desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 9 2016 @ 09:45AM

భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు

భిన్న సంస్కృతుల సమ్మేళనం... భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం... వ్యాపార, వాణిజ్య రంగాలకు పట్టుగొమ్మ... కడుపుచేతపట్టుకొని వచ్చినవారిని, తన కడుపులో దాచిపెట్టుకునే నగరం... కోటి మంది జనాభాను గర్భీకరించు కున్న మహానగరం... ఎందరో మేధావులు, గొప్పవ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసిన మననగరం... గత కాలపు ఘన చరిత్రకు సజీవరూపం... భాగ్యనగరం. అంతటి సుందర నగరం ఆవిర్భవించి నేటికి(అక్టోబర్‌9) 425ఏళ్లు. హైదరాబాద్‌ నగర నిర్మాణంలో జరిగిన తొలికట్టడం చార్మినార్‌!

ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ

నగర నిర్మాణానికి పునాది

కుతుబ్‌ షాహీ వంశస్థుల్లో 5వ ప్రభువు సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా. ఈయన 1580లో తన 14వఏట గోల్కొండ రాజ్యాధికారం చేపట్టారు. తండ్రి ఇబ్రహీం కుతుబ్‌షా, తల్లి భాగీరధి. గోల్కొండ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువవడం, అందుకు తగ్గ నీటి వనరులు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, నీటి కలుషితం పెరగడంతో ప్లేగువ్యాధి విజృంభణ మొదలైంది. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం కొత్త నగర నిర్మాణం చేపట్టడమే అని భావించారు కుతుబ్‌షా. ఆ సమయంలోనే ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడు ప్రముఖ ఆర్కిటెక్చర్‌ మీర్‌ మొమీన్‌ హజరత్ గోల్కొండ రాజ్యానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కుతుబ్‌షా అంతరంగ ఆలోచనను, తక్షణ రాజ్య అవసరాన్ని గమనించిన హజరత్, అప్పటికే అందంగా నిర్మించిన ఇస్ఫహాన్‌ పట్టణ ప్రణాళిక స్ఫూర్తితో నూతన నగరం నిర్మించొచ్చని ప్రభువుకి సలహా ఇచ్చారు.
 
          సంతోషించిన కుతుబ్‌షా ‘‘గోల్కండకు దూరం, కానీ దగ్గర’’గా ఉండాలి ఆ నూతన నగరం అని ఆజ్ఞాపించారు. సుల్తాన్‌ ఆజ్ఞ మేరకు మూసీనది దక్షణ ప్రాంతం అనువైదని గుర్తించి అప్పటి పిచ్చలాం (పాతబస్తీ) అనే గ్రామాన్ని తొలినగర నిర్మా ణానికి ఎంచుకున్నారు. 1588లో భాగ్యనగర నిర్మాణంలో తొలి కట్టడం చార్మినార్‌కి పునాది వేశారు. ఆకాలంలో షోలా పూర్‌ నుంచి మచిలీపట్నం వయా గోల్కొండ, రహదారి వద్ద చార్మినార్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ‘‘ఇస్లామిక్‌ కేలండర్‌ ప్రకారం తొలి మొహర్రం, 1000 హిజ్రీ అంటే, 1591 అక్టోర్‌ 09 నాటికి చార్మినార్‌ నిర్మాణం పూర్తయినట్లు ప్రముఖ చరిత్ర అధ్యయనకారులు డా.గులాం యజ్‌ దానీ పరిశోధన చెబుతుంది’’ అని తెలిపారుదక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక సభ్యుడు డా.మహ్మద్‌సఫీఉల్లా. భాగ్యనగరానికి ప్రపంచ స్థాయిలో వన్నెతెచ్చిన కట్టడం చార్మినార్‌. ఆ నిర్మాణ రూపు బంగారు, వెండినాణేలు, వస్తువులు, తపాలా బిళ్లలు, అలా అనేక వాటిపై గుర్తులుగా, నగరవాసుల మనసు నిండా నిండుకుంది చార్మినార్‌ ప్రతిరూపం.
 
ఖర్చు ఎంతో తెలుసా?
ఇండో, ఇస్లామిక్‌శైలిలో చార్మినార్‌ను నిర్మించారు. మూడేళ్ల కాలంలో వందల మంది కూలీలశ్రమతో రూపుదిద్దుకుంది ఆ సుందర కట్టడం. ఆ నిర్మాణానికి అయిన ఖర్చు నాటి మారకం ప్రకారం 2లక్షలహునాలు (బంగారు నాణేలు). రూపాయల్లోకి మారిస్తే ఆ రోజుల్లో రూ.9లక్షలు అంటారు చారిత్రక అధ్యయనకారులు. దేశవ్యాప్తంగా మొట్ట మొదటి అందమైన, ప్రత్యేక కట్టడం చార్మినార్‌ అని మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం. చార్మినార్‌తోపాటు 1592, చార్‌ కమాన్‌, 1593, బాద్‌షాహీ అషుర్‌ఖానా, 1595 దారుల్షిఫా(యునానీ ఆసుపత్రి) నిర్మాణాలను పూర్తిచేశారు. ‘‘ఆరోజుల్లోనే ఆసియా ఖండంలోనే మరెక్కడా లేని, 100పడకల కుపైగా ఉన్న యునానీ వైద్యశాల నిర్మించిన ఘనత కులీకుతుబ్‌షాకే దక్కుతుంది’’ అంటారు ఇన్‌ట్యాక్‌ కో కన్వీనర్‌ అనూరా ధారెడ్డి. 1603లో గోల్కొండ నుంచి పరిపాలన మొత్తం అలనాటి నూతన నగరం హైదరాబాద్‌కి మారిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
 
వాటిని కూల్చేసిన చక్రవర్తి
కుతుబ్‌షాహీల రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నాడు. 8నెలల పాటు స్వంతరాజ్యాన్ని వదిలి హైదరాబాద్‌లో తిష్టవేశాడు. అయినా ఏమీ చేయలేని మొగల్‌ చక్రవర్తి, ఆఖరికి కుతుబ్‌షాహీ సైనికాధికారులను లొంగదీసుకొని, 1687, జనవరిలో కుతుబ్‌షాహీలను ఓడించి, గోల్కొండ రాజ్యాన్ని కైవశం చేసుకున్నాడు. ఆ సమయంలో నూతన భాగ్యనగరంలో కుతుబ్‌షాహీలు నిర్మించిన జమథార్‌ఖానా, కమాన్‌ షెర్‌ అలీ, జిలౌఖానా, లాల్‌మహల్‌, చందన్‌మహల్‌, సజాన్‌మహల్‌, దాద్‌ మహల్‌, నదీ మహల్‌, జినాన్‌ మహల్‌, ఖుదాద్‌ మహల్‌(1610) వంటి కట్టడాలన్నింటినీ ఔరంగజేబు నేలమట్టడం చేశాడు. చార్మినార్‌ను సైతం కూల్చివేసేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో, అందులో మసీదు ఉందని తెలియడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కుతుబ్‌షాహీల రాజభవనాలలో అత్తాపూర్‌ వద్దనున్న ముష్క్‌ మహల్‌ మాత్రమే మిగిలి ఉంది.
 
ఆ చార్మినార్‌కు అంతర్జాతీయ గుర్తింపు
1947-1948 మధ్యకాలంలో హైదరాబాద్‌, భారతదేశంలో పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు హైదరాబాద్‌ రాజ్యం నుంచి పాకిస్థాన్‌కు వలసవెళ్లాయి. వారంతా ఎక్కు వగా కరాచీ వద్ద, బహుదురాబాద్‌ వద్ద స్థిరపడ్డారు. హైదరాబాద్‌పై అమితమైన ప్రేమాభిమానాలున్న వారంతా కలిసి ఆ ప్రాంతంలో చార్మినార్‌ను పోలిన కట్టడాన్ని నిర్మించారు. రౌండ్‌ఏబౌట్‌ అప్రిసియేషన్‌ సొసైటీ, లండన్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ 2015లో ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రధాన నగరాల్లోని అందమైన చౌరస్తాలను అధ్యయనంచేసి వాటిలో 12 ప్రముఖమైన వాటిని గుర్తించింది. అందులో కరాచీలోని చార్మినార్‌ చౌరంగి (చౌరస్తా) 5వస్థానం పొందడం ఆశ్చర్యం. ‘‘ఆ కట్టడానికి ప్రేరణగా నిలిచిన 425ఏళ్ల ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం చార్మినార్‌ చౌరస్తాకు ఆ కీర్తి దక్క కపోవడం మన నిర్లక్షవైఖరికి సాక్షం’’ అంటున్నారు అనూరాధారెడ్డి.