Oct 30 2016 @ 11:14AM

షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!

హైద్రాబాద్: యువ దర్శకులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమలో తెలంగాణ వారికి సముచిత స్థానం దక్కాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రోత్సహించి, తెలంగాణకు చెందిన యువ దర్శకులను, నటీనటులను సినీ పరిశ్రమకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి గాను ప్రతీ శనివారం హైద్రాబాద్‌లోని కళా క్షేత్రం రవీంద్రభారతిలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ తెలిపారు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్న ఎంతోమందికి సోషల్ మీడియాలో సరైన ఆదరణ లభించడం లేదని, అందుకే ఎంతోమంది ప్రముఖులు సందర్శించే రవీంద్రభారతిలోని ఫస్ట్ ఫ్లోర్‌లో షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
 
నవంబర్ 12 నుంచి ప్రతీ శనివారం రవీంద్రభారతిలో సినీవారం పేరుతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ షార్ట్ ఫిల్మ్స్‌ను ఉచితంగా ప్రదర్శించనున్నట్లు హరికృష్ణ చెప్పారు. ప్రతీ శనివారం రెండు షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించడానికి వీలుగా సమయాన్ని కేటాయించామన్నారు. 80లక్షలతో ఆ బ్లాక్‌ను పునరుద్దించినట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్ పేరుతో ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ సమయంలోనే పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తాను తీసిన షార్ట్ ఫిల్మ్‌ను ఇక్కడ ప్రదర్శించి అందరి మన్ననలు పొందాడని, ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చిందని మామిడి హరికృష్ణ గుర్తుచేశారు.