Dec 5 2016 @ 09:48AM

నోట్ల రద్దు ప్రభావం సినీ రంగంపై ఎక్కువే: నటుడు రవి ప్రకాశ్

సింహాచలం, విశాఖ: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సినీ రంగం మీద కూడా ఎక్కువగానే పడిందని ప్రముఖు నటుడు రవిప్రకాష్‌ అన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కుటుంబ సమేతంగా సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కళాకారులకు నిర్మాతలు చెల్లింపులన్నీ చెక్కుల రూపంలోనే ఇస్తారని, ఇతర అవసరాలకు, డిసి్ట్రబ్యూటర్ల నుంచి చెల్లింపులు అన్నీ నగదు రూపంలోనే జరుగుతుంటాయన్నారు. ఈ కారణంగా సినీ రంగంపై పెద్ద నోట్ల ప్రభావం అధికంగా పడి సినిమాల నిర్మాణం తగ్గిందన్నారు. మరొక ఆరు నెలల పాటు ఈ పరిస్థితులను ఎదుర్కొనక తప్పదన్నారు. కేంద్ర పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆహ్వానించదగినదేనని తాత్కాలికంగా ఇబ్బందులు భరించాల్సిందేనన్నారు. విశాఖలో పుట్టిపెరగడం వలన విశాఖ అందాలంటే తనకు మక్కువ అన్నారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొత్తం మీద సుమారు 130కి పైగా సినిమాల్లో నటించానని చెప్పారు. ప్రస్తుతం బాలకృష్ణ నూరో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, రామ్‌చరణ్‌ నటించిన ధృవ, పవన్‌ కల్యాణ్‌ కాటమరాయుడు సినిమా ల్లో నటించానన్నారు. వాటితోపాటు మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. ఉషాకిరణ్‌ మువీస్‌ నిర్మించిన శుభవేళ సినిమాతో హీరోగా పరిచయమై ఇప్పటివరకు తెలుగులో సుమారు 120వరకు, ఇతర భాషల్లో మరో పది సినిమా లు నటించానని తెలిపారు.