
- నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
బాపట్ల, గుంటూరు: మానవుల మాన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. ఇవి పుట్టుకతో ప్రతి వ్యక్తికి లభించే హక్కులు. నేడు నిత్యం ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరుగుతూనే ఉంది. జాతి, మత మౌఢ్యం వల్ల, రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత ద్వేషం, కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణమయ్యాయి. ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ ద్వారా మానవాళికి మానవ హక్కులను అందించింది. అందుకే డిసెంబర్ 10ని ‘అంతర్జాతీయ మానవహక్కుల దినం’గా అన్నిదేశాల్లో జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదులను సత్వరం విచారించడానికి కోర్టులతో పాటు మనదేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మానవహక్కుల కమిషన్లు ఏర్పాటయ్యాయి.
కమిషన్ల చిరునామాలు 1. జాతీయ మానవహక్కుల కమిషన్ ఫరీద్కోట్ హౌస్, కోపర్నికస్ మార్గ్, న్యూఢిల్లీ -110001
ఫోన్: 011 23384012, హెల్ప్‌లైన్: 098102 98900
2. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమీషన్ గృహకల్ప కాంప్లెక్స్, ఎంజె రోడ్
నాంపల్లి, హైదరాబాద్ -500001
ఫోన్: 040-24601574, ఫాక్స్ : 040-24601573
మానవ హక్కులు 1. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
2. చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు
3. వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచాల నుండి రక్షణ పొందే హక్కు
4. సరైన కారణం లేకుండా నిర్బంధించబడకుండా ఉండేహక్కు. నేరస్తులుగా అనుమానిస్తున్నా, నిందితులని తేలే వరకు నిరపరాధులే.
5. ఒక అభియోగం ఆపాదించబడినప్పుడు, పక్షపాతరహితంగా విచారణ పొందే హక్కు.
6. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాల్లో పర్యటించే హక్కు.
7. సురక్షిత ప్రాంతంలో ఏకాంతంగా జీవించే హక్కు.
ఇవికాక, జీవించే హక్కు, సామాజిక భద్రతాహక్కు, భావ స్వాతంత్య్రహక్కు, విద్యాహక్కు, పిల్లలు ఆడుకొనే హక్కు, ప్రజాస్వామ్య హక్కు, కాపీరైటు హక్కు, జాతీయత హక్కు, ఏమతాన్నయినా స్వీకరించే హక్కు వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి. ఇవి ఉల్లంఘించబడినపుడు ప్రత్యేక కోర్టులను, కమిషన్లను ఆశ్రయించవచ్చు.