Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 05 Nov 2016 02:27:36 IST

జోడేఘాట్‌ వీరుడు కుమ్రం సూరు

జోడేఘాట్‌ వీరుడు కుమ్రం సూరు

నిజాం నిరంకుశ పాలనలో 1938-40ల మధ్య జరిగిన జోడేఘాట్‌ సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే అరుదైనది. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజనులను కూడగట్టి గెరిల్లా సైన్యంతో పోరాడిన తెలంగాణ తొలి గిరిజన పోరాట యోధుడు కుమ్రం భీంకు ప్రధాన అనుచరుడిగా, పోరాట వ్యూహకర్తగా పనిచేసిన కుమ్రం సూరు అజరామరుడు. ఆదివాసీ గూడేల్లో అరాచకాలు సృష్టించే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా సైన్యం ఏర్పాటులో కుమ్రం భీంకు హవల్దార్‌గా సూరు ప్రధాన భూమిక పోషించారు. ఆదివాసీ యువ సైనికులను తీర్చిదిద్దడానికి తగిన సూచనలుచేస్తూ వారిని సమీకరించారు. వెదురుతో విల్లంబులు, బాణాలు తయారుచేయడం, ఉచ్చులు బిగించడం మాత్రమే కాదు. భీం ధగ్గర గెరిల్లా యుద్ధతంత్రాన్ని నేర్చుకుని పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. మరోవైపు కుమ్రంభీంకు తన అక్షరజ్ఞానంతో రాజకీయ మెళకువలను సూరు నేర్పించారు.

 
                  కుమ్రం భీం గిరిజన గోండు తెగకు చెందినవాడైతే, సూరుది కొలం తెగ. ఐనా వీరిద్దరి కలయికే జోడేఘాట్‌ పోరాటాన్ని మరింత విస్తృతం చేసింది. ఆదివాసీలందరినీ కూడగట్టింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని (ప్రస్తుతం ఆసిఫాబాద్‌) కెరిమెరి మండలం జోడేఘాట్‌లో కుమ్రం చిన్రూ, మారుబాయి దంపతులకు 1918లో కుమ్రం సూరు జన్మించారు. నిజాం ప్రభుత్వం తరపున పట్వారీలు, చౌకీదార్‌లు పన్నులు వసూలు - చేయడాన్ని నిరసిస్తూ వారిపై దాడులు చేయాలని భీం ఆజ్ఞాపించినప్పుడు సూరు వ్యూహరచనచేసి దాడులకు నాయకత్వం వహించేవారు. జోడేఘాట్‌ చుట్టపక్కల 12 గ్రామాల్లో -బోడేఘాట్‌, బాబేఝరీ, పట్నాపూర్‌, టోకెన్నావాడ, లైన్‌పటల్‌ కోశగూడ, చల్‌బరిడి, భీమన్‌ గొంది, కల్లేగావ్‌, అంకుశాపూర్‌, పర్సాపూర్‌, శివగూడల భూములకు పట్టాలివ్వాలని, ఆ గ్రామాలకు స్వయం పాలన కావాలని తీర్మానించారు. నిజాం ప్రభుత్వానికి తన డిమాండ్లను తెలుపడానికి కుమ్రం భీం కాలినడకన హైదరాబాద్‌ వెళ్ళినప్పుడు సూరు ఆయనతోనే ఉన్నారు. నిజాం సర్కార్‌ వీరిద్దరికీ కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో కుమ్రం భీం, సూరు లిద్దరు మనస్తాపం చెంది జోడేఘాట్‌కు తిరిగి వచ్చారు. నిజాం సర్కార్‌పై ఆవేదనతో, కసితో రగులుతున్న వీరిద్దరూ గోండు, కోలాం యువకుల్ని కూడగట్టి సైనికులుగా శిక్షితులను చేసి ‘జల్‌, జంగిల్‌, జమీన్‌’ నినాదంతో గెరిల్లా యుద్ధ తంత్రం వంటబట్టించి జోడేఘాట్‌ కేంద్రంగా యుద్ధానికి సమాయత్తం చేశారు. జోడేఘాట్‌ గుట్టల్లో కుమ్రం భీం సైన్యంపై 1940 అక్టోబర్‌లో నిజాం సైనికులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి భీం వీర మరణం పొందారు.
 
                  ఆ యుద్ధ భూమిలోనే సూరు కుడిచేయి, కుడి కాలుకు, నడుముకు తూటాలు తగిలి గాయాలయ్యాయి. ఆ సమయంలో కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. తర్వాత సముతుల గుండం, యాపలతాటి, శేకన్‌ గొంది గ్రామాల్లో తలదాచుకున్నట్లు సూరు బంధువుల ద్వారా తెలుస్తోంది. 1940లో కుమ్రం భీం నాయకత్వంలో నడిచిన గె రిల్లా పోరాటాన్ని అందులోని ఒడిదుడుకులను బాహ్య ప్రపంచానికి తెలిపినది ఆయనే. మనం ఈ రోజు చూసే ‘భీం’ ఛాయా చిత్రం సూరు చెప్పిన రూపు రేఖల ఆధారంగా రూపొందించిందే.
 
                  నాగరిక సమాజానికి ఆమడ దూరంలో ఉంటూ దోపిడీ, పీడనలను ఎదుర్కొంటున్న కొలాం తెగ నుంచి ఎదిగి వచ్చిన కుమ్రం సూరు ఉవ్వెత్తున లేచిన గిరిజన ఉద్యమానికి గొప్ప మార్గదర్శకులు. జోడేఘాట్‌ పోరాట స్ఫూర్తికి చిరునామాగా మిగిలిన కుమ్రం సూరు శేకన్‌ గొంది గ్రామంలో 1997, నవంబర్‌ 5న కన్ను మూసారు. ప్రతి ఏటా గోండు, కొలాం, తోటి తెగల ఆదివాసులు శోకన్‌గొందిలో వున్న సూరు సమాధి వద్ద నివాళులర్పించడం వారి సంప్రదాయం. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసుల స్వయంపాలనకు న్యాయమే జరుగలేదు. జోడేఘాట్‌ పోరాటంలో కొమ్రం భీంకు అండగా నిలిచిన కొమ్రం సూరు పాత్ర సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
  గుమ్మడి లక్ష్మీనారాయణ 
ఆదివాసీ రచయితల సంఘం 
(నేడు కొమ్రం సూరు వర్ధంతి)

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.