిలో నటిస్తున్నాను. ఆఫర్స్‌ వస్తున్నాయి. కథ కూడా చూసుకుంటున్నాను.
 
కుటుంబం
నా భార్య పేరు లలితా గాయత్రి. మా అమ్మాయిపేరు శ్రీనిత్య. ప్రైమరీ క్లాస్‌ చదువుతోంది. నాకు సీ ఫుడ్‌ అంటే ఎంతో ఇష్టం. అందులోనూ చేపలు, రొయ్యలు, పీతలు అంటే మరీ ఇష్టం. నాటుకోడి కూర అంటే ఇంకా బాగా ఇష్టం.
-కె.హరనాథ్‌
సెల్‌: 97035 42598