Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 09 Aug 2016 02:59:02 IST

తెలుగు ప్రాచీనమే

తెలుగు ప్రాచీనమే

  • తేల్చి చెప్పిన మద్రాస్‌ హైకోర్టు..
  • వ్యతిరేక కేసులన్నీ కొట్టివేత
చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష ప్రాచీనమేనని మద్రాసు హైకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. ప్రాచీన హోదా ఇచ్చేందుకు తెలుగుకు అన్ని అర్హతలూ ఉన్నట్లు కేంద్రప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ చేసిన సిఫారసులతో తాము ఏకీభవిస్తున్నట్లు స్పష్టం చేసింది. తెలుగుతోపాటు, కన్నడ, మలయాళ, ఒడియా బాషలకు ప్రాచీన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని కేసులనూ కొట్టివేసింది. ఆ భాషలకు ప్రాచీన హోదా ఇవ్వడం సబబేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషనకౌల్‌, న్యాయమూర్తి ఆర్‌.మహదేవనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ప్రాచీన భాషా హోదా కోసం 2006లో ఏర్పాటైన నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పరచిన నియమాలకు అనుగుణంగా ఆయా భాష (తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా)లకు కేంద్రప్రభుత్వం ప్రాచీనహోదా ఇచ్చింది. ఇదంతా నియమ నిబంధనలకు అనుగుణంగానే జరిగింది. కాబట్టి కక్షిదారుడు ఏ విధమైన ఆక్షేపణలు ఉన్నా ఆ కమిటీకి నివేదించుకోవాలి. అందువల్ల ఈ కేసులన్నింటినీ మూసివేస్తున్నాము’’ అని ధర్మాసనం తన తుదితీర్పులో పేర్కొంది. ఈ నాలుగు భాషలకూ ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ 2009లో దాఖలైన ఆరు పిటిషన్లపై మద్రాస్‌ హైకోర్టులో ఈ ఏడాది జూలై 13న విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున సీనియర్‌ న్యాయవాది రవీంద్రనాథ్‌ చౌదరి, ‘చెన్నై తెలుగు ప్రకాశం’ పత్రిక సంపాదకులు తూమాటి సంజీవరావు, కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు ధర్మాసనం ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అప్పుడు రిజర్వు చేసిన తీర్పును ధర్మాసనం సోమవారం వెలువరించింది. హైకోర్టు తీర్పు తెలుగుభాషకు శుభదాయకమని న్యాయవాది రవీంద్రనాథ్‌ చౌదరి అన్నారు. తెలుగు ప్రాచీనమైనదని ఎప్పుడో రుజువైందని, మధ్యలో కొంతమంది అవాంతరాలను సృష్టించేందుకు ప్రయత్నించినా న్యాయస్థానం వాటిని తోసివేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. తెలుగుకు ప్రాచీన హోదా తెలుగువారి ఆత్మాభిమానానికి సంబంధించిందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనివారే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆ హోదాను నిలుపుకొనేందుకు సమైక్యంగా కృషి చేయాలని తూమాటి సంజీవరావు అన్నారు.
 
తెలుగు భాషా పీఠాన్ని ఏపీకి తీసుకొస్తాం: మంత్రి పల్లె
తెలుగు భాషకు ప్రాచీన హోదా సబబేనంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో.. ప్రస్తుతం మైసూరులో ఉన్న తెలుగు భాషా పీఠాన్ని త్వరలో ఏపీకి తీసుకొస్తామని సోమవారం సచివాలయంలో తెలిపారు. కాగా, తెలుగు భాషకు ప్రాచీన హోదా సబబేనంటూ మద్రాసు హైకోర్టు తీర్పు ఇవ్వటంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ హర్షం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు ఆవరణలో స్వీట్లు పంచిపెట్టారు. తెలుగు రాషా్ట్రలు వెంటనే ప్రాచీన భాష అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని యార్లగడ్డ కోరారు.
 
ఇవీ ప్రయోజనాలు
ప్రాచీన హోదా లభించడం వల్ల ఏ భాషకైనా కలిగే ఉపయోగమేమిటి? చూద్దాం..
  • ప్రాచీన హోదా పొందిన భాష అభివృద్ధి కోసం కేంద్రం ఐదేళ్లకొకసారి రూ.వంద కోట్లు ఇస్తుంది. అంటే సంవత్సరానికి రూ.20 కోట్లు. దీనివల్ల ఆ భాషకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించుకోవచ్చు. అంతర్జాతీయ, జాతీయ పురస్కారాల ప్రదానంతో పాటు తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి, పుస్తకాలను ముద్రించి ప్రచారం చేసుకోవచ్చు.
  • ప్రాచీన హోదా రాగానే ఆ భాషకు సంబంధించి ప్రత్యేక కేంద్రం ఏర్పాటవుతుంది. ఆ కేంద్రం కేంద్రప్రభుత్వ ఆధీనంలో వుంటుంది.
తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఈ గుర్తింపు
తేనెలొలికే తెలుగు భాష ప్రాచీన హోదా గుర్తింపునకు ఎదురైన అడ్డంకులు తొలిగిపోయాయి. తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా ప్రకటించడంపై తమిళనాడుకు చెందిన సీనియర్‌ న్యాయవాది ఆర్‌.గాంధీ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు తెలుగుకు ప్రాచీన హోదా సబబేనని సోమవారం తేల్చిచెప్పింది. కేసు చివరి దశలో తెలంగాణ ప్రభుత్వం చొరవ.. తీర్పు అనుకూలంగా రావడానికి కారణమైందని చెప్పవచ్చు. నిబంధనల ప్రకారం కనీసం 1500-2000 ఏళ్ల నుంచి సాహిత్యంలో కాని వ్యవహారంలో వినియోగంలో ఉన్న భాషను మాత్రమే ప్రాచీన హోదా గుర్తింపు కల్పించాల్సి ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 11వ శతాబ్దికి చెందిన నన్నయ్యను ఆదికవిగా పరిగణించడంతో తెలుగునకు వేయి ఏళ్ల చరిత్ర లేదని భావించిన అధికారులు మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కౌంటర్‌ను దాఖలు చేయడానికి మీనమేషాలు లెక్కించారు. దీంతో మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ వాయిదాల పర్వంతో కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చొరవ తీసుకుని వేయి ఏళ్లకు పైగా ఉన్న తెలుగు సాహితీ చరిత్ర ఆధారాలను సేకరించి మద్రాస్‌ హైకోర్టులో కౌంటర్‌ను దాఖలు చేసింది. ప్రధానంగా నిజామాబాద్‌ బోధన్‌ ప్రాంతానికి చెందిన పంప మహాకవి 9వ శతాబ్దంలో రాసిన విక్రమార్జున విజయం, ఆదిపురాణం గ్రంధాలకు సంబందించిన సమాచారాన్ని కోర్టుకు నివేదించింది. అంతే కాకుండా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పురావస్తు శాఖ పరిశోధకులను సంప్రదించి తెలుగుభాషా చరిత్రకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రోడీకరించి కోర్టుకు అందజేశారు. అలాగే గోదావరి నదీతీరంలోని కోటిలింగాల, ధూళికట్ట ప్రాంతాల్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభ్యమైన బౌద్ధ మతానికి చెందిన తెలుగుశాసనాలకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించి రెండున్నరవేల ఏళ్ల తెలుగు చరిత్ర, పద్య సాహిత్యాన్ని కోర్టు ముందుంచారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సైతం అమరావతి, తదితర ప్రాంతాల్లోని ప్రాచీన తెలుగుశాసనాలకు సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు నివేదించారు. దీంతో తెలుగుబాషకు ప్రాచీనహోదా గౌరవం పొందడానికి కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయని భావించిన మద్రాస్‌ హైకోర్టు.. ఆర్‌.గాంధీ పిటిషన్‌ను కొట్టివేసింది.
 
అంతర్జాతీయ తెలుగుకేంద్రం..
ప్రాచీన హోదా పొందిన తెలుగుభాషా పరిశోధనల కోసం కేంద్రప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. 2006లోనే ప్రాచీన బాషగా గుర్తింపు పొందినప్పటికీ కోర్టు వివాదాల కారణంగా అమలు చేయలేకపోయిన భారత ప్రభుత్వం ఇక తెలంగాణలో తెలుగుభాషా వికాసం, తులనాత్మక అధ్యయనం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నది. అలాగే మద్రాస్‌, బెంగుళూరు. లండన్‌తదితర మ్యూజియాల్లో ఉన్న పురాతన తెలుగు తాళపత్ర గ్రంధాలను తెలుగు అంతర్జాతీయ కేంద్రానికి తరలించి పరిశోధించేందుకు అవకాశం లభిస్తుంది. ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కుతుంది. ప్రధానంగా రెండున్నరవేల ఏళ్ల నాటి తెలుగుసాహిత్యం అధ్యయనం ద్వారా నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా ప్రాచీన తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించి చరిత్రను నిర్మించుకునే సావకాశం లభిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

‘ప్రత్యేక కేంద్రం’ ఎక్కడ?.. తెలుగు రాష్ట్రాల మధ్య మరో సమస్య
ప్రాచీన హోదాకు తెలుగు అర్హమైనదేనని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేయడం పట్ల తెలుగువారందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడో చిన్న సమస్య. ‘ప్రాచీన హోదా’ నిబంధనల ప్రకారం తెలుగు భాష అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. తమిళనాడులో అయితే ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏర్పాటు చేశారు. మరి తెలుగు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? తెలంగాణలోనా? ఆంధ్రప్రదేశ్‌లోనా? ఈ విషయం తేలాల్సి ఉంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కార్యదర్శి వెంకటేష్‌, సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రాచీన హోదా వల్ల వచ్చే నిధులు, కేంద్రం తమకే రావాలని వారు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇందుకు భిన్నంగా స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ వ్యవహారం రెండు రాషా్ట్రల మధ్య మరో వివాదానికి కారణమవుతుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. రెండు ప్రభుత్వాలూ వివాదానికి దిగుతాయా లేక కేంద్ర నిధులను 52:48 నిష్పత్తిలో పంచుకుని భాషాభివృద్ధికి కృషి చేస్తాయా లేక మరేదైనా మార్గాంతరం ఉన్నదా.. వేచి చూడాల్సి ఉంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.