Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Wed, 01 Oct 2014 23:57:14 IST

హాంకాంగ్‌ ఆర్తనాదం

హాంకాంగ్‌ ఆర్తనాదం

ఆసియాలో అత్యధిక బిలియనీర్లు ఉన్న హాంకాంగ్‌లో ఏం జరుగుతోంది? ఈ విషయంలో బీజింగ్‌ కంటే ముందుస్థానంలో ఉంటూ, రెండేళ్ళ క్రితం వరకూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఉన్న హాంకాంగ్‌లో లక్షలాది మంది యువకులు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు బైఠాయించాల్సి వచ్చింది? సోషల్‌ మీడియా చేయూతతో నానాటికీ పెరిగిపోతున్న ఈ ఉద్యమాన్ని చైనా కమ్యూనిస్టు నాయకులు ఎలా పరిష్కరిస్తారు?
పాతికేళ్ళ క్రితం తియాన్మెన్‌ స్వ్కేర్‌లో మీదకు వస్తున్న యుద్ధ ట్యాంకర్‌కు ఎదురుగా నిలబడి రెండు చేతులూ అడ్డుపెడుతూ ముందు తన ప్రశ్నకు సమాధానం చెప్పమని నిలదీస్తున్న ఆ యువకుడి మొఖం మళ్ళీ కళ్ళముందు పదేపదే కదలాడుతోంది. హాంకాంగ్‌ సెంట్రల్‌లో బైఠాయించిన పదిలక్షల మంది ముఖాలూ అతడిలాగే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీమళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. తియాన్మెన్‌ స్క్వేర్‌లో చైనా అధినాయకత్వం ఏ సమాధానం చెప్పిందో వారికి తెలియంది కాదు. ప్రజాస్వామ్యం కోసం అదే సమాధానానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అరెస్టులు, లాఠీచార్జిలు, బాష్పవాయు ప్రయోగం వంటి చిన్నాచితకా బెదిరింపులకు వారు లొంగడం లేదు. ‘ఆక్యుపై సెంట్రల్‌’ నినాదం మొబైల్‌లో మెరవగానే, వచ్చి కూర్చుంటున్నారు. రాజకీయనాయకులు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవేత్తలు, తమ భూ భాగాన్ని తన అధీనంలోకి తీసుకుంటున్నప్పుడు చైనా ఏ ప్రమాణాలు చేసిందో, అప్పగింతలు పెడుతున్నప్పుడు బ్రిటన్‌ ఎన్ని హామీలు ఇచ్చిందో, సాక్షి సంతకం చేసిన అమెరికా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో చెబుతుంటే వింటున్నారు. చరిత్రను సెర్చి చేసి తెలుసుకుంటున్నారు. అగ్రరాజ్యాలను ఆదుకోమని నిలదీస్తున్నారు.
నల్లమందు యుద్ధంలో చైనా ఓడిపోయినందు వల్ల బ్రిటిష్‌ వలస ప్రాంతంగా మారిపోయిన హాంకాంగ్‌ 155 ఏళ్ళ కాలంలో ప్రధాన చైనాకు భిన్నమైన వాతావరణంలో ఎదిగింది. బ్రిటిష్‌ రాణి నియమించిన అధికారులు వలస ప్రాంతంలో కాలుమోపకుండా పరిపాలించిన కారణంగానేమో ఎన్నికలంటూ లేకపోయినా అన్ని రంగాల్లో స్వేచ్ఛను అనుభవిస్తూ వచ్చింది. రాజకీయంగా, సాంస్కృతికంగా ఒక భిన్నమైన వాతావరణానికి అలవాటుపడింది. పెట్టుబడిదారీ విధానంతో పెట్టుబడులకు కేంద్రంగా మారుతూ వచ్చింది. 1984లో బ్రిటన్‌-చైనా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా 1997లో తిరిగి చైనా చేతుల్లోకి పోయేలోగా హాంకాంగ్‌ వాసులు తమ అనుమానాలూ, భయాలను వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు కూడా. అయితే, ఒప్పందంలో భాగంగా కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహా మిగతా ఏ అంశాల్లోనూ ప్రధాన చైనాలో అమలు జరుగుతున్న విధానాలు హాంకాంగ్‌లో ఉండవన్న హామీ లభించడంతో వారిలో కాస్తంత నమ్మకం కుదిరింది. డెంగ్‌ జియావోపింగ్‌ ఒకదేశం-రెండు వ్యవస్థలంటూ చేసిన ప్రమాణం వారిలో ఆశలు చిగురింప చేసింది. హాంకాంగ్‌ కోసం ప్రత్యేక చట్టం, ప్రత్యేక పాలనావ్యవస్థలు ఏర్పడ్డాయి. మరో యాభైయేళ్ళపాటు ఈ చట్టం కిందే పాలన ఉంటుందన్నారు. కానీ, ఈ అన్ని హామీల అమలు అన్నింటా బలహీన పడినట్లే, ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో)ని ఎన్నుకోవడమనే ప్రక్రియలో కూడా ప్రజాస్వామ్య వాసనలు తగ్గుతూ వచ్చాయి. స్థానిక ప్రాతినిధ్యం పెంచుతున్నట్టు పైకి కనిపిస్తున్నా, చైనా ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యాపారవేత్తలు, ప్రముఖులతో నియమించిన కమిటీ ప్రధానంగా సదరు వ్యక్తిని ఎంపిక చేయడం జరుగుతోంది. 2017 నాటికి సీఈవోను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొనే అవకాశం కల్పిస్తామన్న హామీ సమయం దగ్గరపడుతూండటంతో చైనా పాలకుల్లో అనుమానాలనూ, భయాన్నీ రేకెత్తించింది. ఆగస్టు 31న ఒక చట్టాన్ని చేస్తూ, ఒక ప్రత్యేక కమిటీ వడపోత తరువాత ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే బరిలో ఉంటారనీ, ఎవరో ఒకరిని హాంకాంగ్‌ వాసులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవచ్చంటూ మెలిక పెట్టింది. చైనా పాలకులు అసలు స్వరూపాన్ని విస్పష్టంగా ఆవిష్కరించడంతో ప్రజలు భగ్గుమన్నారు.
హాంకాంగ్‌ సీఈవో లాంగ్‌ చున్‌-ఇంగ్‌ ఇప్పుడు ప్రజలకూ, చైనా పాలకులకూ మధ్య నలిగిపోతున్నారు. కవులూ కళాకారులూ నటులూ చైనా పాలకులు హామీలను ఎలా ఉల్లం ఘిస్తూ వచ్చారో చెబుతూ ఆయనను నిలదీస్తున్నారు. రాజీనామా చేయకపోతే సెంట్రల్‌ నుంచి చెల్లాచెదురై అన్నింటినీ ఆక్రమిస్తామని హెచ్చరిస్తున్నారు. హాంకాంగ్‌ విషయంలో ఏమాత్రం లొంగినట్టు కనిపించినా దాని ప్రభావం ప్రధాన భూభాగం మీద ఉంటుందన్న చైనా భయం అర్థం చేసుకోదగినది. వాణిజ్యరంగంలో మాత్రం విస్తృతమైన స్వేచ్ఛ కల్పించి, బహుళ జాతి కంపెనీలకు తలుపులు బార్లా తెరిచి, కార్మిక సుస్థిరతను భయాన సాధించి సంపూర్ణ పెత్తనం అనుభవిస్తున్న పాలకులకు అక్కడి వాసనలు ఇక్కడ ఏమాత్రం తగిలినా ప్రమాదమే. తియాన్మెన్‌ స్క్వేర్‌ ఉద్యమం తరువాత కూడా కమ్యూనిస్టు పాలకుల వ్యవహారశైలిలో కించిత్తు మార్పు రాలేదు. చైనాలోని వివిధ ప్రాంతాల్లోనూ, టిబెట్‌లోనూ వెల్లువెత్తుతున్న ప్రజాస్వామ్య ఆకాంక్షల విషయంలో వారి వ్యవహారం చూస్తూనే వున్నాం. హాంకాంగ్‌ విషయంలో ఇతరుల జోక్యాన్ని ఏ మాత్రం సహించబోనని ఇప్పటికే ప్రపంచాన్ని హెచ్చరించిన చైనా, అటువంటి పరిస్థితి తెచ్చుకోనక్కరలేకుండా ప్రజాస్వామికంగా వ్యవహరించడం మంచిది. అహానికి పోకుండా ఆగస్టు చట్టాన్ని తక్షణం రద్దుచేయడం ద్వారా విస్ఫోటనానికీ, వ్యాప్తికీ సిద్ధంగా ఉన్న ఒక పెద్ద సమస్యను పరిష్కరించాలి. పెట్టుబడిదారీ కేంద్రంగా ఉన్న ప్రాంతంలో రక్తం చిందిస్తే ప్రధాన చైనా నుంచి ఇప్పటికే హాంకాంగ్‌కు మారిపోయిన గూగుల్‌ వంటి సంస్థలు మరిన్ని మరొక చోటకు పారిపోతాయి. ఏకపార్టీ పాలనకు, నియంతృత్వానికీ దీర్ఘకాలంగా అలవాటుపడి ఉన్న చైనా సమాజం 1989 పరిణామాల తరువాత కూడా ప్రజాస్వామ్య ఆకాంక్షలను దిగమింగి మనగలుగుతోంది కానీ, మొదటినుంచీ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉంటూ వచ్చిన హాంకాంగ్‌ సమాజం ప్రభుత్వ అణచివేతను ఎక్కువకాలం సహించలేదన్నది కూడా గుర్తించాలి.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.