
నిర్మాణ సంస్థః రామదూత క్రియేషన్స్
తారాగణంః శాండీ, నైనా గంగూలీ, కౌటిల్య, శ్రీతేజ్, వంశీ చాగంటి తదితరులు
సంగీతంః రవిశంకర్
చాయాగ్రహణంః రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి
కూర్పుః సిద్ధార్థ్ రాతోలు
రచనః చైతన్యప్రసాద్, రాధాకృష్ణ
దర్శకత్వంః రామ్‌గోపాల్ వర్మ
నిర్మాతః దాసరి కిరణ్‌కుమార్
రామ్ గోపాల్ వర్మ...ముద్దుగా అందరూ ఆర్జి.వి అని పిలుచుకుంటూ ఉంటారు. శివ సినిమాతోనే సంచలనాకు తెర తీసిన వర్మ అప్పటి నుండి ఏ సినిమా చేసినా ఒకటే. అది హిట్ కావచ్చు, ప్లాప్ కావచ్చు. కానీ సంచలనం క్రియేట్ చేయడం ఖాయం. రామ్‌గోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ సంచనాలకు కొదవే ఉండదు. చివరకు అది సోషల్ మీడియా అయినా సరే...తన స్టయిల్ తనదే. అలాంటి వర్మ చేసిన మరో సంచలనమే `వంగవీటి`. ఈ పేరు చెబితే ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా సెన్సేషనే. విజయవాడ ప్రజల్లో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న వంగవీటి ఫ్యామిలీపై తాను సినిమా చేస్తున్నట్లు వర్మ చెప్పగానే ఇండస్ట్రీయే కాదు, టోటల తెలుగు రాష్ట్రాలంతా వర్మ ఈసినిమాలో ఏం చెబుతాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా రిలీజ్‌కు ముందు వంగవీటి ఫ్యామిలీ సభ్యులు సినిమాపై అభ్యంతరం కూడా తెలియజేశారు. వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహనరంగా పేర్లు వింటే ఇప్పటికీ యువతలో ఊపు కనపడుతుంది. ఇలాంటి వ్యక్తుల జీవితాలపై సినిమా చేయడమంటే చిన్న విషయమైతే కాదు..కుటుంబ పరమైన ఒత్తిళ్లే కాదు, రాజకీయ పరమైన ఒత్తిళ్లు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. దాంతో వంగవీటి సినిమా వర్మ అభిమానుల్లో, ప్రజల్లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. మరి ఈ అంచనాలను వర్మ ఎంత వరకు రీచ్ అయ్యాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం....
కథః
చలసాని వెంకటరత్నం విప్లవ పార్టీకి చెందిన నాయకుడు. విజయవాడలో పేరు మోసిన రౌడీ. తన వద్దకు వచ్చిన వారికి తనకు వీలైనంత సహాయం చేస్తుంటాడు. తన మాట విననివారికి తన కత్తితో బదులిచ్చే వ్యక్తి. అలాంటి వెంకటరత్నం పేరు చెబితే అందరూ భయపడుతుంటారు. కానీ ఒక్క వ్యక్తి. అతనే రాధా. అందరూ అతన్ని బస్టాండ్ రాధా అని పిలుస్తుంటారు. రాదా గురించి తెలుసుకుని గ్యాంగ్ చేర్చుకుంటాడు వెంకటరత్నం. అయితే రాధా పలుకుబడి పెరిగిపోతుండటంతో చెప్పుడు మాటలు విని రాధాను అవమానిస్తాడు. దాంతో రాధా అతని మనుషులు వెంకటరత్నంను చంపేస్తారు. రాధా పెద్ద రౌడీగా పేరు తెచ్చుకుంటాడు. సిటీలో అతని పేరు ప్రాబల్యంలోకి వస్తున్నప్పుడు దేవినేని గాంధీ, నెహ్రు, మురళి అనే కాలేజ్ స్టూడెంట్స్ రాధా వద్దకు చేరుతారు. రాధా పేరు సిటీలో ప్రబలమైపోతున్న సమయంలో ఓ సెటిల్మెంట్ గొడవలో రాధాను కొందరు చంపేస్తారు. దాంతో వంగవీటి మోహనరంగా సీన్లోకి ఎంటర్ అవుతాడు. రాధాపై అభిమానంతో దేవినేని బ్రదర్స్ కూడా మోహన్‌రంగాకే సపోర్ట్ చేస్తారు. అయితే చెప్పుడు మాటలు వినడం, చిన్న చిన్న సమస్యలు పెరిగి పెద్దదవడంతో వంగవీటి మోహనరంగాకు, దేవినేని బ్రదర్స్‌కు మధ్య గొడవ జరుగుతుంది. తమకు వ్యతిరేకంగా గాంధీ స్టూడెంట్ యూనియన్ను రెచ్చగొడుతున్నాడని తెలుసుకున్న మోహనరంగా అతనికి వార్నింగ్ ఇచ్చినా వినకపోవడంతో, గాంధీని తన మనుషులతో చంపించేస్తాడు రంగా. దాంతో దేవినేని కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి దూరం పెరిగిపోతుంది. దేవినేని మురళి తన అన్నను చంపిన వారిని చంపేస్తుంటాడు. మోహనరంగా వార్నింగ్‌ను పట్టించుకోకుండా అతన్ని కూడా చంపేస్తాని అనడంతో మోహనరంగ, దేవినేని మురళిని కూడా చంపేస్తాడు. అప్పటికే దేవినేని నెహ్రు రాజకీయాల్లో ఉండటం, వంగవీటి పార్టీ అధికారంలో లేకపోవడంతో అదను చూసి వంగవీటి మోహనరంగను చంపేస్తారు అసలు ఇంతకు మోహనరంగను చంపిందెవరు? అంతకు ముందు విజయవాడలో జరిగిన పరిస్థితులేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
ప్లస్ పాయింట్స్ః
- నటీనటుల పనితీరు
- సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
- డైలాగ్స్, నెరేషన్
మైనస్ పాయింట్స్ః
- సినిమా క్లైమాక్స్ క్వొశ్చన్ మార్కులా వదిలేయడం
- వంగవీటి మోహన రంగ క్యారెక్టర్‌ను ఇంకాస్తా బెటర్‌గా చూపాల్సింది
- రత్నకుమారి పాత్రను నెగటివ్‌గా ఎలివేట్ చేయడం
విశ్లేషణః
వంగవీటి రాధా, మోహన రంగ పాత్రల్లో సందీప్ కుమార్ అలియాస్ శాండీ నటన సింప్లీ సూపర్బ్. వంగవీటి రాధాకృష్ణ పాత్రలో ఓ బాడీ లాంగ్వేజ్‌ను, రంగా పాత్రలో మరో బాడీ లాంగ్వేజ్‌లో వేరియేషన్ చూపుతూ చక్కగా నటించాడు. డైలాగ్స్ డెలివరీ కూడా చక్కగా అతికినట్లు సరిపోయింది. రత్నకుమారి పాత్రలో నటించిన నైనా గంగూలీ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక దేవినేని మురళి పాత్రలో నటించిన వంశీ చాగంటి. స్క్రీన్‌పై మంచి ఎమోషన్స్‌ను చూపించడంలో మంచి పెర్ఫామెన్స్ చేశాడు. దేవినేని గాంధీ పాత్రలో నటించిన కౌటిల్య, నెహ్రు పాత్రలో నటించిన శ్రీతేజ్, విప్లవ పార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన నటుడు సహా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సంచలనాత్మకమైన బయోపిక్‌లను తీయడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ తనెంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి సీన్‌ను చక్కగా నెరేట్ చేశాడు.
అయితే సినిమా చూస్తున్నవారికి వంగవీటి మోహన రంగ పాత్రను ఇంకాస్తా ఎలివేట్ చేసుంటే బావుండేదనిపించి. ఎందుకంటే వాస్తవంగా మోహనరంగ హత్యానంతరం దాదాపు నలబై రోజుల పాటు విజయవాడ సిటీలో కర్ఫ్యూ కొనసాగింది. అంతటి ఇమేజ్ ఉన్న వ్యక్తి పాత్రను సెకండాఫ్‌లో సింపుల్‌గా చూపించేశారనిపించింది. ఇంకాస్తా డెప్త్‌గా చూపించి ఉంటే బావుండేంది. చైతన్యప్రసాద్, రాధాకృష్ణ రాసిన డైలాగ్స్ చక్కగా ఉన్నాయి. రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్‌ను ఎఫెక్టివ్‌గా తెరపై చూపడంలో వీరు సక్సెస్ అయ్యారు. రవిశంకర్ అందించిన ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంతో పాటు పాటలను కూడా పాడేశాడు. ఓ రకంగా చెప్పాలంటే కథను నెరేట్ చేసేలా పాడటంతో పాటలు వర్మ టోన్ చక్కగా సూట్ అయినట్లు అనిపించింది. చంపరా చంపేయ్యారా, కమ్మ కమ్మ ..కాపు కాపు..సాంగ్, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ..సాంగ్ కసి కసి.. పాట ఇలా అన్నీ సాంగ్స్ కథలో భాగంగా చక్కగా ఇమిడిపోయాయి.
సినిమాలో రంగ పాత్రను హత్యలు చేయమని రత్నకుమారి ప్రోత్సహించినట్లు వర్మ చూపించడం ఎంత వరకు సబబో తెలియలేదు. అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను సరిగ్గా చూపించకకుండా మేనేజ్ చేసినా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్ అనే ప్రజలు అరిచే సౌండ్, సైకిల్ గుర్తున్న జెండాలు ఇలా చాలా విషయాల్లో దర్శక నిర్మాతలకు..ఇలా ఎలా చేశారంటూ ప్రశ్నలు ఎదురుకావచ్చు. మొత్తంమీద రామ్‌గోపాల్ వర్మ తాను తెలుగులో తీసే చివరి చిత్రం వంగవీటి అని చెప్పాడు. ఓ రకంగా వర్మ అభిమానులు ఫీలయ్యారు. కానీ వర్మ తన పనిని తాను చేసుకుపోవడంలో ఏ మాత్రం ఫీలింగ్ లేకుండా చక్కగా తన స్టయిల్లో సినిమాను తెరకెక్కించాడు...
బోటమ్ లైన్ః వంగవీటి...వర్మ మరో సంచలనం...
రేటింగ్ః 3/5