
ఫ్రాన్స్ అమ్మాయి.. వరంగల్ అబ్బాయి
వరంగల్ కల్చరల్ : హన్మకొండ ములుగురోడ్‌లోని శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపం గురువారం ఓ అపూర్వ ప్రేమాయణాన్ని మూడుముళ్ల బంధంతో దంపతులుగా చేయనుంది. అయితే అబ్బాయి వరంగల్ నగరానికి చెందినవాడుకాగా, అమ్మాయి ఫ్రాన్స్ దేశానికి చెందిన కళాకారిణి కావడం విశేషం. వివరాల్లోకెళితే... హన్మకొండలోని భీమారానికి చెందిన జాతీయ మైమ్ కళాకారుడు అర్షం మధు, ఫ్రాన్స్‌కు చెందిన పప్పెట్రి (బొమ్మల) కళాకారిణి సబ్రిన హిందూసాంప్రదాయ పద్ధతిలో వేదమంత్రాల సాక్షిగా మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో మధు స్థాపించిన ఇండియన్ మైమ్ అకాడమీలో మైమ్ నేర్చుకునేందుకు ఉత్సాహంతో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆ కళాకారిణికి మధుతో ప్రేమ చిగురించింది. ఫలితంగా ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటల వరకు రావడం విశేషం. మధు మైమ్తో పాటు బుల్లితెర టెలిఫిలిమ్స్ మొగిలిరేకులు, చక్రవాకం తదితర సీరియల్స్‌లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. వీరి పెళ్లికి తనికెళ్లి భరణితోపాటు పలువురు సినీ, బుల్లితెర నటీనటులు హాజరై కళాకారుల జంటను ఆశీర్వదించనున్నారు.