desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2016 @ 02:52AM

నవీన నాటక శిల్పి

తెలంగాణ దేశ్‌ముఖ్‌ల సంతతికి చెందిన మంత్రి శ్రీనివాసరావుది విలక్షణ వ్యక్తిత్వం, వక్తృత్వం, సమ్మోహన మూర్తిమత్వం. ఇవన్నీ నాటక రంగానికి ఉపకరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1966లో రంగస్థల కళల శాఖను ప్రారంభించినప్పుడు తొలి శాఖాధిపతిగా ఎంపికయిన ఘనత ఆయనది.
 
భాషా సాహిత్య కళారంగాల్లో తెలంగాణ తన మూలాలను అన్వేషించుకుంటూ మరుగునపడిన వైతాళికులను, వారి కృషిని వెలికితీసి సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా పయనం సాగిస్తున్న తరుణమిది. ఈ కోవలో ఇక్కడ పుట్టిపెరిగి యావత్‌ తెలుగు నేలపైన నాటక రంగాన్ని ప్రభావితం చేసి, రంగస్థల ప్రదర్శనల్ని సుసంపన్నం చేసి ఆధునిక తెలంగాణ నాటకానికి ఆద్యుడుగా నిలిచిన మంత్రి శ్రీనివాసరావును ఈ తరానికి పరిచయం చేయాలి. 1928 జనవరి 1న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లిలో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించిన శ్రీనివాసరావు నిజాం కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. నిజాం కళాశాల విశిష్టమైన విద్యా సాంస్కృతిక, భిన్న భావాల విద్యార్థులు, అధ్యాపకులకు నెలవు. ఈ నేపథ్యమే మంత్రి శ్రీనివాసరావుపై ప్రభావం చూపి అనంతర కాలంలో తెలుగు నాటక రంగానికి, తెలంగాణ నాటక రంగానికీ దిశానిర్దేశం చేసే మూర్తిమత్వాన్ని నూరిపోసింది. 1945లో కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావు ఆంగ్ల, తెలుగు నాటకాల్లో నటించడం ప్రారంభించారు. 1946–-47లో ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో చెకోవ్‌ ‘ప్రపోజల్‌’ నాటకంతో రంగస్థలం మీద అడుగుపెట్టారు. అప్పుడే అబ్బూరి వరద రాజేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం శ్రీనివాసరావులో ప్రపంచ నాటక రంగం వైపు ఆసక్తిని పెంపొందింపజేసింది. ఎ.ఆర్.కృష్ణతో పరిచయం, సాన్నిహిత్యం 1952 ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ స్థాపనకు దారితీసింది.
 
ఆధునిక ప్రయోగాల విస్తృతికి ఆ స్నేహాలవల్ల మంత్రి శ్రీనివాసరావుకు చేయూత లభించింది. కమలాదేవి ఛటోపాధ్యాయ జాతీయ నాట్య సంఘానికి అధ్యక్షులుగా వుండడంతో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి నాటకోత్సవాలకు అధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణలో అవే తొలి నాటకోత్సవాలు. బెల్లంకొండ రామదాసు ‘మాష్టార్జీ’ నాటకాన్ని మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్.కృష్ణ, తురగా కృష్ణమోహన్‌ రావు, పన్నూరి రామారావు ప్రదర్శించారు. ఆ స్ఫూర్తితో తెలంగాణలో అనేక నాటకాలు ప్రదర్శితమయ్యాయి. అబ్బూరి రామకృష్ణరావు నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థ వేదికగా మంత్రి శ్రీనివాసరావు నటశిక్షణను, ఆ ప్రమాణాలతో నాటక విస్తృతం చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనంతరం జాతీయ నాట్య సంఘానికి అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ నాట్య విద్యా సంఘాన్ని మంత్రి శ్రీనివాసరావు స్థాపక సభ్యులుగా సేవలందించారు. ‘ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌’ నాటకంలో తెలుగు-తమిళ యాసతో శ్రీనివాసరావు పోషించిన పోస్ట్‌మాస్టర్‌ పాత్ర కొత్త ఒరవడి చూపింది.
 
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లోనూ, గుడివాడ, ఆంధ్ర నాటక కళా పరిషత్‌లోనూ ఆ నాటకానికి చాలా పేరు వచ్చింది. 1957లో ఐ.ఎన్‌.టి నాటకోత్సవాల్లో కుందుర్తి ‘ఆశ’ నాటకాన్ని మంత్రి ప్రయోగాత్మక నాటకంగా ప్రదర్శించారు. దానికి ఆయనే ప్రయోక్త. ఆ నాటకంలో రమామెల్కొటే నటించారు. అదే కోవలో ప్రదర్శించిన శ్రీశ్రీ ‘విదూషకుడి ఆత్మహత్య’ నాటకానికి కుడా ఆయనే ప్రయోక్త. మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ మాండలికంలో 1950-–60 మధ్యకాలంలో అనేక రేడియో నాటకాలను అందించి శ్రవ్య నాటకానికి ఒక దారి ఏర్పరిచారు. సంగీత నాటక అకాడమీ ప్రారంభం సందర్భంగా సభ్యునిగా ఆయన ప్రదర్శించిన ‘నిచ్చెనలు’ నాటికకు గొప్ప పేరు వచ్చింది. 1959లో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 40 రోజులపాటు సంగీత, నృత్య, నాటకోత్సవాలను నిర్వహించడం వెనుక మంత్రి శ్రీనివాసరావు కృషి ఎంతో వుంది. గోరాశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, బెల్లంకొండ రామదాసు, అజంతా ప్రభృతులు నాటకాలపైన సాగించిన చర్చలకు, నాటకాల రిహార్సల్స్‌కు మంత్రి శ్రీనివాసరావు కేంద్ర బిందువుగా ఉన్నారు. తెలంగాణ దేశ్‌ముఖ్‌ల సంతతికి చెందిన మంత్రిది విలక్షణ వ్యక్తిత్వం, వక్తృత్వం, సమ్మోహనమూర్తిమత్వం. ఇవన్నీ నాటకరంగానికి ఉపకరించాయి. సమాచారశాఖలో ఉద్యోగం చేస్తూనే నాటకరంగానికి అంకితమై పనిచేశారు. ఎంతో మందిని రంగస్థలానికి అందించారు.
1959లో ఎ.ఆర్.కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పడిన నాట్య విద్యాలయంలో మంత్రి శ్రీనివాసరావు అధ్యాపకునిగా పనిచేసిన కాలం స్వర్ణయుగం.
 
ఎంతోమంది కళాకారులను తయారు చేశారు. నాట్య విద్యాలయం తెలుగు నాటకరంగానికి ఒక నిత్య ప్రయోగశాలగా పని చేసింది. శిక్షణ శిబిరంలో సదస్సులు జరిగేవి. ఆధునిక నాటక ప్రదర్శనల ప్రమాణాలు పెంచే లైటింగ్‌, స్టేజిడిజైనింగ్‌ వంటి ఎన్నో అంశాలపై చర్చలు సాగేవి. ‘పెద్దమనుషులు’, ‘మృచ్ఛకటికం’, ‘డాలర్‌’ వంటి నాటకాలు చెప్పుకోదగినవి. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని కొత్త ప్రయోగంగా ప్రదర్శించారు. శిష్యుని పాత్రకు రాళ్ళపల్లిని ఎంపిక చేసుకున్నారు. అలాగే మృచ్ఛకటికం ప్రయోగం ఎంతో పేరు పొందింది. రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనను తిలకించి ఎంతో మెచ్చుకున్నారు. 1961లో బ్రిటీష్‌ రంగస్థల నిపుణుడు హెర్బట్‌ మార్షల్‌ బొంబాయిలో నిర్వహించిన ఆంగ్ల నాటకాల్లోనూ నటించారు. లండన్‌లోని బ్రిటీష్‌ డ్రామా లీగ్‌కు భారతదేశం తరపున ఎంపికయిన నలుగురిలో మంత్రి ఒకరు. ఎంతో కష్టపడి లండన్‌ వెళ్ళి శిక్షణ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1966లో రంగస్థల కళల శాఖను ప్రారంభించినప్పుడు తొలి శాఖాధిపతిగా ఎంపికయిన ఘనత శ్రీనివాసరావుకు దక్కింది. తన నాటక ప్రయోగాలకు ఆయన ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ను వేదికగా మలుచుకున్నారు. సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ మూర్తి, అత్తిలి కృష్ణారావు, కృష్ణచైతన్య. ఎస్‌.కె.మిశ్రో, రామవరపు శరత్‌బాబు వంటి వారు మంత్రి శ్రీనివాసరావుకు ప్రియశిష్యులు. 1974 వరకు అక్కడ సేవలందించారు. ఆ ఏడాది అక్టోబర్‌ 9న 46వ యేట అస్వస్థతతో విశాఖలో మరణించారు. ఇంత కాలానికి మంత్రి శ్రీనివాసరావు గురించి పరిశోధించి చాలా విశేషాలను వెలికి తీసిన డా.జె.విజయకుమార్‌జీ అభినందనీయుడు.
డాక్టర్ జె. చెన్నయ్య
(రేపు రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాసరావు జయంతి సభ)