
సినీ గీత రచయితగా సాహితి గారిది దాదాపు నలభయ్యేళ్ల ప్రస్థానం. ఏ జానర్లోనైనా ఆయన కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఆయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. అందుకే నేటికీ ఆయనను పాట వెదుక్కుంటూ వస్తుంది. తనను అందంగా ఆవిష్కరించమని వేడుకుంటుంది. ఈ వారం ‘జాబిలికీ వెన్నెలకీ’, ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ పాటలపై విశ్లేషణ ఆయన మాటల్లోనే...
‘చిన్న తంబి’ అనే తమిళ సినిమాకి రీమేక్ ‘చంటి’. మూలంలోని ట్రాక్స్ అన్నీ యథాతథంగా వాడారు. కానీ సాహిత్యం దగ్గరకి వచ్చేసరికి పూర్తిగా కొత్త భావాలతో పాటలు రాశాను. ఈ సినిమాలో నేను రాసిన ‘జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలె’ పాట మేల్ వెర్షన్, ఫిమేల్ వెర్షన్లలో కూడా ఉంటుంది. ట్యూన్ మాత్రం ఒక్కటే.
ఫిమేల్ వెర్షన్ పాట కథానాయకుడి చిన్నతనంలో వస్తుంది. సినిమాలో హీరో పాత్ర అమాయకంగా ఉంటుంది. అలా అని సాహిత్యంలో అంత దాన్ని ఇమడ్చాలంటే కష్టం. దానికో కారణం ఉంది. బొత్తిగా లౌకిక జ్ఞానం లేకుండా అతడు మాట్లాడే పదాల్లాంటి పదాలతో పాట రాయలేం. అలా రాసినా ప్రేక్షకులు, శ్రోతలు అంగీకరించరు. పాట హిట్ కావాలంటే ఇక్కడ కొంచెం స్వేచ్ఛ తీసుకోవాల్సిందే. అయితే సినిమా చూసినవారికి, కథ తెలిసిన వారికి అటువంటి హీరో లోతైన పదాలతో పాట ఎలా పాడతాడు? అనే సందేహం వస్తుంది. అందుకు సమాధానంగా ఫిమేల్ వెర్షన్లో ఈ చరణాన్ని ఉపయోగించుకున్నాను. ఎలా అంటే
వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయినిద్ర పాపలకే
..........................................
పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే అని రాసి అతను మంచి పదాలు వాడిన విధానాన్ని సమర్థించుకున్నాను. అలాగే పల్లవిలో ‘గంగలలో తేనెలలో కడిగిన ముత్యములె’ అని రాశాను. ఇక్కడ గంగలలో అనే బహువచనాన్ని నీళ్లు అనే అర్థంలో చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ నేను వాడింది ‘పంచ గంగలు’ అనే అర్థంలో. గంగ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరీ నదులు పంచ గంగలు. అంత పవిత్రమైన వాటిలో కడిగిన మరింత పవిత్రమైన ముత్యానివి నువ్వు అని అర్థం వచ్చేలా పాట రాశాను.
సినిమాలో ఈ పాట మరోసారి కూడా వస్తుంది. అప్పుడు పల్లవిని అలాగే ఉంచి చరణాలను సందర్భానికి తగ్గట్టు మార్చాను. సందర్భం ఏమిటంటే కథానాయకుడు తల్లిని అన్నం పెట్టమని అడుగుతాడు. ‘నువ్వే పెట్టుకు తిను’ అంటుంది. ‘అంటే నువ్వు తినిపించనంటావా? నీ చేత బువ్వ ఎలా తినిపించుకోవాలో నాకు బాగా తెలుసు’ అని పాట మొదలుపెడతాడు. అందుకే చరణంలో తల్లీబిడ్డల మధ్య అనుబంధాన్ని గురించి
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
అమ్మముద్దు కన్నా వేరే ముద్దలేదు ఆకలికి
-------------------------------
అమ్మచేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనే
బువ్వపెట్టి బుజ్జగించె లాలనెంతో తీయనా అని రాశాను. ఇందులో చాలామందికి బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్ ‘అమ్మచేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనే’ అనేది.
పిలిచి రాయించుకున్న పాట ఈ మధ్య కాలంలో నా పాటల్లో విపరీతమైన ఆదరణ పొందిన పాట ‘వేదం’ సినిమాలో ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’. ఈ పాట కూడా నన్ను వెదుక్కుంటూ వచ్చిన పాటే. అనుష్కపై ఓ సోలో సాంగ్ పిక్చరైజ్ చేయాలనే ఆలోచన వచ్చి దర్శకులు క్రిష్... కీరవాణిగారికి చెప్పారట. వెంటనే కీరవాణి అలాంటి సందర్భానికి పాట అంటే సాహితిగారు బాగా రాస్తారు అని నా పేరు సూచించారట. దాంతో క్రిష్ ఈ పాట కోసం నన్ను ప్రత్యేకంగా పిలిపించారు. నెలన్నర పాటు ఈ పాట మీద కూర్చున్నాం. ఇన్ని రోజుల పాటు కూర్చోవడానికి కారణం కీరవాణిగారితో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉండే ప్రత్యేకతే! ఎందుకంటే ఆ నేపథ్యంలో గతంలో వచ్చిన పాటలన్నీ తవ్వి తీస్తారు కీరవాణిగారు. ఆ పాటలకు ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఎలాంటి సాహిత్యం వాడారు అనే విషయాలన్నీ మ్యూజిక్ సిట్టింగ్‌లో చర్చకు వస్తాయి. ఒక మంచి పదం వాడినా, ఒక మంచి వ్యక్తీకరణ పాటలో వచ్చినా దాని గురించి మరికొంత చర్చ నడుస్తుంది. దానివల్ల ప్రధానంగా కలిగే ప్రయోజనం ఏమిటంటే.. ఆ పాటలన్నిటి కంటే భిన్నంగా, ఇంకా మెరుగ్గా సంగీత సాహిత్యాలను ఇవ్వడానికి వీలవుతుంది. ఇలాంటి చర్చలు... దాసరి నారాయణరావు, కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్‌ల దగ్గరైతే నేను చాలా ఎంజాయ్ చేస్తాను.
ప్రస్తుతం కొన్ని చోట్ల ఆ వాతావరణం లేదండి. అంతా ఆన్లైన్లోనే అన్నట్టుగా ఉంటుంది. ఆన్లైన్లో ట్యూన్ వస్తుంది. ఫోన్లో సందర్భం చెపుతారు. రాసి పంపించిన తర్వాత అది ఎప్పుడు రికార్డింగ్ అవుతుందో కూడా గీత రచయితకు తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఈ రోజుల్లోనూ మంచి పాటలు వస్తున్నాయంటే కారణం... దర్శకులే అని చెపుతాను. ఎందుకంటే ఈ డిస్కషన్స్ ద్వారా జరగాల్సిన పనంతా ఇప్పుడు డైరెక్టర్ నెత్తిమీద పడుతోంది. ఇదివరకు డైరెక్టర్ ఇరవై నాలుగు క్రాఫ్టులు చూసుకుంటే సరిపోయేది. ఇప్పటి డైరెక్టర్లు ఆ 24 క్రాఫ్ట్స్ కింద ఉండే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్లో ఉండే వాళ్లతో కూడా సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఎంతో సహనంతో, ఎంతో ఓపికతో ‘బెటర్ అవుట్‌పుట్’ కోసం ప్రయత్నించే వాళ్లు ఉన్నారు. క్రిష్ అలాంటి దర్శకుల్లో ఒకరు. సినిమాపై ఆయనకున్న కమిట్మెంట్ అలాంటిది. ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ పాట కోసం చాలా డిస్కషన్స్ జరిగాయి. ప్రతి డిస్కషన్లోనూ క్రిష్ కూర్చునేవారు. ప్రతిసారీ సన్నివేశాన్ని బ్రీఫ్ చేసేవారు. తనకు పాట ఎలా కావాలో, పాట గురించి తనకెలాంటి ఆలోచనలు ఉన్నాయో చెప్పేవారు. ఎప్పుడూ ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం మా చుట్టూ ఉండేలా చూసేవారు.
ఈ పాట గురించి చెప్పాలంటే క్రిష్ నాతో మాట్లాడుతూ ‘‘సార్ ఇది ఐటెమ్ సాంగ్ కాదు. పాట బాణీ అలా ఉన్నా... పాటలో ఆ అమ్మాయి ఆవేదన కనిపించాలి. బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దిగిన అమ్మాయి ఆ యమకూపం నుంచి బయట పడాలనుకుంటుంది. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటుంది. అదే సమయంలో ఆ ఆవేదనని కూడా ప్రేక్షకుడికి ఉత్సాహం కలిగించేలా చెప్పాలి. అందుకే ఏరికోరి ఈ పాట మీకప్పగించాం’’ అంటూ పాట రాయడానికి నన్ను ప్రేరేపించారు.
నేను పాటపై వర్క్ చేయడం మొదలుపెట్టాను. మరోపక్క కీరవాణిగారు ఏదో హమ్ చేస్తూ ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ అన్నారు. అక్కడే ఉన్న క్రిష్ ‘‘బాగుందండి. నాక్కావల్సింది ఇదే. పాటంతా ఇలాగే ఉండాలి’’ అన్నారు మా ఇద్దర్ని చూస్తూ. పాట రాయడానికి కీరవాణిగారు నాకో హుక్‌లైన్ అందించారు. ట్యూన్ మొత్తం రైమింగ్గా ఉంటుంది. ఇది గజల్ టైపులో ఉండే పాట. కాబట్టి అంతకన్నా మంచిపదాలు పడాలన్నా కష్టమే అని నేను కీరవాణిగారు ఇచ్చిన పదాన్ని యథాతథంగా తీసుకున్నాను. నేనీ పాటలో వాడిన పదాలు కొన్ని ఘాటుగానే ఉన్నాయి. సినిమాతో సంబంధం లేకుండా ఈ పాట వింటే... ‘ఏమిటీ ఈ పాట ఇలా రాశారు?’ అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఆ అమ్మాయి తనెదుర్కొనే పరిస్థితిని వివరిస్తూ... అందుకే ఎగిరిపోవాలనుకుంటున్నాను అని చెప్తుంది కాబట్టి -
తప్పు ఒప్పులు తాతలకొదిలి... సిగ్గుఎగ్గులు చీకటికొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి... తొలి తొలి విరహపు చెరలను వదిలి అని రాశాను. అయితే ఈ పాటలో ఆ అమ్మాయి ‘ఇక్కడ సిగ్గుఎగ్గుల్ని వదిలి పని చేయాలి. అందుకు నేను రెడీగా ఉన్నాను’ అనడం పైకి కనిపించే అర్థం. ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ అనడంలో అసలు అర్థం బయటపడటం. ఈ రెండు అర్థాలనూ ప్రేక్షకుడు గ్రహించగలుగుతాడు.
ఈ పాటకు కరీంనగర్ జానపద కవి లింగారెడ్డి గారి కవితను రిఫరెన్సుగా తీసుకున్నాను. ఆ కవితలో ‘వెన్ను ముదురుతోంది. చన్నుపై చేయి వేయకు’ అని ఉంటుంది. ఆ పదం ఒక్కటే చదివితే బూతు ధ్వనిస్తుంది. కానీ ఆ పదాన్ని దాటుకుని మరింత ముందుకు సాగితే ఆ మాట అన్నది ఓ రైతు అనీ, వరివెన్ను ముదురుతుంది కాబట్టి చన్నుపై చేయి వేస్తే విరిగిపోతుందనే అసలు అర్థం స్ఫురిస్తుంది. అలా నా పాటలో ఓ పక్క విటులను ఆకర్షించే గుణం కనిపిస్తుంది... కానీ పాట లోతుకెళితే అక్కడనుంచి తప్పించుకోవాలనే ఆర్తి కనిపిస్తుంది.
ఇవీ ఈ రెండు పాటల సంగతులు. వీటిని మీతో పంచుకోవడం ద్వారా నన్ను నేను రీఛార్జ్ చేసుకున్నాను. ధన్యవాదాలు.
- రాజేశ్వరి