Jun 26 2016 @ 00:02AM

...చితిపై పి.వి. పార్థివ దేహం కాలుతూనే ఉంది

పాతికేళ్ళ క్రితం పీవీ నరసింహారావు అనుకోకుండా భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు దేశం ఆర్థికంగా సంక్షోభ స్థితిలో ఉంది. పార్లమెంటులో మైనారిటీగా ఉంటూ పీవీ దేశగమనదిశను మార్చివేశారు. ఇంతవరకూ ఎవరూ చూడని పీవీ వ్యక్తిగత పత్రాలను, వందకు పైగా ఇంటర్వ్యూలను ఆధారం చేసుకుని పాత్రికేయుడు వినయ్‌ సీతాపతి ‘హాఫ్‌ లయన్’ పేరిట పీవీ జీవిత చరిత్ర రచించారు. పెంగ్విన్ బుక్స్‌ ప్రచురించిన ఈ పుస్తకం ఆవిష్కరణ సోమవారం ఢిల్లీలో జరగనుంది. దీనిని ‘ఎమెస్కో’ తెలుగులో ‘నరసింహుడు’ పేరిట ప్రచురించింది. టంకశాల అశోక్‌, కె.బి. గోపాలంతో కలిసి జి.వల్లీశ్వర్‌ అనువదించారు. గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరణ. పీవీ హయాంలోని పలు సంఘటనలను గురించి ఈ పుస్తకం అనేక సత్యాలను వెల్లడిస్తుంది. తొలి అధ్యాయం ‘సగం కాలిన శవం’ లోని కొన్ని భాగాలు ఇవి..
 
            2004 డిశంబరు 23
                           మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలోని మోతీలాల్‌ రోడ్డులో తొమ్మిదో నెంబరు ఇంటిముందు ఎయిమ్స్‌ అంబులెన్స్‌ వచ్చి ఆగింది. అందులోంచి తెల్లటి ధోతి, సిల్కు లాల్చీ ధరించి వున్న ఒక మృతదేహాన్నిదించి, ఇంట్లోకి చేర్చారు. 1991 నుంచి 1996 వరకూ భారతదేశానికి ప్రధానమంత్రిగా వుంటూ, ఈ దేశపు కీర్తి బావుటాని ప్రపంచ పటంలో సమున్నత స్థానాలకు తీసుకువెళ్లిన రాజనీతివేత్త పాములపర్తి వేంకట నరసింహారావుది ఆ పార్థివ శరీరం. 23 ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎయిమ్స్‌లో తుదిశ్వాస తీసుకుంటే, ఆ శరీరానికి అందమైన వస్ర్తాలు కట్టి, మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఆయన నివాసగృహానికి చేర్చారు. ఒక్కసారిగా ఆ ప్రాంగణం ఘొల్లుమంది. ఏడ్పులతో నిండిపోయింది. అలా తండ్రి దేహాన్ని చూస్తూనే ఆయన పెద్దకొడుకు రంగారావు వెక్కి వెక్కి ఏడుస్తూ కూలబడిపోయారు. పి.వి.గారి కొడుకులు, కూతుళ్లు (మొత్తం 8 మంది) మనుమలు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అతి దగ్గర బంధువులు కూడా అక్కడ శోకసముద్రంలో మునిగిపోయి ఉన్నారు.
 
                  బంధువులు కానివాళ్లలో - ముప్పైఏళ్లకు పైగా పి.వి.కి. సన్నిహితుడైన - చంద్రస్వామి ముందుగా అక్కడకు చేరుకున్నాడు. రాజకీయ నాయకుల రాక మొదలైంది. ఇక (శవ) రాజకీయం కూడా అప్పుడే మొదలైంది. హోం మంత్రి శివరాజ్‌పాటిల్‌ పి.వి. చిన్నకొడుకు ప్రభాకర్‌ దగ్గరికి వచ్చారు. ‘‘నాన్నగారి అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగాలి ప్రభాకర్‌’’ అన్నారు పాటిల్‌. నిశ్చేష్టుడయ్యాడు ప్రభాకర్‌. ‘‘అలా ఎలా కుదురుతుంది? నాన్నగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినవారు. అంత్యక్రియలు ఇక్కడే జరగడం న్యాయం కదా!’’ ఏడుపు దిగమింగుకుంటూ ప్రభాకర్‌ అన్నారు. ప్రభాకర్‌ ఒక్కరేకాదు, పి.వి.గారి కుటుంబ సభ్యులంతా అదే కోరుతున్నాం అన్నారు. వాళ్లలా కోరటానికి బలమైన కారణం - కేవలం ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తుండడమే కాదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పి.వి. ముఖ్యమంత్రిగా పనిచేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆ తరువాత ఆయన రాజకీయ జీవితమంతా ఢిల్లీలోనే గడిచింది. జాతీయ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా, మానవ వనరుల శాఖామంత్రిగా, చివరికి ప్రధానమంత్రిగా... ఇదంతా ఢిల్లీలోనే గడిచింది. ఢిల్లీతో ఆయన అనుబంధం విడదీయరానిదయిపోయింది. అందుకే కుటుంబమంతా ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే జరగాలని కోరుకుంది.
 
                  శివరాజ్‌పాటిల్‌ తాపీగా స్పందించారు. ‘‘ఇక్కడికి ఎవ్వరూ రారయ్య.’’కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీకి విశ్వాసపాత్రుల్లో ఒకరైన కాశ్మీరీ నాయకుడు గులామ్‌ నబీ ఆజాద్‌ వచ్చారు. అతను కూడా పాటిల్‌ చెప్పిన విషయం మీదే పి.వి. కుటుంబానికి ‘హితవు’ చెప్పడం ప్రారంభించారు. ఒక గంట తరువాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డా. వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి నుంచి ప్రభాకర్‌కి ఫోన్‌ కాల్‌ వచ్చింది.  ‘‘ప్రభాకర్‌, జరిగినదానికి చాలా బాధగా ఉంది... సరే, నేనిప్పుడు అనంతపురంలో ఉన్నాను, ఈ సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాను. నాన్నగారికి మనం హైదరాబాద్‌లో చరిత్రాత్మకమైన రీతిలో అంత్యక్రియలు జరిపిద్దాం. నా మాటలు నమ్మండి.’’ సూర్యాస్తమయం అవుతుండగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చారు. ఆమె వెనకాలే ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కేంద్రమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ. వాళ్లు నేరుగా పి.వి. మృతదేహం ఉంచిన గదిని ఆనుకుని ఉన్న వరండాలోకి వెళ్లారు. అక్కడ పూలతో అలంకరించబడిన పి.వి.దేహాన్ని చూశారు. 
 
                  ప్రధానమంత్రి ప్రభాకర్‌ని పక్కకు పిలిచి అడిగారు, ‘‘అంత్యక్రియల విషయంలో మీరేం చేద్దామనుకుంటున్నారు?... మా వాళ్లంతా హైదరాబాదులో జరగాలనుకుంటున్నారు...’’
 
                  ‘‘అదేంటి సార్‌! ఢిల్లీ నాన్నగారి కర్మభూమి కదా! కొంచెం మీరే మీ మంత్రివర్గానికి చెప్పి ఒప్పించవచ్చు కదా!’’ అంతటి బాధలోనూ నిర్మొహమాటంగా చెప్పారు ప్రభాకర్‌.అంతలో ప్రధానమంత్రి సలహాదారు సంజయ్‌ బారు వచ్చారు. అతను ఆ వరండాలోకి అడుగుపెట్టగానే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ బారు భుజం తట్టారు. ‘‘నీకు ఈ కుటుంబమంతా బాగా తెలిసినవాళ్లేనా?’’ బారు అవునన్నట్టు తలూపాడు. ‘‘మృతదేహాన్ని హైదరాబాదు తరలించే విషయంలో ఆ కుటుంబాన్ని కొంచెం ఒప్పించగలవా?’’ 
 
                  బారు సాలోచనగా తల పంకిస్తూ, వరండా చివర పి.వి. దేహం ఉన్న గదిలోకి వెళ్లారు. ఒక్కపక్క నుంచి వినిపిస్తున్న ఏడుపు విని అటుతిరిగి చూశారు. అక్కడ సీనియర్‌ జర్నలిస్టు, పి.వి.గారికి ఆప్తురాలైన కల్యాణి శంకర్‌ దుఖిస్తూ కనబడింది. డా. రాజశేఖర రెడ్డి ఢిల్లీ చేరుకుని, నేరుగా పి.వి. నివాసానికి వచ్చేశారు. పి.వి.కి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ‘‘నన్ను విశ్వసించండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మనది. నాన్నగారిని హైదరాబాదుకు తీసుకువెళ్దాం. అక్కడ అంతిమయాత్ర ఘనంగా చేద్దాం..’’ అని చెప్పుకుంటూ వెళ్లారు.పి.వి. కుమార్తె వాణిదేవి మాటల్లో చెప్పాలంటే, ‘‘ఆ రోజు మా కుటుంబాన్ని ఒప్పించటంలో వైయస్‌ కీలకపాత్ర పోషించారు.’’ 
 
                  పి.వి.కి. ఒక స్మృతి చిహ్నం ఢిల్లీలోనే ఏర్పాటుకావాలని ఆయన కుటుంబ సభ్యులంతా కోరుకున్నారు. ఈ మేరకు ఒక హామీ ఇవ్వాలని కూడా వాళ్లు పట్టుబట్టారు. అక్కడున్న కాంగ్రెస్‌ నాయకులంతా ‘‘అవును, అవును’’ అన్నట్లు తలలూపారు. అయినా ఆ కుటుంబం నమ్మలేకపోయింది. పి.వి.ని ఆయన చివరిరోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఎంత చిన్నచూపు చూసిందో వాళ్ల గుండెల్లో ఇంకా మెదులుతూనే ఉంది. అందుకే పట్టుబట్టారు. పి.వి.ని చివరిరోజుల దాకా వెన్నంటి ఉన్న డా. మన్మోహన్‌ సింగ్‌ని ఆ కుటుంబసభ్యులు ఆ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రేస్‌కోర్సు రోడ్డులోని ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు. వాళ్లతో ప్రధానమంత్రి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అక్కడే ఉన్న శివరాజ్‌పాటిల్‌ ప్రధానమంత్రితో ‘‘సర్‌, ఒక స్మృతి చిహ్నం మనం ఢిల్లీలో నిర్మించాలి’’ అన్నారు. ‘‘అదేమంత పెద్ద విషయం? చేసేద్దాం.’’ ఇది ప్రధానమంత్రి భరోసా. పి.వి.కుమారుడు ప్రభాకర్‌ మాటల్లో చెప్పాలంటే - ‘‘మాకప్పటికే అనుమానం ఉంది. నాన్నగారి అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం సోనియాగాంధీకి ఇష్టం లేదు. ఇక స్మృతి చిహ్నం సంగతి చెప్పేదేముంది?... నాన్నగారిని ఒక జాతీయనాయకుడిగా గుర్తించడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు... మా మీద ఆవిడ చాలా వత్తిడి తీసుకువచ్చింది. చివరికి మేం ఒప్పుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది.’’  తెల్లవారింది.
 
2004 డిసెంబర్‌ 24
 
                  కమ్యూనిస్టుల నుంచి భారతీయ జనతా పార్టీ దాకా నాయకులందరూ పివికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయన ఇంటి దగ్గర క్యూ కట్టారు. పది గంటలయింది. పివి మృతదేహాన్ని భారత జాతీయ పతాకంతో అలంకరించారు. అందంగా పూలతో అలంకరించిన సైనికవాహనం మీద ఆ దేహాన్ని ఉంచారు. సైనికాధికారుల వాహనాలు వెంట రాగా, నిదానంగా ఒక ఊరేగింపులో ఆ మృతదేహాన్ని ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. దారిలో అక్బర్‌రోడ్డులో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఊరేగింపును ఒకసారి ఆపాలనుకున్నారు. అనేక సంవత్సరాల పాటు పి.వి. అక్కడ నుంచే పనిచేశారు కదా! ఊరేగింపు సోనియాగాంధీ ఇంటిపక్కనున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి రాగానే దాదాపు నిలిచిపోయింది.
 
                  కాని..! పి.వి. నాయకత్వంలో ఒక వెలుగు వెలిగిన ఆ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గేట్లు ఆ సమయంలో మూసివేసి ఉన్నాయి. అక్కడ అనేకమంది సీనియర్‌ నాయకులున్నారు. ఎవరూ ఆ గేట్లు తెరిచే ధైర్యం చేయలేకపోయారు. ఒక్కసారి ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. పి.వి. మృతదేహం ఉన్న వాహనం ఆ అక్బర్‌ రోడ్డులోనే ఒక పక్కగా ఆగింది. సోనియాగాంధీ రోడ్డుమీదకొచ్చి శ్రద్ధాంజలి ఘటించింది. కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎవరు చనిపోయినా వాళ్ల దేహాల్ని పార్టీ కార్యాలయ ఆవరణలో ఉంచడం, అక్కడికి సామాన్యకార్యకర్తలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఈ సారి అలా జరగలేదు. పి.వి. కుటుంబం నిర్ఘాంతపోయి చూస్తున్నారు. పి.వి.గారి మిత్రుడొకరు ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడితో చెప్పాడు - ‘‘ఆ బాడీని పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్తే మంచిదికదా!’’
‘‘ఆ గేట్లు తెరుచుకోవు’’ అని ముభావంగా చెప్పి ఊరుకున్నాడు ఆ నాయకుడు. ‘‘ఇది అన్యాయం. గతంలో మాధవరావు సింధియా చనిపోయినప్పుడు ఇవే గేట్లు తెరిచారు. ఆయన బాడీని లోపల పెట్టారు. ఇప్పుడేమయింది?’’ అని ఆ పి.వి. మిత్రుడు గొణుక్కున్నాడు.
 
                  మన్మోహన్‌సింగ్‌ బంగ్లా కూడా అక్బర్‌ రోడ్డుకి చాలా దగ్గరే. అయితే ఇప్పుడు మన్మోహన్‌సింగ్‌ ఏమంటారంటే ‘‘నేనప్పుడు అక్కడ ఉన్నమాట నిజమేకాని, ఈ విషయం నాకు గుర్తులేదు.’’ కాని మరో సీనియర్‌ నాయకుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘గేట్లు తెరుస్తారని మేం చాలా ఆశగా ఎదురుచూశాం. కాని ఆ ఆదేశాలు ఇవ్వాల్సిన ఆమె ఇస్తే కదా!...’’. ఒక ముప్పై నిమిషాల తరువాత ఊరేగింపు ఎయిర్‌పోర్టు వైపు బయలుదేరింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఎన్‌-32 విమానంలో ఆ దేహాన్ని ఉంచారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ విమానం హైదరాబాదు చేరుకుంది. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్‌, ప్రధాన కార్యదర్శి, మంత్రివర్గ సభ్యులు వగైరా చాలా మంది పివి మృతదేహాన్ని సగౌరవంగా స్వీకరించారు. భారతసైన్యంలో గోర్ఖా సైనికులు గౌరవవందనం సమర్పిస్తుండగా శవపేటికను సైనికవాహనం పైకి ఎక్కించారు. అయితే ఆ వాహనం మీద ఈ శవపేటిక పట్టలేదు. అప్పుడు వాళ్లు ఆ వాహనం మీద పెద్ద రబ్బరుషీట్లు పరచి, ఆ రబ్బరుషీట్ల మీద ఆ శవపేటికను పెట్టి, నైలానుతాడుతో గట్టిగా ఆ వాహనంలో కట్టేశారు. సృజనాత్మకతకి మారుపేరయిన పి.వి బహుశా ఈ ప్రయోగాన్ని కూడా స్వాగతించి ఉంటారు. శవపేటికతో ఆ వాహనం హైదరాబాదు నగరంలో రోడ్డుమీద అటూఇటూ దుఃఖంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్న పౌరులు బారులుతీరి ఉండగా, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని జూబ్లీ హాలుకు చేరుకుంది.ఒక రోజంతా ఆ దేహాన్ని అక్కడే ఉంచారు. వేలాదిమంది అభిమానులు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. 
 
                  ఈ లోగా తను వాగ్దానం చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హుస్సేన్‌సాగర్‌ ఉత్తరతీరంలో నాలుగెకరాల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మరునాడు మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కూడా హాజరయ్యారు.  ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నట్వర్‌సింగ్‌, ‘‘ఢిల్లీలో జరిగింది. మన్మోహన్‌ సింగ్‌కి ఏమాత్రం నచ్చలేదు’’ అంటారు. అంత్యక్రియలకు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, పి.వి. వల్ల ‘హవాలా’ అవినీతి ఆరోపణల కేసులో ఇరుక్కున్న మాజీ ఉప ప్రధానమంత్రి బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌.కె.ఆడ్వాణీ కూడా హాజరయ్యారు. పి.వి. స్వస్థలం వంగర, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. 
 
                  అక్కడకు రాని ప్రముఖుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఒకరు! పి.వి. పెద్దకొడుకు రంగారావు తండ్రి చితికి నిప్పంటిస్తూనే భోరున ఏడుస్తూ కూలబడిపోయాడు. తమ్ముళ్లంతా అతన్ని సముదాయించే పనిలో పడ్డారు. ఒకటిరెండు గంటల తర్వాత ప్రముఖులంతా ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. చితిపై పి.వి. పార్థివ దేహం కాలుతూనే ఉంది. 
 
                  అకస్మాత్తుగా రాత్రి బయటకు వచ్చిన వార్త - ‘‘సగం కాలిన శరీరంతో చితిమంటలు ఆరిపోయి ఉన్నాయి. అక్కడ పట్టించుకునే నాథుడెవరూ లేరు. వీధి కుక్కలు చితిలోంచి కాలీకాలని కట్టెల్ని బయటకు లాగుతున్నాయి.’’ కొన్ని టెలివిజన్‌ ఛానళ్లు ఈ దృశ్యాల్ని చిత్రీకరించాయి.  పి.వి.కి సన్నిహితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పివిఆర్‌కె ప్రసాద్‌ ఈ వార్తపై విభేదించారు. ‘‘ఆయన దేహం సగంకాలిన స్థితిలో వదిలివేయబడింది అన్నది నిజంకాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది. ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది... ఏమైనా ఆయన మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాదుకు పంపించారనీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే.’’ప్రసాద్‌ మాటల్లో చెప్పాలంటే, ‘‘పి.వి. శరీరం సగమే కాలిందన్న భావన ఆయనకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే.’’ 
(సోనియాగాంధీకి, పీవీకి మధ్య వైషమ్యం ఎందుకు ఏర్పడింది?... రేపటి సంచికలో)