Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 26 Nov 2016 22:45:40 IST

ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్

ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్

జీవితంలో హ్యాపీడేస్‌ ఉంటే బావుణ్ణు అనుకోని వాళ్లు ఉండరు. ఆ సినిమాతో నటుడైన నిఖిల్‌ కూడా ఎన్నో కలలు కన్నాడు. హీరో అయ్యాడు. నిలదొక్కుకునేలోపు ఫ్లాపులు. మళ్లీ హఠాత్తుగా ఒక హిట్టు. ఇలా ‘స్వామిరారా’ వరకు పడుతూలేస్తూ వచ్చిన నిఖిల్‌.. ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’ లతో.. జోరందుకున్నాడు. తాజాగా ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’తో దూసుకెళుతున్న ఆ యంగ్‌హీరోతో ముచ్చట్లు.. 

నోట్ల రద్దులో కూడా ఈ చిన్నవాడు థియేటర్లలో తెగ అల్లరి చేస్తున్నట్లున్నాడు..

‘ఎక్కడి పోతావు చిన్నవాడ’ సినిమా చూసి థియేటర్ల నుంచి సంతృప్తిగా వస్తున్న ప్రేక్షకులను చూస్తుంటే ముచ్చటేస్తోంది. నోట్ల రద్దుతో చేతిలో నగదు లేకపోయినా మా సినిమా అందర్నీ అలరిస్తున్నది. నా కెరీర్‌లో ఇదే పెద్ద హిట్‌. జనాలకు ఇంత బాగా నచ్చుతుందని నేను ఊహించలేదు. కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్నది ప్రతిసారీ నిరూపితం అవుతోంది. ఇప్పుడు కూడా అదే అయ్యింది.

 
అందుకేనే మీరు భిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నారు..
హిందీలో అమీర్‌ఖాన్‌ లాంటి హీరోలు వాణిజ్య విలువలున్న సినిమాలు చేస్తూనే.. ప్రత్యేక కథల్ని ఎంచుకుంటున్నారు. అవి ప్రేక్షకులకు నచ్చితే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండూ వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఆ ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు. నా దృష్టిలో విమర్శకుల ప్రశంసలు పొందుతూ మంచి వసూళ్లు సాధించేది మంచి సినిమా. నేను అలాంటి జోనర్‌ను ఎంచుకున్నాను. ఆసక్తికరమైన కథల్ని ఎంచుకోకపోతే నాలాంటి హీరోల సినిమాలను ప్రేక్షకులు చూడరు. నాకు ప్రత్యేక గుర్తింపూ ఉండదు.
 
స్టార్‌ఇమేజ్‌కు దూరంగా ఉంటున్నారన్నమాట..
తొమ్మిదేళ్ల కిందట ‘హ్యాపీడేస్‌’ వచ్చింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ నాకు పదమూడో చిత్రం. ఈ ప్రయాణంలో ఎన్నో ఫ్లాప్‌లు, హిట్లు వచ్చాయి. ఫలితం అటుంచితే - థియేటర్లలో, టీవీల్లో ప్రేక్షకులకు మరింత దగ్గరైతే అయ్యాను. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు జరిగుండొచ్చు. నేను ఎంపిక చేసుకున్న కథలు ప్రేక్షకుల మెప్పు పొందకపోవచ్చు. నాకు సూపర్‌స్టార్‌ ఫాదర్‌లు లేరు. ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. నేను చేసిన తప్పుల్ని .. నేనే అనుభవంతో తెలుసుకుని.. నేనే సరిదిద్దుకోవాల్సి వచ్చింది. స్టార్‌ ఇమేజ్‌తో మాస్‌ హీరోను కాలేను. కాబట్టి మంచి కుటుంబ కథలతో ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే చాలన్నది నా అభిప్రాయం. ప్రత్యేక కథల్ని ఎంచుకోవడానికి ఇదే కారణం.
 
ఐదేళ్లు వెనక్కి వెళితే - వరుస ఫ్లాప్‌లు వచ్చినప్పుడు ఎలా తట్టుకున్నారు..
ఒక సందర్భంలో - ‘‘సరస్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడికే డబ్బులు వస్తాయి’’ అని శేఖర్‌ కమ్ముల గారు చెప్పారు. నా వయసు, అనుభవం పెరిగే కొద్దీ ఆ మాటకు విలువ పెరుగుతూ వస్తోంది. నాలో ఎంతో మార్పుకు దోహదపడ్డ మాట అది. 2008 నుంచి 2012 వరకు ‘అంకిత, పల్లవి ఫ్రెండ్స్‌’, ‘యువత’, ‘కలావర్‌ కింగ్‌’, ‘ఓంశాంతి’, ‘ఆలస్యం అమృతం’, ‘వీడుతేడా’ ఇలా వరుసగా నిరుత్సాహపరిచాయి. ‘డిస్కో’ అనే చిత్రానికి నేను పడ్డ కష్టం అంతాఇంతా కాదు. అంచనాలన్నింటినీ తలకిందులు చేసిందా సినిమా. ఎంతో ఒత్తిడికి గురయ్యాను. నాకు ఆర్థిక కష్టాలు లేవు. కానీ హీరోగా నిలదొక్కుకునే సమయంలో అలాంటి వైఫల్యం నన్ను కుంగదీసింది. అప్పటి నుంచి శేఖర్‌కమ్ముల మాటను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాను. కథను ఎంచుకునేప్పుడు.. జాగ్రత్తలు తీసుకోవడం. ఒకటికి రెండుసార్లు ఆలోచించడం.. సృజనాత్మకత కలిగిన దర్శకులను ఎంచుకోవడం.. మొహమాటలకు పోకుండా నచ్చినప్పుడే సినిమా చేయడం... అలా కళను బయటికి తీశాక.. ఫలితం దక్కింది. కళను నమ్ముకుని సరస్వతీదేవి వద్దకు వెళ్లాను కనక.. ఇప్పుడిప్పుడే డబ్బులు వస్తున్నాయి (నవ్వుతూ).
 
వివి వినాయక్‌ కూడా మీకు ఇన్స్‌పిరేషన్‌ అంటుంటారు..
నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంటారాయన. ప్రతి సినిమాకు ఏదో ఒక రకంగా వినాయక్‌ గారి సలహాలు స్వీకరిస్తుంటాను. ఒక సందర్భంలో వివిగారు ‘‘నిఖిల్‌.. వరుస హిట్లు కొడితేనే నువ్వు స్టార్‌వు అవుతావు. ఒక సినిమా హిట్‌ అయినప్పుడు మరోసినిమా ఎంపిక విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా రెండో హిట్‌ వస్తుంది’’ అని చెప్పారు. ‘స్వామిరారా’ అంత పెద్ద హిట్‌ అవుతుందని, అదే నాకెరీర్‌కు బ్రేక్‌ ఇస్తుందని ఊహించలేదు. ఆ వెంటనే ‘కార్తికేయ’ అనే ప్రత్యేక కథను ఎంచుకున్నాను. నిఖిల్‌ అనగానే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆ చిత్రాన్ని చూశారందరూ. ఇలా వరుసగా రెండు హిట్లు వచ్చాక.. నా మీద నాకు నమ్మకం కలిగింది. అప్పటి నుంచి నిఖిల్‌ అనేవాడు ఒకడున్నాడు అనుకునేంత గుర్తింపును తీసుకొచ్చింది. ‘కార్తికేయ’ విజయం తరువాత మురుగన్‌ పట్ల భక్తి సెంటిమెంట్‌గా మారింది.
 
అందుకేనా.. ఆ మధ్యన కార్తికేయస్వామి శూలం టాటూను ట్విట్టర్‌లో పెట్టారు..
‘కార్తికేయ’ హిట్‌ అయిన తరువాత మురుగన్‌ మీద భక్తి పెరిగింది. మా నాన్నతో కలిసి తమిళనాడులోని పళనిలోనున్న కార్తికేయస్వామి దేవాలయానికి వెళ్లాను. సినిమా చేస్తున్నప్పుడే ఆ స్వామి చరిత్ర, మహిమలు తెలుసుకున్నాను. గుడిలో స్వామిని దర్శించుకున్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పటి నుంచి ఆయనంటే అపరమైన భక్తి. త్రిశూలం, బ్రహ్మాస్త్రం కన్నా శక్తివంతమైనది కార్తికేయస్వామి శూలం. అందుకే వియత్నాం వెళ్లినప్పుడు ఆ శూలాన్ని వీపు మీద టాటూగా వేయించుకున్నాను. ఆ దేశంలో అద్భుతమైన టాటూలు వేస్తారు. ఇక, వెంకటేశ్వరస్వామి అంటే కూడా భక్తి. సినిమా బాగా ఆడితే తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించుకోవడం అలవాటు. ప్రస్తుతం నా సినిమా బాగా ఆడుతుంది కాబట్టి త్వరలోనే గుండు చేయించుకోబోతున్నాను.
 
సినిమా తొలి రోజు ఫలితం గురించి టెన్షన్‌ పడుతుంటారా?
నాకు ఓపెన్‌గా ఉండే ఫ్రెండ్స్‌ ఉన్నారు. తొలిరోజు సినిమా చూడగానే ఉన్నదున్నట్లు చెప్పేస్తారు. ఆ రెండు మూడు రోజుల్లోనే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ పరిశీలిస్తాను. సోషల్‌ మీడియా వచ్చిన తరువాత ఎడిటింగ్‌ లేని ప్రజాభిప్రాయం అందులో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే.. నేను సోషల్‌మీడియాలో రహస్య అకౌంట్లతోను సినిమాల పట్ల అభిప్రాయాలను పరిశీలిస్తుంటాను (నవ్వులు). పత్రికలు, ఇంటర్‌నెట్‌ సైట్లలో వచ్చే రివ్యూలను కూడా సీరియ్‌సగా చదువుతాను. లోటుపాట్లను నిజాయితీగా స్వీకరిస్తాను.
 
మీరు టెక్‌శావీనా..
నేను అతిగా గాడ్జెట్స్‌ వాడను. నా చేతిలో ఐఫోన్‌ కూడా లేదు. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ వాడుతుంటా. కొత్త యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పనికొస్తుందా లేదా పరిశీలిస్తుంటా. ఇంటర్‌నెట్‌లో తాజా ప్రపంచవార్తల్ని తెలుసుకోవడం ఇష్టం. పుస్తకాలంటే మహా పిచ్చి. మా ఇంట్లోని రెండు గదులు పుస్తకాలతో నిండిపోయాయి. చిన్నప్పుడు ఆబిడ్స్‌కు వెళ్లి పాత పుస్తకాలు కొని చదివేవాణ్ణి. వీడియోగేమ్స్‌ వంటివి ఇష్టం ఉండేది కాదు. బయట ఎంత అల్లరి చేసేవాణ్ణో.. ఇంటికొస్తూనే అంత కూల్‌గా పుస్తకాలు చదివేవాణ్ణి. ఇప్పటికీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా చదవడం మానను.
 
వరుస హిట్‌లతో జోరు మీదున్నారు.. పెళ్లి సంగతి మరిచిపోయారా?
హహహ (నవ్వుతూ). ఇప్పుడు నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కాదు. భార్య కావాలి. నిజానికి నాకు గర్ల్‌ఫ్రెండ్స్‌ అయితే లేరులెండి. నేను త్వరలోనే పెళ్లి చేసుకోవాలని మా అమ్మానాన్నలు రోజుకొక అమ్మాయి ఫోటో చూపిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధమా, నాకు నచ్చిన అమ్మాయా.. చెప్పలేను. ఎప్పుడు ఏ అమ్మాయి నచ్చుతుందో మన చేతుల్లో ఉండదు. మొత్తానికి పెళ్లి చేసుకునే రోజులు వచ్చేశాయి. నా జీవిత భాగస్వామి నన్ను అర్థం చేసుకునేదైతే చాలు. అంతకు మించి అంచనాలు పెట్టుకోకూడదు.
 
మీరు రోజు మాట్లాడుకునే క్లోజ్‌ఫ్రెండ్స్‌..
‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి, ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్‌వర్మ నాకు ఆత్మీయ మిత్రులు. నిత్యం కలుస్తుంటాము. తరచూ మాట్లాడుకుంటాం. సినిమాలు, వ్యక్తిగత జీవితం అన్ని విషయాలను స్వేచ్ఛగా మాట్లాడుకునేది ఈ ఇద్దరి మిత్రుల దగ్గరే. వాళ్లతో ఎందుకో అంతగా అనుబంధం ఏర్పడింది. మేమందరం కలిసినప్పుడు లోకాన్ని మరిచిపోతాం. నటుల్లో రాజ్‌తరుణ్‌తోను క్లోజ్‌గా ఉంటాను. నా సినిమా హిట్‌ అయితే తన సినిమా హిట్‌ అయినట్లు ఉప్పొంగిపోయే గుణం రాజ్‌లో ఉంది.
 
మీ తొలి చిత్రం ‘హ్యాపీడేస్‌’ కంటే ముందు బ్యాడ్‌డేస్‌ గుర్తున్నాయా?
ఓ పెద్ద టీవీ ఛానల్‌ నటుల ఎంపిక పోటీలు నిర్వహించింది. నాలుగు మాసాలు ఎంతో కష్టపడ్డాను. వేలమంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే తీవ్రమైన పోటీ. నేను ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. అన్ని ఎపిసోడ్లు పూర్తయ్యాక ఫైనల్స్‌కు ఎంపికయ్యాను. ఇక, నాతో సినిమా తీస్తారని ఆశగా ఎదురుచూశాను. టీవీ యాజమాన్యం చేతులెత్తేసింది. నేను హీరో కాలేకపోయా. మరో సంఘటన - ఒక పెద్ద రైటర్‌. సినిమా తీయాలని పూనుకున్నాడు. నటుల ఎంపికలో నేను సెలెక్ట్‌ అయ్యా. ఎప్పుడెప్పుడు అతను సినిమా షూటింగ్‌ మొదలు పెడతాడాని ఎదురుచూశా. రోజులు గడిచిపోయాయి కానీ షూటింగ్‌ మొదలవ్వలేదు. కొన్నాళ్లకు ఆ రైటర్‌కు, నిర్మాతకు గొడవలు జరిగి.. ఆ సినిమా అంతటితో ఆగిపోయింది. అప్పుడూ హీరో కాలేకపోయా.
 
మూడోసారి అయినా అవకాశం వచ్చిందా?
ఒక ప్రొడక్షన్‌లో నాకు అవకాశం వచ్చింది. ఈసారికి తప్పకుండా నటుడు అవుతానన్న నమ్మకం కలిగింది. ఆ సంస్థ వాళ్లు నాకు నటనలో శిక్షణకూడా ఇప్పించారు. అంతా సవ్యంగా ఉంది. ఈసారి ఏ అడ్డంకులు ఎదురవ్వకూడదు దేవుడా అనుకుంటున్నప్పుడే.. ఆ ప్రొడ్యూసర్‌ ఏదో కేసులో అరెస్ట్‌ అయ్యారు. అప్పుడు నేను ఎంత నిరుత్సాహపడ్డానో చెప్పలేను. ఇలా మూడుసార్లు దగ్గరికి వచ్చి.. అవకాశాలు కోల్పోయాను. ఇక జన్మలో హీరో కాలేను అనుకుంటూ రోడ్డు మీద వెళుతుంటే ‘కొత్త నటుల ఎంపిక’ అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డు కనిపించింది. నేను వెళ్లి దరఖాస్తు చేశాను. నాతోపాటు లక్షా ఇరవై వేల మంది చేశారు. అదృష్టం కొద్దీ నేను ఎంపికయ్యా. శేఖర్‌
కమ్ముల గారి ‘హ్యాపీడేస్’తో నా హ్యాపీడేస్‌ మొదలయ్యాయి.
 
‘హ్యాపీడేస్’లో అవకాశం రాకపోయుంటే.. ఎందులో స్థిరపడేవారు?
హైదరాబాదీలైన మా అమ్మానాన్నలు శ్యామ్‌సిద్దార్థ, వీణాసిద్ధార్థలకు కాలేజీలు ఉన్నాయి. ఎప్పటి నుంచో విద్యావ్యాపారంలోనే ఉన్నారు. ఏ తల్లిదండ్రులు అయినా ‘మా అబ్బాయి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేయాలి’ అనుకుంటారు కదా! మా అమ్మానాన్నలు కూడా అదే అనుకున్నారు. కానీ ‘హ్యాపీడేస్’తో నాకు కాస్త క్రేజ్‌ పెరిగాక నా మీద నమ్మకం వచ్చింది. ఇంజనీరింగ్‌ పూర్తవుతూనే నాకు గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ తీసుకొచ్చి ఇంట్లోవాళ్లకు చూపించాను. హైటెక్‌సిటీలోని గూగుల్‌కు వెళ్లి కేవలం రెండ్రోజులే ఉద్యోగం చేశా. దిక్కు తెలియలేదు. ఉద్యోగం చేయలేకపోయాను. వెంటనే మానేసి.. మళ్లీ సినిమావేటలో పడ్డా. ఆ రెండ్రోజులకు కూడా గుగుల్‌వాళ్లు నాకు జీతం ఇవ్వడం మరపురాని విషయం. ఎందుకంటే నా తొలి, ఆఖరి జీతం అదే మరి! సినిమాల్లో కనక క్లిక్‌ అవ్వకపోయుంటే ఎలాగూ మా విద్యాసంస్థలు ఉన్నాయి కనక వాటి నిర్వహణ బాధ్యతలను చూసుకునేవాణ్ని.
 
యువతరం మీ నుంచి తెలుసుకునే సంఘటన..
తొలినాళ్లలో పార్టీలు, పబ్బులకు వెళ్లేవాణ్ణి. ఫ్రెండ్స్‌ను కలిసినప్పుడు సమయమే తెలిసేది కాదు. కొన్నాళ్లకు నాకు అర్థమైంది ఏంటంటే.. నా జీవితం ఇది కాదు. ఇంకేదో కావాలి అన్న ఆలోచన మొదలైంది. అన్ని వ్యాపకాలు తగ్గించాను. పదికోట్ల మంది తెలుగు ప్రేక్షకుల ముందుకు నా చిత్రం వెళుతోందంటే.. ఎంత కష్టపడాలి. ఎంత ఏకాగ్రతతో చేయాలి అనుకున్నాను. అమితాబ్‌ బచ్చన్‌లాంటి సీనియర్‌ నటులు వర్థమానప్రేక్షకులను ఆకట్టుకునే కథల్లో నటిస్తున్నారు. ప్రపంచంతో పోటీపడి చేస్తున్నారాయన. నేను కూడా ఏదో ఒక రోజు తెలుగు సినిమా పరిశ్రమ అనే పుస్తకంలో ఒక పేజీని సంపాదించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను.
 
ఆఖరి ప్రశ్న - సినిమాల్లో మీ స్థానం ఎలా ఉండాలన్నది మీ ఆలోచన?
నేను ఒక స్థానం కోసమని ప్రయత్నించడం లేదు. ముందు మంచి పేరు కావాలి. నిఖిల్‌ సినిమా ఆడుతోందంటే.. ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు రావాలన్నది నా కోరిక. మినిమమ్‌ గ్యారెంటీ హీరో అన్న పేరొస్తే చాలు. అదే నాకు పెద్ద విజయం. ఒక సాధారణ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన నేను శేఖర్‌కమ్ముల వల్ల సినిమాల్లోకి వచ్చి.. ఇక్కడి వరకు రాగలిగాను. నా జీవితంలో ఇప్పుడొచ్చిన హ్యాపీడేస్‌కు పునాదులు వేసింది ఆయనే! ‘హ్యాపీడేస్‌లో అవకాశం వచ్చిన నటులందరూ హీరోలు, హీరోయిన్లు అయ్యారు. థ్యాంక్యూ సార్‌. 

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.