Dec 21 2016 @ 07:59AM

చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బలహీనపడటానికి కారణాలు ఇవేనా?

తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయి. 13 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. తెలుగుదేశాధీశుడైన చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ ఒక్కమాటపై లేరనేది చేదు నిజం.అయితే చంద్రబాబుకు భయపడో, లేక పార్టీని గౌరవించో ఈ నియోజకవర్గంలో ఆధిపత్యపోరు బహిరంగంగా కనిపించడం లేదు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి బలమైన నాయకులు వచ్చారు. వీరిలో కొందరు గెలిచారు. కొందరు ఓడారు.గెలుపోటములను పక్కనబెడితే...ఈ నియోజకవర్గాల్లో పార్టీ బలపడిందా అంటే చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే అలా జరిగిందని చెప్పాల్సి వస్తోంది.రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ కొత్త, పాతనాయకులు కలిసింది లేదు. పార్టీ బలపడిందీ లేదు.
- ఆంధ్రజ్యోతి, తిరుపతి

  • పాత నాయకులున్న నియోజకవర్గాల్లో కూడా వర్గపోరు కొనసాగుతోంది. దీనికి ఉదాహరణ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఇక్కడ మున్సిపల్‌ చైర్మన, వైస్‌ చైర్మన్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కౌన్సిల్‌ మీటింగ్‌లో పరస్పరం దాడులు చేసుకొంటు న్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో టీటీడీ నాయకులు రెండు గ్రూపు లుగా చీలిపోయారు.ఎన్నికల సందర్భంగా తెలు గుదేశం తీర్థం పుచ్చుకున్న ఎస్వీవీ నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా మసలుతు న్నారు.
  • ఎప్పుడూ తన చుట్టు వందమంది కార్యకర్తలను నిలుపుకునే నాయకుడు ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు. ఈయన ప్రభ కూడా ఇప్పుడు తగ్గుతోంది.నగరి నియోజకవర్గంలో చాలామంది సీనియర్‌ నాయకులు ఈయన వెంట కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా నియోజక వర్గ పరిధిలోని రెండు మార్కెటింగ్‌ కమిటీలకు నియామకాలు జరిపించలేదని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఆ కారణంగానే ఈయన కార్యక్రమాలకు వెళ్లకుండా మొహం చాటేస్తున్నారు.
  • పలమనేరు నియోజకవర్గంలో పాత నాయకుడు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మళ్లీ పార్టీలోకి వచ్చారన్న మాటే కానీ పార్టీలో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు. ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జి సుబాష్‌చంద్రబోస్‌, అమరనాధరెడ్డి వర్గాలు కలవడం లేదు. అధికారుల బదిలీల్లో సైతం ఇద్దరు నేతలు వేర్వేరుగా సిఫార్సులు చేస్తున్నారు.
  • పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య దాదాపు గా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. బంగారు పాళ్యం, పూతలపట్టు, ఐరాల మండలాల్లో టీడీపీ శ్రేణులు రెండు గ్రూపులుగా చీలిపోయాయి. ఇన్‌ఛార్జి లలితకుమారి ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమవుతున్నారు.
  • సత్యవేడు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన తండ్రి ఒక వర్గం కాగా, పార్టీ శ్రేణులు మరో వర్గంగా చీలిపోయాయి. ఎమ్మెల్యే, ఆయన తండ్రి అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ నాయకులే రచ్చకెక్కారు.కొన్ని రోజుల క్రితం మంత్రి బొజ్జల, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ చిత్తూరుకు నియోజకవర్గ నేతలందరినీ పిలిపించి రాజీ ప్రయత్నాలు చేశారు.
 
 ఆ మూడు చోట్ల పార్టీ ఉనికే లేదు
  • సీఎం సొంత జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ అభిమానులు, సానుభూతిపరులకు కొదవ లేదు.అయితే ఈ నియోజకవర్గానికి నాయకులెక్కువ య్యారు.నలుగురు నాయకులు నాలుగు గ్రూపులుగా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించారు. ఎన్నికలై రెండున్నర సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ ఇనచార్జిని నియమించలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని బీజేపీకే కేటాయిస్తారనే పరోక్ష సంకేతాలు అందడంతో నాయకులు ఎవరిదారిలో వారున్నారు. దీంతో గత ఎన్నికల నాటికంటే ఇక్కడ టీడీపీ బలహీనంగా కనిపిస్తోంది.
  • పుంగనూరు నియోజకవర్గంలో ఇనఛార్జి ఉన్నారు కానీ పార్టీ బలపడిన దాఖలాలు కనిపించలేదు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి అగ్రనేతల నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ఎవరూ కృషి చేసిన దాఖలాల్లేవు.
  • పీలేరు పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు. అభ్యర్థుల విషయం లో పార్టీ అధిష్ఠానం చేసిన ప్రయోగాలు ప్రతిపక్షాలకు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇనఛార్జికి, మాజీ ఇనఛార్జికి సంబంధించి రెండు గ్రూపులున్నాయి. పార్టీ బలప డింది లేదు కానీ గ్రూపు రాజకీయాలు మాత్రం పెరిగిపోయా యి. అన్ని వర్గాల్లో బలమైన పట్టు కలిగిన జీవీ శ్రీనాధరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు కానీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలను ఉపయోగించుకోవడం లేదు.