Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 26 Sep 2016 23:04:34 IST

హెల్త్ విన్నర్

హెల్త్ విన్నర్

ఎటువంటి రోగకారక క్రిముల ప్రమేయం లేకుండా అనారోగ్యానికి గురయ్యామంటే అందుకు ‘విటమిన్‌ డెఫిషియన్సీ’ ఒక్కటే కారణం. ఈ లోపాన్ని పూరించాలంటే సమతులాహారం తీసుకోవడంతో పాటు ఆ ఆహారం ద్వారా పొందే విటమిన్ల మీద కూడా అవగాహన ఏర్పరుచుకోవాలంటున్నారు నిపుణులు. 
 
ఏ విటమిన్‌ ఎందుకు?
విటమిన్‌ ఎ: ఎదుగుదల, రోగనిరోధక శక్తి, కంటిచూపునకు అవసరం. ఎ విటమిన్‌ లోపంవల్ల ఈ అంశాలకు సంబంధించిన బలహీనతలు తలెత్తుతాయి. మరిముఖ్యంగా కంటిచూపు మందగించడం, రేచీకటిలాంటి సమస్యలు బాధిస్తాయి.
విటమిన్‌ బి1: ఈ విటమిన్‌ డెఫిషియన్సీ వల్ల ‘బెరిబెరి’ రుగ్మత
బాధిస్తుంది.
విటమిన్‌ బి5: పారాస్థీసియా అనే సమస్య తలెత్తుతుంది.
విటమిన్‌ బి7: పునరుత్పత్తి, వెంట్రుకలు, చర్మసంబంధ సమస్యలు వేధిస్తాయి.
విటమిన్‌ బి12: అనీమియా బారిన పడే ప్రమాదం ఉంది.
విటమిన్‌ సి: బలహీనత, బరువు తగ్గడం, ఒళ్లు నొప్పులు, స్కర్వీ సమస్యలు వేధిస్తాయి.
విటమిన్‌ డి: రికెట్స్‌, ఎముకల సమస్యలు.
విటమిన్‌ ఇ: నరాల సమస్యలు
విటమిన్‌ కె: రక్తం గడ్డకట్టే సమస్యలు, ఎముకలు గుల్లబారడం.

జీవించి ఉండటానికి కావలసిన అతి తక్కువ పరిమాణాల్లోని ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌... విటమిన్స్‌. వీటిని మన శరీరం తనంతట తాను తయారుచేసుకోలేదు. కాబట్టి వీటిని ఆహారం ద్వారా మాత్రమే అందించాల్సి ఉంటుంది. శరీర జీవక్రియలు సక్రమంగా జరగటానికి రకరకాల విటమిన్లు తగు పరిమాణాల్లో శరీరానికి అందాలి. ఎప్పుడైతే ఈ క్రమంలో లోపం తలెత్తుతుందో అప్పుడు కొన్ని లక్షణాల రూపంలో విటమిన్ల లోపం బయట పడుతుంది. అప్పుడే ఆ లోటును భర్తీ చేస్తే సరిపోతుంది. అలాకాకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే ఆ డెఫిసియన్సీ అలాగే కొనసాగి దీర్ఘకాలంలో ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఉండే విటమిన్ల గురించి కొంత అవగాహన ఏర్పరుకోవటం ఎంతో అవసరం. 
 
విటమిన్‌ డి
సర్వసాధారణంగా కనిపించే డెఫిషియన్సీ ఇది. ఎముకల దృఢత్వానికి కాల్షియంతోపాటు విటమిన్‌ డి కూడా అవసరమే! ఆహారం ద్వారా అందే కాల్షియంను శరీరం పీల్చుకోవటానికి డి విటమిన్‌ సహాయపడుతుంది. ఈ విటమిన్‌ లోపిస్తే ఎముకల సమస్యలతోపాటు ఆటోఇమ్యూన్‌ డిజార్డర్లు కూడా బాధిస్తాయి. ఎముకలు, కండరాల నొప్పులు తరచుగా వేధిస్తుంటే విటమిన్‌ డి లోపించిందని అర్థం చేసుకోవాలి. కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. రక్తంలో డి విటమిన్‌ శాతం తగ్గితే పెద్దల్లో ఙ్ఞాపకశక్తి లోపం, పిల్లల్లో తీవ్రమైన ఉబ్బసం కనిపించే అవకాశం ఉంది. టైప్‌-1, టైప్‌-2 డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, మల్టిపుల్‌ స్ల్కిరోసిస్‌ మొదలైన వ్యాఽధుల నుంచి విటమిన్‌ డి రక్షణ కల్పిస్తుంది.
కారణాలు: ఆహారం ద్వారా తగినంత విటమిన్‌ డి అందకపోవడం దీని లోపానికి ప్రధాన కారణం. వయసు పైబడేకొద్దీ మూత్రపిండాలు విటమిన్‌ డిని శరీర శోషణకు తగ్గట్టు యాక్టివ్‌ ఫామ్‌లోకి మార్చుకోలేదు. దాంతో వృద్ధుల్లో విటమిన్‌ డి లోపం తలెత్తవచ్చు. సిలియాక్‌ డిసీజ్‌, ఇతరత్రా జీర్ణకోశ సంబంధ రుగ్మతల కారణంగా కూడా పేగులు విటమిన్‌ డిని శోషణ చేసుకోలేవు. ఈ కారణంగా కూడా డి విటమిన్‌ లోపించవచ్చు. రక్తంలోని డి విటమిన్‌ను కొవ్వు కణాలు పీల్చుకుని రూపాన్ని మార్చి తిరిగి రక్తంలోకి విడుదల చేస్తాయి. కానీ స్థూలకాయం ఉన్నవారిలో ఈ పని అంత సమర్థంగా జరగక విటమిన్‌ లోపం తలెత్తుతుంది.
చికిత్స: లోపాన్ని ఆహారం, సప్లిమెంట్ల ద్వారా పూరించటమే విటమిన్‌ డెఫిషియన్సీకి చికిత్స. ఇందుకోసం విటమిన్‌ డి పుష్కలంగా ఉండే చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పుట్టగొడుగులు, నారింజ పళ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే వైద్యులు సూచించిన సప్లిమెంట్లు వాడాలి.
విటమిన్‌ ఎ
ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి, కంటిచూపునకు, ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్‌ ఎ చాలా అవసరం. ఆహారం ద్వారా తగినంత విటమిన్‌ ఎ అందకపోతే క్రమేపీ కంటి చూపు తగ్గడంతోపాటు తరచుగా వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. పేగుల నుంచి విటమిన్‌ను శోషించుకోలేని అనారోగ్యాలకు గురయినప్పుడు, తరచుగా మద్యం తాగే అలవాటున్నా, పాంక్రియా్‌సకు సంబంధించిన సమస్యలున్నా విటమిన్‌ ఎ లోపం తలెత్తవచ్చు. ఈ విటమిన్‌ డెఫిసియన్సీ వల్ల ఛాతీ ఇన్‌ఫెక్షన్లు, పునరుత్పత్తి సామర్థ్యం లోపించడం, గర్భస్రావం మొదలైన సమస్యలు కనిపించొచ్చు. అలాగే కళ్లకు సంబంధించి చీకట్లో సరిగా చూడలేకపోవడం, కార్నియా పలచబడటం, పొడిబారటం, చర్మం, వెంట్రుకలు పొడిబారటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు: తల్లి గర్భంతో ఉన్నప్పుడే తగినంత ఎ విటమిన్‌ తీసుకుంటే పుట్టే పిల్లల్లో ఈ లోపం తలెత్తే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి గర్భిణిగా ఉన్నప్పుడే ఈ విటమిన్‌ లోపం తలెత్తకుండా నియంత్రించే వీలుంది. అలాగే పదేళ్ల వయసు వచ్చేవరకూ పిల్లల ఆహారంలో విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వయసులో అందే విటమిన్‌ ఎ పరిమితి మీదే ఎముకలు, దంతాలు, కంటిచూపు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే పిల్లలు తరచుగా వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. తరచుగా రోగాలబారిన పడే పిల్లల్లో విటమిన్‌ ఎ డెఫిషియన్సీ తలెత్తే అవకాశం ఉంటుంది.
చికిత్స: రోజుకి కనీసం ఐదు రకాల కూరగాయలు, పళ్లు తీసుకుంటే విటమిన్‌ ఎ లోపం రాకుండా ఉంటుంది. ధాన్యాలు, అపరాలలో ఈ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, చికెన్‌, పాలు, క్యారెట్లు, మామిడి పండ్లు, చిలకడదుంపలు, నారింజ, ఆకుకూరల్లో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరచుగా వీటిని తింటూ ఉండాలి. విటమిన్‌ ఎ లోపంతో రేచీకటి సమస్య మొదలైతే ఆరంభంలోనే గర్తించి ఆ లోపాన్ని సరిదిద్దాలి. లేదంటే కంటిచూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది.
విటమిన్‌ సి
శరీరంలోని కనెక్టివ్‌ టిష్యూ ఆరోగ్యం కోసం విటమిన్‌ సి ఎంతో అవసరం. ఈ విటమిన్‌ యాంటిఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. సి విటమిన్‌ శరీరంలో నిల్వ ఉండలేదు. కాబట్టి అవసరానికి తగ్గట్టు ఆహారం ద్వారా సి విటమిన్‌ను తీసుకుంటూ ఉండాలి. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన లోపాలు సరిచేయటానికి, హృద్రోగ సంబంధ రుగ్మతలు రాకుండా నియంత్రించటానికి, పసికందుల్లో సమస్యలు రాకుండా నియంత్రించటానికి, చర్మం, కళ్ల సంబంధ సమస్యల నివారణకు సి విటమిన్‌ అవసరం. విటమిన్‌ సి లోపం వల్ల దీర్ఘకాలంలో కణజాలం కరిగిపోయే స్కర్వీలాంటి తీవ్రమైన సమస్య కనిపించొచ్చు. అలాగే తేలికగా గాయమవటం, చిగుళ్ల వాపు, గాయాలు మానటానికి ఎక్కువ సమయం పట్టడం, జింజివైటి్‌సలాంటి చిగుళ్ల సమస్య, వెంట్రుకలు పొడిబారి చిట్లుతూ ఉండటం, చర్మం పొడిబారటం, పగలటం, రోగనిరోధకశక్తి తగ్గటం, కీళ్ల వాపు, నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు: విటమిన్‌ సి ఉన్న ఆహారం తగినంత తీసుకోకపోవటం ఈ డెఫిషియన్సీకి ప్రధాన కారణం. అలాగే ఇతరత్రా విటమిన్‌ డెఫిషియన్సీలు ఉన్నవాళ్లలో సి విటమిన్‌ లోపం కూడ కచ్చితంగా ఉంటుంది.
చికిత్స: విటమిన్‌ సి లోపాన్ని ఆహారంతోనే సరిదిద్దే వీలుంది. ఇందుకోసం నిమ్మ, నారింజ, ద్రాక్ష, జామ మొదలైన పుల్లని పండ్లు నేరుగా తినాలి. జ్యూస్‌ రూపంలో కాకుండా నేరుగా తినటం వల్ల విటమిన్‌ సి నష్టపోకుండా ఉంటాం. అలాగే కాలీఫ్లవర్‌, క్యాబేజీ, బచ్చలి, గోంగూరల్లో కూడా విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరచుగా వీటిని ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
విటమిన్‌ బి12
విటమిన్‌ బి12 మన డిఎన్‌ఎ, రక్తకణాల తయారీకి ఎంతో అవసరం. అయితే విటమిన్‌ బి12 ఎవరికి ఎంత అవసరం అనేది వాళ్ల వయసు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. విటమిన్‌ బి12 లోపం కారణంగా బలహీనత, నీరసం, గుండె వేగంగా కొట్టుకోవటం, మలబద్ధకం, ఆకలి లోపించటం, చేతులు, కాళ్లు తిమ్మిర్లు, డిప్రెషన్‌, ఙ్ఞాపకశక్తి తగ్గుదల మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు: జీర్ణాశయంలో రక్షణ పొర పల్చబడే ‘గ్యాస్ట్రయిటిస్‌’ వల్ల, అనీమియా, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, అసిడిటీ నివారణ మందుల వాడకం వల్ల విటమిన్‌ బి12 లోపం తలెత్తవచ్చు. శాకాహారుల్లో ఈ విటమిన్‌ లోపం తలెత్తే అవకాశాలు ఎక్కువ. అలాగే పూర్తి శాకాహారమే తీసుకునే తల్లులకు పుట్టే పిల్లల్లో కూడా ఈ విటమిన్‌ లోపం కనిపిస్తూ ఉంటుంది.
చికిత్స: విటమిన్‌ బి12 లోపం వల్ల వచ్చే తీవ్రమైన అనీమియా నివారణకు ఇంజెక్షన్‌ ఇవ్వొచ్చు. అలాగే ఓరల్‌ సప్లిమెంట్లతోపాటు మాంసం, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు తినాల్సి ఉంటుంది.
విటమిన్‌ కె
రక్తం గడ్డకట్టడానికి విటమిన్‌ కె అవసరం. ఈ విటమిన్‌ లోపం వల్ల రక్తస్రావం ఆగదు. ఈ సమస్య పెద్దల్లో అరుదుగా కనిపిస్తుంది. కానీ అప్పుడే పుట్టిన పసికందుల్లో ఇది కామన్‌ ప్రాబ్లెమ్‌. విటమిన్‌ కె అనేది కొన్ని కాంపౌండ్ల సమూహం. వీటిలో విటమిన్‌ కె1 ఆకుకూరలు, కూరగాయలనుంచి దొరుకుతుంది. విటమిన్‌ కె2 అనేది మాంసం, జున్ను, గుడ్ల నుంచి అందుతుంది.
కారణాలు: విటమిన్‌ కె శోషణకు అడ్డుపడే మందుల వాడకం వల్ల, తీవ్రమైన పోషకాహార లోపం, మద్యపానం వల్ల ఈ విటమిన్‌ లోపం తలెత్తవచ్చు. యాంటాసిడ్లు, రక్తం పల్చబడటానికి వాడే మందులు, యాంటిబయాటిక్స్‌, క్యాన్సర్‌ డ్రగ్స్‌, హై కొలెస్టరాల్‌ వల్ల కూడా విటమిన్‌ కె లోపం తలెత్తవచ్చు.
చికిత్స: బచ్చలికూర, బ్రొకొలి, ఆస్పరాగస్‌, బీన్స్‌, సోయా, గుడ్లు, సా్ట్రబెర్రీస్‌, మాంసం తీసుకుంటే విటమిన్‌ కె లోపం నివారించవచ్చు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.