Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 04 Jun 2016 22:17:01 IST

ఫ్రెండ్లీ మదర్‌ అంటేనే ఇష్టం

ఫ్రెండ్లీ మదర్‌ అంటేనే ఇష్టం

ఫ్రెండ్లీ మదర్‌ ‘సుధ’. తెలుగుదనపు మాతృత్వం కిటికు తెలిసిన నటి. కాలం తగ్గట్టు క్యారెక్టర్లను మార్చుకునే సృజనశీలి. వదిన, అమ్మ, చెల్లి, అక్క ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయే సుధ.. నేటికి తెలుగులో ఐదొందల చిత్రాల మైలు రాయిని దాటారు. దక్షిణాది భాషలతో కలిపితే ఏడొందల చిత్రాలను పూర్తి చేసుకున్న ఆమె ఈ వారం ‘సండే సెలబ్రిటీ’..

‘‘న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో ఉన్నానప్పుడు. ఒక ముసలామె నా వద్దకు వచ్చి.. చెయ్యి పట్టుకుని ‘నిన్ను చూస్తే జాలి వేస్తుందమ్మా. ఆ పోలీసోడు (ఆశి్‌షవిద్యార్థి) మీద యాసిడ్‌పోసి చంపేయాలనిపించింది. నీకు నరకం చూపించాడు వాడు’’ అంది. ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆలోచిస్తే టక్కున ‘పోకిరి’ చిత్రం గుర్తుకు వచ్చింది. అందులో ఇలియానాకు నేను తల్లిని. ఆ పాత్ర ముసలామెకు అంతగా నచ్చడం.. నా దగ్గరికి వచ్చి గట్టిగా చెయ్యి పట్టుకుని ఉద్వేగంతో చెప్పడం..
ఆశ్చర్యం వేసింది’’

ఈతరం నటులను చూస్తే మీకేమనిపిస్తుంది?
ఇప్పుడొస్తున్న హీరోయిన్లు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటున్నారు. ఆటిట్యూడ్‌ పరంగా చూస్తే - వాళ్లలో వేగం ఎక్కువగా కనిపిస్తుంది. అందులో కొంత మంచీ ఉంది, కొంత చెడూ ఉంది. ఇంటర్‌నెట్‌లో అన్నీ ఫింగర్‌టిప్‌ మీద దొరుకుతున్నాయి కాబట్టి.. కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతున్నారు. అప్పట్లో మాకైతే ఆప్షన్‌ ఉండేది కాదు. కాకపోతే ఇప్పటి తరానికి దేనిమీద ఫోకస్‌ ఉండటం లేదు. కారణం విపరీతమైన పోటీ. ఒకప్పుడు నలుగురైదుగురు మాత్రమే క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉండేవాళ్లు. ఇప్పుడు చాలామంది వచ్చేశారు. అందరి మధ్యా పోటీ వచ్చింది. ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయో.. ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియదు. ఇలాంటి ఒత్తిళ్ల మఽధ్య నటనలో పరిపూర్ణత సాధించడం నేటి తరానికి కత్తిమీద సాము. మా తరం వాళ్లం.. అలనాటి నటుల మధ్య నటించడం వల్ల ఎంతో నేర్చుకునే అవకాశం వచ్చింది. అందుకని మా ఈడు నటులు చేస్తున్న పెర్ఫార్మెన్స్‌ నేటి నటులు చేయలేకపోతున్నారు. ‘ఆమె’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘చాలా బావుంది’, ‘అతడు’, ‘దూకుడు’, ‘బాద్‌షా’లలో నాకు మంచి క్యారెక్టర్లు దొరికాయి. ఇలా ఎంతమందికి ఇటువంటి పాత్రలు దొరుకుతాయి చెప్పండి.

 
నేటి నటులకు, మీకు నటనలో గ్యాప్‌ రావడం లేదా?
అది చూసుకోవడానికి దర్శకులు ఉన్నారు కదా! ఆ కోణంలో నేనెప్పుడూ ఆలోచించలేదు. ఒక సుధగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ.. పాత్రల నటనలో హెచ్చుతగ్గుల గురించి ఆలోచించాల్సింది దర్శకులే! వారికి ఏ నటుల నుంచి ఎంత నటన కావాలన్న విషయం స్పష్టంగా తెలుసు.
 
కొన్నేళ్ల నుంచి మీరు చేస్తున్న తల్లి పాత్రల స్వభావంలో ఎలాంటి మార్పు వచ్చింది?
ఒకప్పటికీ ఇప్పటికీ తల్లి పాత్రలలో ఎంతో మార్పు వచ్చింది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోను తల్లి పాత్ర మారింది కదా! తల్లి లేకుండా ఎవరి జీవితమూ మొదలవ్వదు. గోరుముద్దలు తినిపించే దగ్గర నుంచి నడక, నడత నేర్పే వరకు పిల్లల మీద తల్లి ప్రభావం ఉంటుంది. కానీ నేటి కాలంలో తల్లి ఇంటిపనులను చక్కదిద్దుకుని, బ్యాగు భుజాన వేసుకుని, ఆఫీసుకు పరిగెత్తి.. ఇంటికొచ్చి అలసిపోయి.. పిల్లల ఆలనాపాలన చూసుకోవాల్సిన సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. తల్లీపిల్లల మధ్య బంధం తగ్గిపోయింది. తల్లిగా ఆమెకు మాతృత్వపు అనుభూతులు లేవు. పిల్లలుగా వీళ్లకు తల్లితో మధురానుభవాలు దక్కడం లేదు. పాత సినిమాల్లో అనుబంధాలకు ఆప్యాయతలకు మారుపేరు తల్లి. ఇంట్లో పెద్దరికం, పెద్దదిక్కు తల్లి. కానీ, నేటి తల్లి పాత్రలు అంత బరువుగా ఉంటే జనాలకు నచ్చడం లేదు. మోర్‌ఫ్రెండ్లీ మదర్స్‌నే తెర మీద ఇష్టపడుతున్నారు. ప్రతి రోజు తల్లి ఏడుస్తూ కూర్చుంటే ఏ కొడుకుకు, ఏ కూతురుకు నచ్చదు. దీనివల్లే ఇప్పుడొస్తున్న చిత్రాల్లో తల్లికి ఒక్క ఏడుపుసీను పెట్టాలన్నా ఎంతో ఆలోచించాల్సి వస్తున్నది. కుటుంబ సభ్యులందరితో పాటు తల్లి కూడా ఆడుతూ పాడుతూ కనిపించాలి. ఒక తల్లి నుంచి ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు.
 
అందుకేనా.. మీరు తెగ డ్యాన్సులు చేసేస్తుంటారు?
(నవ్వులు) ఆ కాలంలో ఇంట్లో మదర్‌కు డ్యాన్సులు చేసే అవకాశం లేదు. ఇప్పుడొచ్చింది. అవకాశం వచ్చినప్పుడు డ్యాన్సులు చేయాలి కదా! నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ చేయడం భలే ఇష్టం. భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. యాక్సిడెంట్‌ కావడం వల్ల అరంగేట్రం చేయలేకపోయాను. సినిమాల్లోనే కాదు, ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు కూడా పిల్లలతో కలిసి హమ్‌ చేస్తుంటాను. ఈ మధ్య చాలా సినిమాల్లో నాకు డ్యాన్స్‌లు పెడుతున్నారు దర్శకులు. ప్రేక్షకులు కూడా తమ మమ్మీలు డ్యాన్స్‌లు చేసినట్లు ఫీలవుతూ.. వాళ్ల మమ్మీలను నాలో చూసుకుంటున్నారు.
 
 తల్లి అంటే ఒకప్పుడు నిర్మలమ్మ, ఆ తరువాత అన్నపూర్ణ.. ఇప్పుడు మీరు అనుకోవచ్చా..?
ఇంట్లో తల్లికి రిటైర్‌మెంటు అనేది ఎలాగైతే ఉండదో.. సినిమాల్లోను మదర్‌రోల్‌కు రిటైర్‌మెంట్‌ అనేదే లేదు. నిర్మలమ్మ గారు తొలినాళ్లలో తల్లిగా చేస్తూ చేస్తూ.. వయసు మీద పడటంతో అమ్మమ్మ, నానమ్మ పాత్రల్ని కూడా పోషించారు. నేను కూడా అంతే! ఇప్పుడు తల్లి, రేపు అమ్మమ్మ, నానమ్మ. (నవ్వులు). సీనియర్‌ నటీమణులు బామ్మలు అయ్యాక నేను తల్లిని అయ్యాను. నేను బామ్మ అయ్యాక నా స్థానంలో మరో కొత్త తల్లి వస్తుంది. సినిమాల్లో ఎవరి స్థానమూ శాశ్వతం కాదు. మార్పును అందరం ఆహ్వానించాల్సిందే!
 
 మీ ఇంట్లో మదర్‌గా ఎలా ఉంటారు?
నేను సినిమాల్లోలాగే ఇంట్లో కూడా ఫ్రెండ్లీ మదర్‌నే. సౌమ్యురాలును. కోపం తక్కువ. నా సొంత అభిప్రాయాలను పిల్లల మీద బలవంతంగా రుద్దను. మా అమ్మ కూడా నాతో ఇలాగే ఉండేది. ఆవిడ తమిళనాడులో ఉన్నప్పుడు నాటకాలు వేసేది. తన అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా చెప్పేది. నాకు మా అమ్మ స్ఫూర్తి. నటనలో నేను పొరపాట్లు చేస్తే సున్నితంగానే తెలియజెప్పేది. మా అమ్మ నాతో ఎలాగుండేదో నేను కూడా మా అమ్మాయితో అలాగే ఉంటున్నాను.
 
సినిమాల సంగతికొస్తే.. తల్లి పాత్రధారణలో ఏ కొడుకు, ఏ కూతురు (నటులు) అంటే ఇష్టం?
నటులందరూ ఇష్టమే. ఫలానా వాళ్లనేమీ లేదు. నా అదృష్టం ఏంటంటే.. ఒక హీరోకు తల్లిగా వేషం వేశాక.. అతనితోనే అనేక చిత్రాల్లో చేసే అవకాశం వస్తున్నది. దాంతో హీరోలు, హీరోయిన్లతో బంధం బలపడింది. తల్లి పాత్రను మరింత సహజంగా పండించేందుకు వీలవుతోంది. మహే్‌షబాబు, జూనియర్‌, బన్నీ.. తమిళంలో సూర్య, అజిత, విశాల్‌ వంటి హీరోలందరికీ తల్లి పాత్రలు చేశాను. ఒక్కో కొడుకు ఒక్కో రకం. ఎవరికి తల్లిగా వేస్తే ఆ పాత్ర తాలూకు స్వభావాన్ని బట్టి నటిస్తుంటాను. వారికీ నాకు మధ్య అవగాహన ఉంది కాబట్టి ఇబ్బంది రాదు. అయితే, ఇప్పుడొస్తున్న కొత్త హీరోల మనస్తత్వం అర్థం కావడం లేదు. వారు ఏ టైమ్‌లో ఎలా ఉంటారో తెలీదు. నేటి ఇళ్లల్లోని పిల్లల్లాగే! (నవ్వులు). ఆయా భాషలను బట్టి తల్లి ఉద్వేగాలు మారుతుంటాయి.
 
అన్ని భాషల్లో తల్లి నటన ఒకే తరహాలో ఉంటుందా?
తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో భావోద్వేగాలు ఎక్కువ. మలయాళ చిత్రాల్లో అయితే తల్లి పాత్ర చాలా సహజసిద్ధంగా ఉంటుంది. వాస్తవానికి విరుద్ధంగా ఉండదు. ముందు నుంచి అక్కడి ప్రేక్షకులకు అలాగే అలవాటు చేశారు కాబట్టి.. అక్కడ అలా నడుస్తోంది.
 
సీనియర్‌ నటిగా పాత్రల చిత్రీకరణలో మార్పు కోసం ప్రయత్నిస్తుంటారా?
నేను కేవలం నటిని. ఆ బాధ్యతంతా దర్శకులది. కానీ.. ఒక విషయంలో నాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఈ మధ్య వస్తున్న చిత్రాల్లో ఎక్కువ మంది నటులను పెడుతున్నారు. అంతమంది అవసరమా? సినిమా చూశాక ఒక్క క్యారెక్టర్‌ కూడా ప్రేక్షకులకు గుర్తుండటం లేదు. ఇంటికి వెళ్లేలోపు మరిచిపోతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో తక్కువ పాత్రలే ఉండేవి. కథ బలంగా ఉండేది. ప్రతి పాత్రకు ఒక స్వభావం ఉండేది. ఆయా పాత్రలు ప్రేక్షకుల మనసులో నాటుకుపోయేవి. ఇప్పుడు ఇంతమంది యాక్టర్స్‌ను షూటింగ్‌కు ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక నటిగా నాకు బాధ కలుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్లను షూటింగ్‌స్పాట్‌లోనే నిల్చోబెట్టి.. ఒక చిన్న డైలాగ్‌ కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవే లేవు. వాటన్నిటినీ సినిమాల్లో పదే పదే చూపిస్తే నేటి తరానికి ఏమర్థమవుతుంది? ఆ ట్రెండ్‌ మారితే బావుంటుంది.
 
హీరోయిన్‌గా మొదలైన మీ ప్రస్థానం.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎందుకు స్థిరపడింది?
నేను నటించిన ఒక నాటకానికి విసు, ఎస్వీ ముత్తురామన్‌, బాలచందర్‌గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అక్కడ నన్ను చూశాక సినిమాల్లో అవకాశం ఇచ్చారు. తమిళంలో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. నా తొలి చిత్రం ఏవీఎం సంస్థ నిర్మించింది. దాన్ని ముత్తురామన్‌ తీశారు. రెండో చిత్రం బాలచందర్‌గారిది. ఇది షూటింగ్‌ పూర్తవ్వడంతో తొలిచిత్రంకంటే ముందే విడుదల అయ్యింది. సినిమా మాత్రం ఆకట్టుకోలేదు. నా కెరీర్‌కు ఏడాదిపాటు గ్యాప్‌ వచ్చింది. ఆ సినిమా పోవడం నా అదృష్టం. లేకపోతే ఇంకో నాలుగైదు సినిమాలతో హీరోయిన్‌గా నా చరిత్ర ముగిసిపోయేది. మహానుభావుడు బాలచందర్‌గారు ఎక్కడున్నారో ఏమో కానీ.. ‘‘అమ్మా.. నువ్వు హీరోయిన్‌గా పనికిరావు. గ్లామర్‌ పాత్రలకు నీ ఫేస్‌ నప్పదు. నేను తీయబోయే మరో సినిమాలో హీరోయిన్‌కు చెల్లి పాత్రను నీకిస్తాను. చేయాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకో’’ అని స్పష్టంగా చెప్పారు. నాకు వారం రోజులు టైమ్‌ ఇచ్చారాయన. నేను కేవలం గంటలో నిర్ణయం తీసుకుని ‘ఓకే’ చెప్పాను. ఆ రోజు బాలచందర్‌గారు ఆ మాట చెప్పకపోయుంటే.. ఈ రోజు క్యారెక్టర్‌ ఆర్టిస్టును అయ్యుండేదాన్ని కాను. అన్ని భాషల్లో కలిపి ఏడొందల చిత్రాలు పూర్తి చేసుండేదాన్నీ కాను.
 
ఒక ఆర్టిస్టుగా మీకు ఏ నటీమణులంటే ఇష్టం?
పాతతరం నటి కన్నాంబ అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రి నటన మరీ ఇష్టం. సినిమాల్లో ఎక్కడా ఆవిడ కనిపించదు, ఆమె పోషించిన పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే సహజనటి సావిత్రి. కొడుకును తిట్టేటప్పుడు, భర్తతో చర్చించేటప్పుడు.. ఎప్పుడు ఎలాంటి హావభావాలను పలికించాలనేది ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. సావిత్రి
సినిమాలు చూసిన ప్రతిసారీ.. ఏదో ఒక కొత్త విషయం
నేర్చుకుంటుంటాను.
 
మీ నటనను బాగా రాబట్టుకున్న దర్శకులు?
మొదట బాలచందర్‌. ఆ తరువాత ఈవీవీ సత్యనారాయణ. ఆయన దర్శకత్వంలో ‘హలోబ్రదర్‌’లో చేశాను. పదమూడు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. ఒకరోజు ‘‘సార్‌, రోజూ రావడం, పోవడంతోనే సరిపోతోంది. నేను చేసే ఈ క్యారెక్టర్‌లో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదు’’ అని ఈవీవీతో చెప్పాను. ‘నువ్వేమీ కంగారు పడకు. కొన్నాళ్లు ఓపికపట్టు’ అన్నారు.
ఈవీవీ గారిదే మళ్లీ ‘ఆమె’ షూటింగ్‌ మొదలైంది. ఈ సినిమాలోను అదే పరిస్థితి. ‘‘సార్‌, ఈ సినిమాలోనూ నా పాత్రకు ప్రాముఖ్యత కనిపించడం లేదు, ఏమిటిసార్‌ ఇది’’ అని చెప్పాను. వెంటనే ఆయన ‘‘రేపటి నుంచి నీకు ఉంటుంది చూడు’’ అన్నారు నవ్వుతూ. కాసేపు ఆగి ‘‘ఈ పిక్చర్‌ టైటిల్‌ నీది. ఇందులో నువ్వా, కోటా శ్రీనివాసరావా? హండ్రెడ్‌ మార్క్స్‌ ఎవరు తెచ్చుకుంటారో మీరే తేల్చుకోండి. నటనలో మీ ఇద్దరికే పోటీ’’ అన్నారు. ఈవీవీ అన్నట్లు ‘ఆమె’ సినిమాలో క్లయిమాక్స్‌ నన్ను ఎంతో ఎత్తులో నిలబెట్టింది. ముఖ్యంగా మహిళల్లో నా క్రేజ్‌ పెరిగేలా చేసింది. నా కెరీర్‌కు అదొక పునాదిలా మారి నిలదొక్కుకునేలా చేసింది.
 
మీకొచ్చిన ప్రశంసల్లో మరపురానిది?
మలయాళంలో ‘బాలెట్‌’లో నటించాను. తెలుగులో ‘రాజాబాబు’ పేరుతో వచ్చింది. అందులో నేను చేసిన తల్లిపాత్రను తెలుగులో శారదగారు చేశారు. తల్లీ కొడుకుల మధ్య నడిచే కథ అది. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒకరోజు శారదగారు ఫోన్‌ చేసి ‘‘బాలెట్‌లో నువ్వు చాలా బాగా చేశావు. నీ అంత ఉద్వేగంతో నేను చేయలేకపోతున్నాను..’’ అన్నారు. అంత పెద్ద నటి నాకు ఫోన్‌చేసి.. ప్రశంసించడం మరపురాని విషయం. ‘బాలెట్‌’ షూటింగ్‌ జూన్‌ 3న మొదలైంది. జూన్‌ 1న మా అమ్మ చనిపోయింది. రెండ్రోజుల గ్యాప్‌తోనే షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మా అమ్మతో నాకున్న బంధం మాటలకు అందనిది. అంత బాధలో చేశాను కాబట్టే.. శారదగారికి నచ్చి ఉంటుందనిపించింది.
 
కొత్తతరం నటులతో రిలేషన్స్‌ ఎలా ఉంటున్నాయి?
మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. వాళ్లతో మాట్లాడేందుకు ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా సలహాలు అడిగితే చెప్పడం వరకే మన పని. ఇదివరకు నటీనటుల మధ్య ఉన్నంత రిలేషన్‌షిప్స్‌ ఇప్పుడు లేవు. గతంలో ఒకరి కష్ట
సుఖాలు మరొకరితో పంచుకునేవాళ్లం. కుటుంబ సంబంధాలు ఏర్పడేవి. స్నేహపూరిత వాతావరణంలో షూటింగ్‌లు నడిచిపోయేవి. చెట్ల కింద కుర్చీలు వేసుకుని ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. ఇప్పుడు ఎవరి కార్‌వాన్‌ వారిది. ఎంత నటులైనా షూటింగ్‌షాట్‌ పూర్తవ్వగానే.. కార్‌వాన్‌లలోకి చేరిపోతున్నారు. మాట్లాడాలన్నా ఒక్కరూ కనిపించరు. సినిమాల్లో మాత్రమే రిలేషన్స్‌ కనిపిస్తాయి. షూటింగ్‌ స్పాట్‌లో అవేవీ లేవు (నవ్వులు). అన్ని భాషల్లోను ఇదే పరిస్థితి. ఆ రోజులు లేవన్న బాధ అయితే నాకుంది.
 
సినిమాల్లో గరిట పట్టుకుని వంటగదుల్లో బిజీగా కనిపిస్తుంటారు? ఇంట్లో కూడా వంట బాగా చేస్తారా?
సినిమా అమ్మకు అయినా, ఇంట్లో అమ్మకు అయినా వంట తప్పదు కదా (నవ్వులు). మా ఇంట్లో వంటమనుషులు లేరు. స్వయంగా నేనే వండుకుంటాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుకీ నేను ఇలాగే (బరువు పెరగకుండా) ఉన్నానంటే ఇంటి వంటే కారణం. షూటింగ్‌లకు అప్పుడప్పుడు కొన్ని వంటలు పట్టుకొస్తుంటాను. మొన్ననే హీరో గోపీచంద్‌ సినిమా షూటింగ్‌లో ఓ కెమెరా అసిస్టెంట్‌ ‘మేడమ్‌ మీరు పులిహోర ఎప్పుడు పట్టుకొస్తారు?’ అనడిగాడు. వంటలు చేయడం ఇష్టం. అందుకే సినిమాల్లోను నాకు ఎక్కువ కిచెన్‌సీన్లు పెడుతుంటారు.
- మల్లెంపూటి ఆదినారాయణ 

సూర్య నటించిన ‘24’ చిత్రంలో ఒక సన్నివేశం. పాతికేళ్ల తరువాత ఆడపడుచు ఇంటికి వచ్చింది. ఆ రోజు నాది మౌనవ్రతం. ఆమె వచ్చిన ఆశ్చర్యకర విషయాన్ని ఇంటిల్లిపాదికీ చెప్పాలి. నటనకు అదొక సవాలు. అప్పుడు నా ముఖంలో పలికించిన భావోద్వేగం ఎంతమందికి నచ్చిందో చెప్పలేను.
 
జూనియర్‌ ఎన్టీయార్‌ నన్ను ‘అమ్మ’ అనే పిలుస్తుంటారు. షూటింగ్‌లో లేనప్పుడు కూడా అలాగే పిలవడం ఆయనకు అలవాటు. చోటా కె నాయుడు కూడా నన్ను సరదాగా ‘మమ్మీ’ అంటుంటారు.

నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం. ఈ విషయం చాలామందికి తెలియదు. నన్ను అందరూ తెలుగువాళ్లు అనుకుంటుంటారు.
 
ఇప్పటి వరకు ఇంచుమించు తెలుగులో 500 చిత్రాలు పూర్తి చేసుకున్నాను. తెలుగులో నా తొలి చిత్రం ‘తల్లిదండ్రులు’. ఆ సినిమాకు తాతినేని రామారావు దర్శకులు.
 
అదృష్టం కొద్దీ నేను సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో.. వదిన పాత్రధారులు లేరు. అందుకని అన్ని సినిమాలకు నేను వదినను అయ్యాను. ఆ తరువాత తెలుగులో వచ్చిన యంగ్‌ హీరోలందరికీ తల్లిని అయ్యాను.
 
వదిన, చెల్లి, అక్క.. ఎన్ని పాత్రలు వేసినా ‘అమ్మ’ పాత్రే నాకు సంతృప్తి. ఎందుకంటే ఏ సినిమాలో అయినా అమ్మకు ఒక కమాండ్‌ ఉంటుంది. హీరోలు, హీరోయిన్‌లు అమ్మ మాట వినాల్సిందేగా! (నవ్వులు).
 
నేను మదర్‌ క్యారెక్టర్‌ చేసేటప్పుడు.. నా సహనటులు కొందరు ‘‘అయ్యో, మీరే మదర్‌ క్యారెక్టర్‌ చేస్తే.. మమ్మల్ని కూడా మదర్‌ క్యారెక్టర్లు చేయమంటారండీ’’ అన్నారు. నాకు బాధ వేసింది. అమ్మ పాత్ర చేయడానికి నామోషీ ఎందుకు. అమ్మ కంటే గొప్ప వేషం ఇంకేముంటుంది? నాకు ఈ రోజు అంత పేరు వచ్చిందంటే కారణం ‘అమ్మ’.
 
చీరలు ఎక్కువగా నేనే సెలక్ట్‌ చేసుకుంటాను. లేత వర్ణపు చీరలంటే మోజు. సినిమాల్లో వాడే చీరల్లో కొన్ని నేను కూడా ఎంపిక చేసుకుంటుంటాను. కాస్ట్యూమ్‌ డిజైనర్లు నా పాత్రలను బట్టి చీరలు ఎంపిక చేస్తారు.
 
నాకు ఒకే ఒక డ్రీమ్‌ ఉంది. కథను శాసించే అమ్మ పాత్ర చేయాలన్నది ఆ కల. ఆ పాత్ర చాలా రఫ్‌గా ఉండాలి. సామాన్యులను సైతం కదిలించాలి. అమ్మకు కొత్త భాష్యం చెప్పాలి. అవకాశం వచ్చినప్పుడు తప్పక చేస్తాను.
 
మా అమ్మాయి ఎంబీఏ పూర్తి చేసింది. తనకు సినిమాల పట్ల ఆసక్తి లేదు. ఆమె జీవితం ఆమె ఇష్టం. నేను ఏ విషయాన్నీ పిల్లల మీద రుద్దను.
 
నేను తమిళియన్‌ అయినప్పటికీ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే కారణం- అల్లు రామలింగయ్య గారు. ఆయన మద్రాసులో ఉన్నప్పుడు ‘ఎదుటి వాళ్లు మాట్లాడే మాటలను శ్రద్ధగా విను. అసలే అర్థం కానీ పదాలను రాసుకుని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించు. తెలుగు భాష తప్పక వస్తుంది’’ అని సలహా ఇచ్చారాయన.
 
నా హెల్దీ సీక్రెట్‌ ఏమీ లేదు. పాత కాలంలో మా అమ్మ అనుసరించే అలవాట్లనే నేను ఫాలో అవుతుంటాను. వేడి నీళ్లు తాగడం నాకు అలవాటు. అదే నా అరోగ్యాన్ని కాపాడుతున్నది. మితంగా తినడం, వేళకు నిద్రపోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం.. ఇంతే నేను చేసేది.

నారాయణున్ని నమ్మండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రతిదానికీ మీరేమీ వర్రీ కానక్కర్లేదు. మీ టెన్షన్లన్నీ తీసి పక్కన పడేయండి. ఎవరు ఎప్పుడు పుట్టాలో, ఏమి కావాలో, ఎంత వరకు జీవించాలో అన్నీ ఆ భగవంతుడు నిర్ణయించినప్పుడు.. మధ్యలో మనమేంటి? ఇక దేని గురించి తాపాత్రయపడాలి. మన చేతుల్లో ఏమీ లేదు.. సర్వమూ భగవత సంకల్పం అనుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్‌ అనేదే ఉండదు. ఉన్నదాంతో తృప్తి పడుతూ.. మనకు ఎంత శక్తి ఉందో.. ఆ శక్తి మేరకు నడుచుకుంటే ఏ సమస్యా ఉండదు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.