Sep 23 2014 @ 03:21AM

రేడియో చిరంజీవి అస్తమయం- నాటక ప్రయోక్త శాశ్వత విశ్రాంతి
నల్లకుంట/హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త, నటుడు, ప్రయోక్త కె.చిరంజీవి (80) సోమవారం ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో శ్రీప్రభ సిరిసంపద అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న చిరంజీవికి ముగ్గురు సంతానం. కుమార్తెలు కవిత, నవత, కుమారుడు చైతన్య ఉన్నారు. అంబర్‌పేట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ప్రముఖ సాహితీవేత్తలు, నాటక ప్రయోక్తలు చాట్ల శ్రీరాములు, దుగ్గిరాల సోమేశ్వరరావు, మధుకర్‌, శారదా శ్రీనివాసన్‌, సత్యనారాయణ, ఎస్‌.వి.సత్యనారాయణ, ప్రతాప్‌ తదితరులు చిరంజీవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లా వైదన గ్రామంలో కుంటముక్కల రామదాసు, రామమ్మ దంపతులకు 1935 మార్చి 18న చిరంజీవి జన్మించారు. అప్పట్లో నరసరావుపేట తాలుకాలో ఉంటూ అక్కడ విద్యా సౌకర్యాలు లేకపోవడంతో చదువుకునేందుకు తెనాలికి వెళ్ళారు. 1961 ఏప్రిల్‌ 1 నుంచి ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో 32 సంవత్సరాల పాటు పనిచేసి 1993 మార్చి 17న పదవీ విరమణ పొందారు. సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రయోజనాత్మక రచనలు వెలువరించిన గొప్ప మానవతావాది ఆయన. రాశి కంటే వాసికి ప్రాధాన్యమిచ్చే వీరి రచనలలో ఎన్నదగింది ‘బోలో స్వతంత్ర భారత్‌కి జై’ అనే నవల. భారతీయ సాహిత్యంలో ఇది ఒక అపురూపమైన రచన. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం 1985లో ఉత్తమ నవల బహుమతి ఇచ్చింది. రేడియో నాటకం అనగానే చిరంజీవి పేరు గుర్తుకు వస్తుంది. రేడియో నాటకం ఎలా రాయాలో, ఎలా నిర్వహించాలో చూపించి తెలుగు రేడియో నాటకానికి ఒక స్థిరరూపమిచ్చి దీనికి సాహిత్య గౌరవం సంతరించిపెట్టింది చిరంజీవే అంటే అతిశయోక్తికాదు.
ఆయన రచించిన రేడియో నాటికలు గ్రంథానికి 1986లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నాటక సంకలనం బహుమతి ఇచ్చింది. ఆయన రాసిన నాలుగు నాటకాలు జాతీయ నాటకాలుగా భారతీయ భాషలన్నింటిలో అనువాదమై ప్రసారమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఆసియా పసిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బ్రాడ్‌కాస్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ చిరంజీవి రాసిన ‘ఆకలిమందు’ నాటికను ఒక నమూనా రేడియో నాటకంగా వాడుకున్నారు.
తెనాలిలోని క్రాంతి థియేటర్స్‌తో ఏర్పడిన పరిచయం చిరంజీవి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. చిరంజీవి జీవితమంతా నాటకాలు, సాహిత్యంతోనే గడిచిపోయింది. 1957లో హైదరాబాద్‌ నుంచి వెలువడే సోషలిస్టు పార్టీ పత్రిక నవశక్తిలో, రేడియోలో రిటైర్‌ అయిన తర్వాత 1996-2008 మధ్యకాలంలో శారదతో కలిసి స్టూడియోగ్రాఫ్‌ పేరుతో ఒక యాడ్‌ ఏజెన్సీ నడిపారు. ఈయన రాసిన రచనలపై విద్యార్థులు పలు యూనివర్సిటిలలో పోస్టుగ్రాడ్యుయేట్‌ పరిశోధనలు చేశారు. వాటిలో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో నీలిదీపాలు నాటకంపై ఎం.ఫిల్‌, రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో రేడియో నాటకాలు అనే అంశంపై ఎం.ఫిల్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటిలో సమగ్రసాహిత్యం పై పిహెచ్‌డీ, హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో నవలలు అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు.
చిరంజీవి రాసిన నాటకాలు: నీలిదీపాలు, సోనార్‌ బంగ్లా, ఇక్కడ పెళ్లి చేయబడును, ప్రేమపక్షులు, దేవుడెరుగని నిజం, శ్రీకృష్ణ శిరోభారం, వంశాంకురం, కొక్కొరోకో, బీళ్లు తిరగబడుతున్నాయి, శాంతి సమరం, కాల యంత్రం, ఆకలి మందు, పోలిట్రిక్స్‌, ఉరోల్లు మేల్కొంటున్నారు, మహా నిష్క్రమణం.
నవలలు: ముళ్ల గులాబి, అనంతయాత్ర, ఎక్కడికీ ప్రస్థానం, బోలో స్వతంత్ర భారత్‌కీ జై, చీమ మనుషులు, రెండు కన్నీటి చుక్కలు.