Nov 13 2016 @ 11:07AM

ఈ బొమ్మ ఎలా మాట్లాడుతుందో తెలుసా...

‘అమ్మో బొమ్మ’ సినిమాను చూసినవాళ్లెవరైనా ‘నా పేరు గంగారం ఓం ఫట్‌ స్వాహా..’ అని వెటకారంగా నవ్వుతూ రాజేంద్రప్రసాద్‌ను ముప్పుతిప్పలు పెట్టడంతో పాటు ప్రేక్షకులను కూడా భయపెట్టే బొమ్మను మరిచిపోలేరు. ఆ సినిమాలో బొమ్మది విలన్‌ పాత్ర కాబట్టి గంగారం అని పేరు పెట్టారు. బయట దానికి ఒకటి కాదు మూడు పేర్లు ఉన్నాయి. అవి అర్ధవతరావ్‌ అలియాస్‌ గప్పీదాస్‌ అలియాస్‌ మిస్టర్‌ క్రేజీ. ఈ మాటకారి బొమ్మకు ఇప్పుడు వందేళ్లు. బొమ్మకు నూరేళ్లు నిండడమేంటా? అని అనుకుంటున్నారా.. ఆ విశేషాలు చెప్పడం కోసమే ఈ కథనం.

వెంట్రిలాక్విజం... నోరు కదపకుండా మాట్లాడుతూ చేతిలో ఉన్న బొమ్మ మాట్లాడుతున్నట్టు భ్రమ కలిగించే కళ అది. వినడానికి చాలా సులువుగానే అనిపిస్తున్నా పెదాలు కదపకుండా ‘డమ్మీ’ బొమ్మ మాటల ద్వారా వినోదం పంచాలంటే సాధారణ విషయం కాదు. మ్యాజిక్‌తో సమానమైన కళ. తెలుగులో దీన్ని ‘శబ్ద భ్రమరం’ అని పిలుస్తున్నారు కాని ఎవరికీ పరిచయమైన పేరు కాదు. వెంట్రిలాక్విజం ఎప్పుడు పుట్టిందో కాని అది మన దేశంలో అడుగుపెట్టి వందేళ్లయింది. దీన్ని మొట్టమొదటి సారి భారతదేశంలో ప్రదర్శించిన వ్యక్తి వై.కె. పధ్యే. ఇతడు మొదట్లో చిన్న చిన్న ఫంక్షన్లు, పార్టీలలో మ్యాజిక్‌ షోలు చేసేవాడు. ఒక మెజీషియన్‌గా ఎంతో పేరు కూడా సంపాదించుకున్నాడు. తన మ్యాజిక్‌కు కావల్సిన వస్తువులను ఇంగ్లాండ్‌ నుంచి తెచ్చుకునేవాడు.
 
             అలా అనుకోకుండా ఒకసారి ఒక బ్రిటిషు సైనికుడు బొమ్మతో మాట్లాడిస్తూ తన తోటి సైనికు లను ఆటపట్టిస్తుండడం చూశాడు. ఆ సైనికుడిని అడిగి అప్పుడప్పుడే ఇంగ్లాండ్‌లో పాపులర్‌ అవుతున్న ‘వెంట్రిలాక్విజం’ గురించి తెలుసుకు న్నాడు. ఆ విద్యను నేర్చుకోవాలనే కోరికతో అమెరికా నుంచి వెంట్రిలాక్వి జం మీద ఒక బుక్‌ను తెప్పించుకున్నాడు. అది చదివి సొంతంగానే ‘వెంట్రిలాక్విజం’ నేర్చుకున్నాడు. 1916 సంవత్సరంలో మొదటిసారిగా ఆయన భారతదేశంలో ‘వెంట్రిలాక్విజం’ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చినవారు మాట్లాడే బొమ్మను, అది చేసే అల్లరిని చూసి ఆశ్చర్యపోయారు. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. అప్పుడే ఆ డమ్మీ బొమ్మకు ‘అర్ధవతరావ్‌’ అని పేరు పెట్టాడు. వెంట్రిలాక్విజంతో దేశవ్యాప్తంగా ఎంతో పేరుప్రతిష్టలు సంపాదించారు పధ్యే.
 
           రాజేంద్రకుమార్‌ హీరోగా నటించిన ‘అకేలీ మత జాయియే’ సినిమాలో పధ్యే డమ్మీ బొమ్మ ‘అర్ధవతరావ్‌’ కూడా ఒక పాత్ర పోషించింది. దీనికి వాయిస్‌ ఇచ్చిందీ, ముఖాన్ని మాటలకు తగ్గట్టుగా కదిలించిందీ పధ్యేనే కావడం విశేషం. ఆయన తదనంతరం ఆయన కుమారుడు రామదాస్‌ పధ్యే వెంట్రిలాక్విజాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆయన కోడలు అపర్ణ, మనవళ్లు సత్యజిత, పరీక్షితలు కూడా వారసత్వంగా వెంట్రిలాక్విజాన్ని కొనసాగిస్తున్నారు.
 
              ‘‘మా నాన్న ఒక మాస్క్‌ వేసుకొని ప్రతిరోజూ అద్దం ముందు నిల్చొని మాట్లాడుతూ ప్రాక్టీస్‌ చేసేవారు. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన బొమ్మకు భారతీయత ఉట్టిపడేలా వసా్త్రలను కుట్టేందుకు ఎన్నో రోజులు శ్రమించారు. దానికి విగ్‌ను కూడా ఆయనే తయారుచేశారు. బొమ్మను చూసినప్పుడు మనవాడని భారతీయులు భావించాలని ఆయన అనుకునేవారు. వెంట్రిలాక్విజాన్ని పరిచయం చేసే ముందు ఆయన దాని గురించి ఎంతో అధ్యయనం చేశారు. బొమ్మ పెదాలు ఎలా కదిపితే జనం చూపు మన వైపు రాకుండా చేయవచ్చో ఆయన్ని చూసే నేర్చుకున్నాను. మన దేశంలో దీనికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడం లేదు. మిమిక్రీ, మ్యాజిక్‌ రెండూ కలిపి చేసే వెంట్రిలాక్విజం రావాలంటే చాలా సాధన అవసరం’’ అని చెప్పారు రామదాస్‌ పధ్యే.
23 ఏళ్ల వయస్సులో రామదాస్‌ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ముందు వెంట్రిలాక్విజం షో చేశారు. ‘‘నేను మొదటి షో ఇచ్చిన వారం రోజులకు మా నాన్న చనిపోయారు. అప్పటినుంచి ఆయన స్థానాన్ని నేనే తీసుకున్నాను’’ అని చెప్పారు రామదాస్‌ పధ్యే. ఆయన ‘వీపప్పెట్స్‌.కామ్‌’ (vpuppets.com ) అనే ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేశారు. భారతదేశంలో ఇదే మొట్టమొదటి వెంట్రిలాక్విజం వెబ్‌సైట్‌ కావడం విశేషం. వై.కె. పధ్యే ఒక్క సినిమాలోనే తన వెంట్రిలాక్విజాన్ని ప్రదర్శిస్తే ఆయన తనయుడు రామదాస్‌ పధ్యే చాలా సినిమాల్లో తన కళను చూపించారు.
 
          అమితాబ్‌ హీరోగా నటించిన ‘మహన్‌’, జిమ్మి షేర్‌గిల్‌, ప్రీతిజింటా జంటగా నటించిన ‘దిల్‌ హై తుమ్హారా’, మరాఠీ హారర్‌ చిత్రం ‘జపట్‌లేలా’, తెలుగులో ‘అమ్మో బొమ్మ’ చిత్రాలలో కనిపించే బొమ్మలు, వాటి ద్వారా వినిపించే స్వరం రామదాస్‌ పధ్యేదే. (‘జపట్‌లేలా’ చిత్రాన్నే తెలుగులో ‘అమ్మో బొమ్మ’గా రీమేక్‌ చేశారు). అంతేకాకుండా రామ్‌గోపా ల్‌వర్మ ‘ఫూంక్‌2’ చిత్రంలో కనిపించే బొమ్మలను కూడా ఈయనే తయారు చేశారు. కుటుంబ నియంత్రణ, చిన్న మొత్తాల పొదుపు, నిర్బంధ విద్య వంటి సామాజిక అంశాలపైన కూడా రామదాస్‌ పధ్యే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ‘‘తాత మొదలుపెట్టిన వెంట్రిలాక్విజాన్ని, నాన్న మరింత పైస్థాయికి తీసుకెళ్లారు. నేను షోలు చేసే సమయానికి వెంట్రిలాక్విజం ఒక బ్రాండ్‌గా తయారయ్యింది. ఇప్పుడు వెంట్రిలాక్విజం షోలకు జనం రావట్లేదు, అందుకే యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా జనం దగ్గరికే ఈ కళను తీసుకెళ్తున్నాను’’ అని చెప్పారు పధ్యే కుమారుడు సత్యజిత. ఈయన ఇప్పటికే ఎన్నో సీరియల్స్‌, యాడ్స్‌లో తన కళను ప్రదర్శించాడు.