
బంజారాహిల్స్: సీనియర్ సినీ దర్శకుడు, నిర్మాత తిరువీధి గోపాలకృష్ణ(82) కన్నుమూశారు. ఫిలింనగర్లోని స్వగృహంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. మురళీమోహన్ హీరోగా నటించిన వస్తాడే మా బావ, శివాజీ రాజా నటించి అహో బ్రహ్మ, ఓహో శిష్య, తదితర సినిమాలకు గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. మరో 10 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సారథి స్టూడియోలో తొలినాళ్లలో సినిమా నిర్మించిన వారిలో ఈయన ఒకరు. ఫిలింనగర్ సొసైటీ ఏర్పాటులోనూ కృషి చేశారు. సొసైటీ సభ్యుడిగా పదేళ్లు, కోశాధికారిగా ఏడేళ్లు సేవలందించారు. గోపాలకృష్ణ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. మంగళవారమే ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.