Dec 14 2016 @ 19:19PM

విశాఖ గాంధీ ఇకలేరు

విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుడు, కార్మిక సంఘ నేత, విశాఖ గాంధీ కొల్లూరు సత్యనారయణ శాస్త్రి ఇకలేరు. మంగళవారం అర్ధరాత్రి ఆయన స్వర్గస్తులయ్యారు. ఆయనకు 95 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య రమణమ్మ, కొడుకు వెంకటరమణ, కోడలు ప్రభ, మనవరాలు శ్రావ్య ఉన్నారు. వారంతా తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయారు. భార్య రమణమ్మతో కలిసి వైజాగ్‌లోని శ్రీనగర్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. విశాఖకు ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు కన్నీటి పర్వతమయ్యారు. గాంధీ, నెహ్రూ, సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులతో ఆయనకు కేఎస్ శాస్త్రికి సాన్నిహిత్యం ఉంది. వారితో కలిసి పనిచేశారు. ముఖ్యంగా శాస్త్రిపై గాంధీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఏం సాధించాలన్నా గాంధేయ మార్గమే శరణ్యమని ఆయన గట్టిగా నమ్మేవారు. జీవితాంతం అదే మార్గాన్ని ఆయన అనుసరించారు. అదే మార్గంలో వెళ్లాలని అందరికీ చెప్పేవారు.
 
ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్యకు శాస్త్రి స్వయానా బావమరిది. విశాఖనగరంలో గాంధీ సెంటర్‌ వ్యవస్ధాపక కార్యదర్శిగా 40 ఏళ్లుగా ఉన్నారు. వివిధ ట్రేడ్‌ యూనియన్లకు నాయకుడిగా వ్యవహరించారు. గతనెల 16న ఆయన 94వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం ఆయన బాత్ రూంలో కాలు జారిపడిపోయారు. తుంటి ఎముకకు గాయం అవ్వడంతో కేర్‌ ఆసుపత్రిలో చేర్చించారు. దీనికితోడు ఆయన కొద్ది రోజులుగా హృద్రోగంతో బాధ పడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా ఆస్పత్రి నుంచి శాస్త్రి పార్దివదేహాన్ని ఆయన ఇంటికి తీసుకువచ్చారు. శాస్త్రి మృతి విషయం తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. విశాఖ ఏంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ, మాజీ ఉన్నతాధికారి ఈఎఎస్‌ శర్మ, గీతం కులపతి ఆచార్య కోనేరు రామకృష్ణారావు, నాగార్జున వర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య వి. బాలమోహన్‌దాస్‌, ఇంకా ప్రసన్నకుమార్‌, షిరీన్‌ రెహమాన్‌, తదితరులు నివాళులర్పించారు. కాగా ఇంటి నుంచి శాస్త్రి అంతిమయాత్ర జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు సాగింది. అక్కడ రెండు నిమిషాలు మౌనం పాటించిన తరువాత జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.