Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Thu, 24 Nov 2016 02:09:12 IST

నామ విజ్ఞాని యార్లగడ్డ

నామ విజ్ఞాని యార్లగడ్డ

బాల గంగాధర రావు అంటే నామ విజ్ఞాన శాస్త్రం. ఈ శాస్త్రా‌న్ని పాఠ్యాంశంగా నిర్ణయింప చేయడానికి ఎంతో పట్టుదల వహించి విజయం సాధించారు. 2002లో తానే ‘నామ విజ్ఞానం’ అనే పాఠ్య పుస్తకం రచించారు. అంతకుముందు అరకొరగా వున్న నామ విజ్ఞానం బహుముఖాలుగా విస్తరిల్లటానికి బాల గంగాధరరావే కారణం.

ఉత్తమ భాషా పరిశోధకుల తరంలో ఒక దిగ్గజం వంటి ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు నవంబర్‌ 23న కన్నుమూశారు. వివాహం అయిన తర్వాత కూడా భాషాధ్యయనం, సాహిత్య పరిశోధన ఒక విద్యార్థిగా చేసి ఎంఏ చదివారు. ఎంఏ చదువుతున్నపుడు ఆయన నా సహాధ్యాయులు. అప్పటికే సాహిత్యం, చరిత్ర పట్ల ఆయనకు నిర్దిష్టమైన భావాలున్నాయి. విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠం చెప్పే ఒక ఆచార్యునితో చర్చించే సత్తా గలవారు బాల గంగాధరరావు. నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసిన బాల గంగాధరరావు అందరికంటే భిన్నంగా ఆలోచించడం, వాదించడం అతని నైజం. శ్రీనాథుడు జన్మించిన కాల్పట్టణం కర్ణాటకలోదనీ, ఆంధ్ర-తెలుగు శబ్దాలు వేర్వేరు తప్ప పర్యాయపదాలు కావనీ, పాల్కురికి సోమన కర్ణాటకలో నివసించాడనీ, ఇలా తన వాదం పై నిష్కర్షగా చర్చించేవారు తప్ప దూషణ ఎరుగరు.
 
                  బాల గంగాధర రావు అంటే నామ విజ్ఞాన శాస్త్రం.ఈ శాస్త్రా‌న్ని పాఠ్యాంశంగా నిర్ణయింప చేయడానికి ఎంతో పట్టుదల వహించి విజయం సాధించారు. 2002లో తానే ‘నామ విజ్ఞానం’ అనే పాఠ్య పుస్తకం రచించారు. అంతకుముందు అరకొరగా వున్న నామ విజ్ఞానం బహుముఖాలుగా విస్తరిల్లటానికి బాల గంగాధరరావే కారణం.
 
                  ‘ఒక ఊరి కథ’, ‘ఇంటిపేరు’ శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికంగా రాసి పుస్తకాలుగా ప్రచురించారు. ఒక ఊరిపేరు, ఇంటిపేరుల గురించిన వివరంగా సమాచార మిచ్చారు. ‘మాట-మర్మం’ అనేది చిన్న పుస్తకమైనా వాడుకలో గల మాటల పుట్టు పూర్వోత్తరాలు వివరించి మెదడుకి మేత నిచ్చారు. సీ్త్రల ఇంటిపేరు మారాలా? బుద్ధుడు ఆంధ్రుడేనా? వంటి ఆసక్తికర అంశాలపై సోదాహరణంగా చర్చించారు. అరకులోయ ప్రాంతంలో గల వాడుక భాషకి నిఘంటువు రూపొందించారు. శబ్దజ్ఞానం, సాహిత్యాంశాలలో సందేహం వస్తే బాల గంగాధర రావును అడగాల్సిందే. తెలుగు భాషా సాహిత్యాలపై అతనొక విజ్ఞాన సర్వస్వం అనాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు వ్యుత్పత్తి పదకోశ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. దొణప్ప పర్యవేక్షణలో ‘అనంతపురం జిల్లా గ్రామనామాలపై’ సిద్ధాంత గ్రంథం వెలువరించారు. మహా భారతాన్ని తన ముద్రతో, వచనంతో రాశారు. అక్కడక్కడ వ్యాఖ్యానమూ కనబడుతుంది. శ్రీనాథుని హరవిలాసం కావ్యాన్ని 18 వారాలు ఆకాశవాణిలో పఠనం చేశారు. ఇదొక వినూత్న కార్యక్రమం. క్రీడాభిరామం తెలుగులో తొలి వీథి నాటకం. దీనిని మంచి పీఠికతో పునర్ముద్రించారు. కాసుల పురుషోత్తమ కవి రాసిన వ్యాజస్తుతి శతకం ‘ఆంధ్రనాయక శతకం’ ప్రచురించి తాత్పర్యం రాశారు. ఈ విధంగా 75వ పడిలో ఉండి కూడా నిరంతరం భాషా సాహిత్యాలపైనే మనసు పెట్టి నూతనాంశాలను వెల్లడించాలని తపించేవారు. అందరికీ బాల గంగాధర రావు సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు - అయినా నొచ్చుకోడు. ‘నే చెప్పిన దాన్ని గురించి ఆలోచిస్తే చాలు ధన్యుడ్ని’ అనటం అతనికే చెల్లు.
 
                  ఆచార్య బాల గంగాధర రావు 1940 జూలై 1వ తేదీన కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో జన్మించారు. దాదాపు నలభై మంది విద్యార్థులు బాల గంగాధరరావు పర్యవేక్షణలో ఎం.ఫిల్‌. పీహెచ్‌డీ పట్టాలు పొందారు. చరిత్ర, వ్యాకరణాంశాలపై కూడా ఆయన పరిజ్ఞానం సంపాదించారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గురించి చారిత్రక, సాంఘిక రచన చేశారు. కొండవీటి వాగు, పులిచింతలపై రాసిన వ్యాసాలు చరిత్రకారుల్ని అబ్బురపరిచాయి. బాలగంగాధర రావు మదిలో ఎన్నో ప్రణాళికలున్నాయి. అవి రూపు దిద్దుకోకుండానే సెలవంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఒక సాహిత్య తపనుడ్ని కోల్పోయాం. ఇటువంటి వారి వల్ల తెలుగుకు ప్రయోజనం వుంటుంది. కానీ ‘కాలధర్మం’ అనుకోక తప్పదు.
  డాక్టర్‌ ద్వా.నా. శాస్త్రి

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.