desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 30 2016 @ 01:26AM

నిశ్శబ్ద భాషావిప్లవకారుడు

పట్టుబట్టి సంప్రదాయ తెలుగు వ్యాకరణాల్నీ, సంస్కృత వ్యాకరణాల్నీ, పరిభాషల్నీ, సంజ్ఞల్నీ స్వయంగా చదివి నేర్చుకొని అక్కడితో వదిలెయ్యక దానిని ఆధునిక భాషాశాస్త్రా‌నికి అన్వయించి చూపిన ఘనుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు.
 
ఈకంటిని రెప్ప తనలోనికి పొదువుకొనే లోపు, ఆ రెప్పలు మోసే కలల్ని సాకారం చెయ్యాలి అనుకుంటూ అవిశ్రాంతంగా శ్రమించేవాళ్లు కొందరే మనకు తారసపడతారు. వాళ్లు నిశ్శబ్ద ప్రేమికులు. పటాటోపాల్ని పక్కకు రానివ్వరు. గుర్తింపు కోసం గుంపుల్లో చేరిపోరు. కంటి ముందు వెలిగే కర్తవ్య దీపాన్ని కొండెక్కి పోకుండా చూస్తే చాలు అనుకొని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో భాషాతపస్వి నిశ్శబ్ద భాషావిప్లవకారుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ఒకరు.
 
                  భాష పరిమళించాలి అంటే హృదయంలో పూలతోటలు విరియాలి. ఆ తోటలకు సంస్కారమనే సారం నిత్యం అందుతూ ఉండాలి. నేను యాక్టర్ని కావాలా? డాక్టర్ని కావాలా? అంటే ముందు మనిషివికా. వీలైతే మంచి మనసున్న మనిషివికా! అన్నాడట ఓ చిన్నాయనతో పెద్దాయన. ఉమామహేశ్వరరావు గారి సౌమ్యగుణం, సౌశీల్యం, జాలి, విద్యార్థుల పట్ల వల్లమాలిన వాత్సల్యం, ఉద్యోగంలో నిబద్ధత, అంకితభావం లాంటి గుణాలు ఆయనలోని భాషాశాస్త్రపటిమకు పరిమళం అద్దినట్లు చేశాయి. ఎందరో విద్యార్థుల భవితకు పల్లవులు ఊదిన వీరి శాస్త్రశోధన అపారమైనది.
 తొలినాళ్లలో సైన్సు విద్యార్థిగా ఎమ్మెస్సీ చేసినా భాషాశాస్త్రం అదృష్టం కొద్దీ దృష్టి అటుమళ్లింది. తెలుగు భాషాశాస్త్ర రారాజు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి భాషామానసపుత్రులుగా వీరిని సహచరులు కొనియాడుతుంటారు. అసలు భాష అంటే ఏమిటో, దానికి శాసీ్త్రయత ఎలా ఉంటుందో, సంప్రదాయ వ్యాకరణ పరిజ్ఞానం ఎంతమాత్రమూ లేని ఒక పల్లెటూరి కుర్రవాడు ఆచార్య భద్రిరాజు గారి ప్రియశిష్యుడిగా నిలబడ్డాడంటే దాని వెనుక కంటిరెప్పను అంటించని రాత్రులున్నాయి. మేధస్సుతో భాషాసాగరాన్ని మథించిన సందర్భాలున్నాయి. పట్టుబట్టి సంప్రదాయ తెలుగు వ్యాకరణాల్నీ, సంస్కృత వ్యాకరణాల్నీ, పరిభాషల్నీ, సంజ్ఞల్నీ స్వయంగా చదివి నేర్చుకొని అక్కడితో వదిలెయ్యక దానిని ఆధునిక భాషాశాసా్త్రనికి అన్వయించి చూపిన ఘనుడీయన. భద్రిరాజు, బూదరాజు, పి.యస్‌. సుబ్రహ్మణ్యం లాంటి దిగ్దంతుల భాషాకృషిని అనన్యసామాన్యమైనదే. కానీ దానికి పరిమితులున్నాయి. వారి కృషిని ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు కంప్యూటర్‌ రంగానికి అనువర్తింపజేయటం ఆధునిక భాషాశాస్త్ర రంగంలోనే ఒక పెద్ద మలుపు. చాలామందికి భాషాశాస్త్ర పాండిత్యం ఉంటుంది. కంప్యూటర్‌లో పరిజ్ఞానం అస్సలు ఉండదు. కంప్యూటర్‌ ఇంజనీర్లకి భాషాజ్ఞానం శూన్యం. వీరివల్ల లోకానికి ఏం ప్రయోజనం లేదని ఏనాడో గుర్తించిన గారపాటి తన మార్గాన్ని తానే నిర్మించుకున్నారు. మొదట రాళ్లూరప్పలూ నిండిన దారి ఈనాడు భారతదేశం గర్వించదగిన రీతిలో ముఖ్యంగా తెలుగు భాష కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన రాజమార్గంగా వీరి చేతిలో ముస్తాబు అయ్యిందంటే దాని వెనుక 40సంవత్సరాల కఠోర దీక్ష కృషి ఉన్నాయి. తెలుగులో ఒక పదాన్ని కంప్యూటర్‌ ద్వారా విభాగం చేసి మూలాలు కనుక్కోవచ్చు. ఒక భాష నుంచి ఇంకో భాషకు అనువాదం చేసుకోవచ్చు. కంప్యూటర్‌లో రాస్తున్నప్పుడు తప్పుఒప్పుల్ని దిద్దుకోవచ్చు. ఇలా పదవిశ్లేషిణి(Morphological Analyzer),, యంత్రానువాదం (Machine Translation), వాక్యవిశ్లేషిణి(Parser), దిద్దరి (Spell Checker) వంటి ఎన్నో ఉపకరణాలను భారతీయ భాషలన్నింటికీ అందించిన కృషికి వీరే కర్త, కర్మ, క్రియ. ముఖ్యంగా తెలుగుభాషకు ఇన్ని అత్యాధునికమైన ఉపకరణాల రూపకల్పనలో వీరి సాంకేతిక దృష్టీ, శాసీ్త్రయ పుష్టి ఎంతగానో సహకరించాయి. ఆపన్న భాషల పట్ల (Endangered Languages) ఆదరణ, ఆ భాషల స్వరూప స్వభావాలను, వర్ణనాత్మక వ్యాకరణాన్నీ రచించాలన్న ఆశయంతో గోండీ భాషపై విశేషమైన కృషి చేశారు. వీటన్నింటినీ మించి ఇప్పటివరకూ చరిత్రలో ఏ ఆనవాళ్లూలేని సింధూ నాగరికత కాలంలోనే ద్రావిడ భాషలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని ప్రపంచంలోని సమీప భాషా పదాలతో పోల్చి చూపి, వాటి సహజాతాల ఆధారంగా ద్రావిడ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. ద్రావిడ - మంగోలు భాషల మధ్య ఉన్న సంబంధాన్ని సోపపత్తికంగా వర్ణ, పద, సహజాత పదాల ఆధారంగా నిరూపించారు. శిలలు కరిగిపోవచ్చు. శిథిలాలు కూలిపోవచ్చు. కానీ తరతరాల వారసత్వ సంపద భాష. భాష చెరిగిపోదు, తరిగిపోదు, కరిగిపోదు. అయితే మన దురదృష్టం కొద్దీ చరిత్ర, మానవజాతి చరిత్రలను వాటి మూలాలను అధ్యయనం చేసేవాళ్లెవరూ భాషను ఆధారంగా తీసుకోలేదు. దానికి అంతటి శాస్త్రా‌వగాహన వాళ్ళకు లేకపోవడమే కారణం. ఒక్క ‘ఏనుగు’ అన్న పదం ఆధారంగా ద్రావిడ చరిత్రను, ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ఏనుగుల ఉనికినీ, వాటి వలసనూ ఆశ్చర్యకరంగా నిరూపించారు. ఈ పత్రం అనేక అంతర్జాతీయ సదస్సుల్లో అందరినీ ఆకర్షించింది. మొత్తం ద్రావిడ జాతినే ప్రాచీనకాలంలో ‘తెలుగు’ అనే పేరుతో వ్యవహరించారని గారపాటివారు చూపిన ఆధారాలను తమిళులు కూడా అంగీకరించారంటే అది వారి పరిశోధనాపటిమకు ఆనవాలు. తెలుగు భాష విషయానికొస్తే - మండలాల హద్దుల్ని చెరిపివేసి ఎవరు ఏ మాండలికంలో రాసినా మాట్లాడినా ఇట్టే మార్చుకొనే భాషా పరివర్తనాలను(Language Converters)వీరు ప్రస్తుతం తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
 
                  తెలుగు భాషా విధానం ఇలా ఉండాలి, అని వీరు రచించిన ముసాయిదా అందరికీ ఆమోదయోగ్యమైంది. భాష వారసత్వ సంపద అనీ, ఆ వారసత్వం ఉగ్గుపాల నుంచీ మాతృభాష ద్వారా అందాలనీ, మాతృభాషామాధ్యమాన్ని మించిన మనోవికాసం వేరొకటి లేదనీ ప్రసంగాల ద్వారా, పత్రాల ద్వారా, సామాజిక రంగాల ద్వారా ఎలుగెత్తి ఘోషిస్తున్నారు. భాషావిధ్వంసం అంటే జీవ విధ్వంసం కంటే భయంకరమైనదనీ, కొన్ని శతాబ్దాల సంస్కృతినీ, నాగరికతనీ తుడిచిపెట్టడమేననీ వారు వివరించిన తీరు ఇప్పుడిప్పుడే అందరినీ ఆలోచింపచేస్తుంది. మా తెలుగు కమ్మనిదీ, తియ్యనిదీ అంటూ చెప్పే మాటల వల్ల ప్రయోజనం శూన్యం. ఎందుకు తెలుగు అవసరమో నొక్కి చెప్పే సమయం వచ్చిందనీ, ఈ సందర్భంలో గనక తెలుగును నిలబెట్టుకోలేకపోతే ఇంకెన్నడూ సాధ్యం కాదని చెప్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయం అనువర్తిత భాషాశాస్త్ర, అనువాద అధ్యయన కేంద్ర విభాగాధిపతిగా పనిచేస్తూ ఈ నెల 30వ తేదీన పదవీవిరమణ చేస్తూ, అవిశ్రాంతంగా శ్రమించడానికి ముందుకు వస్తున్నారు. భాష కంటే భావం ముఖ్యమని, ఆ భావం సంస్కారవంతంగా ఉండాలని నమ్మే వీరి కృషిని అభినందిస్తూ తెలుగు వెలుగు దశదిశలా చాటడానికి మనమూ చెయ్యి కలుపుదామా!
- డా. అద్దంకి శ్రీనివాస్‌
(నేడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు పదవీవిరమణ సందర్భంగా)