Dec 23 2016 @ 18:38PM

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

నిర్మాణ సంస్థః సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి
 
తారాగ‌ణంః సప్తగిరి, రోషిణి ప్రకాష్‌, శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరులు
 
సంగీతంః బుల్‌గానిన్‌
 
సినిమాటోగ్ర‌ఫీః సి.రాంప్ర‌సాద్‌
 
ఎడిట‌ర్ః గౌతంరాజు
 
డిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌
 
కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌
 
నిర్మాత: డా.కె.రవికిరణ్‌
 
దర్శకత్వం: అరుణ్‌ పవార్‌
 
టాలీవుడ్ క‌మెడియ‌న్స్ హీరోలుగా మారి రాణిస్తున్న త‌రుణంలో ఇప్ప‌టి యంగ్ జ‌నరేష‌న్ క‌మెడియ‌న్స్‌లో ఒక‌రైన స‌ప్త‌గిరి హీరోగా మారి చేసిన చిత్రం `స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌`. నేను కమెడియ‌న్‌గా ఒకే విధ‌మైన క్యారెక్ట‌ర్స్ చేస్తుండ‌టంతో బోర్ కొట్టి హీరోగా మారాన‌ని స‌ప్త‌గిరి చెప్పాడు. సాంగ్స్ ప్రోమోస్‌, టీజ‌ర్ చూస్తే స‌ప్త‌గిరి ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డింది. త‌మిళ చిత్రం రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి హోమియోప‌తి డాక్ట‌ర్ ర‌వికిర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌గ్గర వ‌ర్క్ చేసిన అరుణ్‌ప‌వార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా స‌ప్త‌గిరికి ఎలాంటి గుర్తింపును తీసుకొచ్చిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి...
 
క‌థః
హెడ్ కానిస్టేబుల్ శివ‌ప్రసాద్‌(ఎన్‌.శివ‌ప్ర‌సాద్‌) కొడుకైన స‌ప్త‌గిరి(స‌ప్త‌గిరి)కి సినిమాల్లో రాణించాల‌నే కోరిక ఉంటుంది. అందుక‌ని త‌న వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అయితే శివ‌ప్ర‌సాద్‌కు త‌న కొడుకు త‌న కంటే పెద్ద పోలీస్ ఆఫీస‌ర్ కావాల‌నే కోరిక ఉంటుంది. కానీ స‌ప్త‌గిరి తండ్రి మాట‌ను లెక్క చేయ‌కుండా స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. త‌మ పోలీస్ కాల‌నీలోకి వ‌చ్చిన అమ్మాయి(రోహిణి ప్ర‌కాష్‌)ను ఆట ప‌ట్టిస్తుంటాడు. అదే కాల‌నీలో డి.ఎస్‌.పి పాపాయ‌మ్మ‌(పోసాని కృష్ణ‌ముర‌ళి) అత‌ని ఫ్యామిలీకి శివ‌ప్ర‌సాద్ అంటే న‌చ్చ‌దు. ఊర్లో జరుగుతున్న మాన‌భంగాలు, చైన్ స్నాచింగ్‌ల‌పై శివ‌ప్రసాద్ ఓ ఫైల్ త‌యారుచేస్తాడు. నేరాల‌కు కార‌ణ‌మైన మాణిక్యంను ఎన్‌కౌంట‌ర్ చేయ‌డానికి వెళ్లిన టీంలో శివ‌ప్ర‌సాద్ అనుకోకుండా చ‌నిపోతాడు. శివ‌ప్ర‌సాద్ ఉద్యోగం స‌ప్త‌గిరి వ‌స్తుంది. స‌ప్త‌గిరి పోలీస్ అయిన త‌ర్వాత త‌న తండ్రి త‌న కోసం ఎలాంటి క‌ష్ట‌న‌ష్టాల‌ను ప‌డ్డాడ‌నే సంగ‌తి తెలుస్తుంది. ఈలోపు స‌ప్త‌గిరికి అనుకోని నిజం ఒక‌టి తెలుస్తుంది. ఆ నిజ‌మేంటి? దాని వ‌ల్ల స‌ప్త‌గిరి ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేస్తాడు? త‌ండ్రి కోరిక‌ను స‌ప్త‌గిరి నేర‌వేరుస్తాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే... 
 
విశ్లేష‌ణః
స‌ప్త‌గిరి హీరోగా మార‌డానికి ప‌డ్డ క‌ష్టం తెలుస్తుంది. డ్యాన్సులు విష‌యంలో, ఎక్స్‌ప్రెష‌న్స్ ప‌లికించే విష‌యంలో త‌న క‌ష్టం క‌న‌ప‌డుతుంది. హీరో ఇంట్రడ‌క్ష‌న్ సీన్‌లో ప‌రుశురాముడి పాత్ర‌ధారిగా స‌ప్త‌గిరి న‌ట‌న‌తో పాటు ధుర్యోధ‌నుడి మ‌య‌స‌భ డైలాగ్స్ అన్నీ బాగానే చెప్పాడు. ఇక అక్క‌డక్క‌డా ఓవ‌ర్ హీరోయిజ‌మ్ చూపించాల‌నే ప్ర‌య‌త్నం క‌న‌పడుతుంది. అయితే హీరోయిజ‌మ్‌లోనే కామెడీని మిక్స్ చేసి మంచి ప్ర‌య‌త్న‌మే చేశాడు. ష‌క‌లక శంక‌ర్ కామెడీ కూడా ఆక‌ట్టుకుంది. తండ్రి పాత్ర‌లో శివ‌ప్ర‌సాద్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. పోసాని అత్త పాత్ర‌లో న‌టించిన జ‌బ‌ర్‌ద‌స్త్ న‌టుడి కామెడి పోర్ష‌న్ బావుంది. కామెడీ పార్ట్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. మెయిన్ క‌థ సెకండాఫ్‌లోనే స్టార్ట‌వుతుంది. హీరో త‌న తండ్రి మ‌ర‌ణానికి ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌నే దానిపై కథ నడుస్తుంది. ఫస్టాఫ్ మొత్తంలో సప్తగిరి డైలాగ్ సీన్స్ బాగున్నాయి. సినిమాలో హీరో పాత్ర సీరియస్‌గా నటుడవ్వాలని ట్రై చేస్తుంటుందని చెప్తారు గాని హీరో పాత్రలో ఆ సీరియస్ నెస్‌ని మరికాస్త ఆశిస్తారు ప్రేక్షకులు. బుల్‌గానిన్ సంగీతంలో కేకేట్టిందో... అనే సాంగ్‌... తండ్రిపై వ‌చ్చే సెంటిమెంట్ పాట‌, అన్నీ బావున్నాయి. రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాత ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమాను తెర‌కెక్కించిన తీరు అభినంద‌నీయం.