
- 2015 ప్రతిభా పురస్కారాలకు 12 మంది ఎంపిక
రవీంద్రభారతి/హైదరాబాద్: ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె.శ్రీనివా్‌సకు తెలుగు విశ్వవిద్యాలయం 2015 ప్రతిభా పురస్కారం లభించింది. పత్రికా రంగం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. డాక్టర్ కె.శ్రీనివా్‌సతోపాటు వివిధ రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న వారికి కూడా పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 12 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారని తెలిపారు.
2015 ప్రతిభా పురస్కారగ్రహీతలు వీరే.. ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె.శ్రీనివాస్ (పత్రికారంగం), డాక్టర్ అఫ్సర్ (కవిత), డా.రెంటాల వెంకటేశ్వరరావు (విమర్శ), డిఎల్ఎన్.రెడ్డి (చిత్రలేఖనం), చింతా జగదీష్ (శిల్పం), భీమన్ (నృత్యం), డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు(సంగీతం), తడకమళ్ళ రాంచందర్‌రావు (నాటక రంగం), మారోజు అప్పయ్య (జానపదకళలు), డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ (అవధానం), నెల్లుట్ల రమాదేవి (ఉత్తమ రచయిత్రి), పి.చంద్ (నవల/కథ)లను ఎంపిక చేశారు. త్వరలో తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వీసీ చెప్పారు. పురస్కారగ్రహీతలను 20,116 నగదు, ప్రశంసాపత్రం, శాలువతో సత్కరించనున్నట్లు వీసీ వెల్లడించారు.