May 19 2016 @ 00:53AM

జానపద సంగీత విదుషీమణి

తెలుగు జానపద గేయ సాహిత్యాన్ని, సంగీతాన్ని సేకరించి, పరిష్కరించి, ప్రచురించి, రికార్డు చేసి, ప్రచారం చేసినవారు వింజమూరి సిస్టర్స్‌. వీరు ఉమ్మడి గానూ, విడివిడిగానూ ఈ రంగంలో చేసిన కృషి అనుపమానం. ఇప్పుడు ఈ సోదరీమణులలో చెల్లెలైన వింజమూరి సీతాదేవి అస్తమయంతో ఒక గొప్ప అధ్యాయం ముగిసిపోయింది.

తె‌లుగు జానపద సంగీతం అనగానే అరవై, డెబ్భైయేళ్ళ పైబడిన కళాప్రియులెవరికైనా వెంటనే జ్ఞాపకం వచ్చేవారు సీతా అనసూయలే. సీత, సీతాదేవి అంటే ‘ఎవరావిడ’ అంటారు. అనసూయ అంటే కూడా ‘ఎవరావిడ’ అనే అంటారు. కానీ, ‘సీతా అనసూయ’ అని ఇద్దరి పేర్లు కలిపి చెబితే మాత్రం ‘అయ్యో.. వాళ్ళు తెలియకపోవడమేం? గొప్ప గాయనీమణులు.. వింజమూరి సిస్టర్స్‌ కదా’ అంటారు. ఆంధ్రదేశంలో జంటగా వేదిక ఎక్కి కచేరీలు చేసిన అక్కచెల్లెళ్లలో బహుశా వాళ్ళే మొదటివాళ్ళు. ఎప్పుడో ఎనభయ్యేళ్ళ కిందట 1930వ దశకంలో ఇంకా పరికిణీ జాకెట్లు వేసుకునే వయసులోనే వాళ్ళిద్దరూ వేదికలపై సహగానం మొదలు పెట్టారు. కవలలు కాదు గాని కవలల్లాగానే కనిపించేవారు. ఇద్దరూ ఒకే రంగు, ఒకే డిజైన్‌ దుస్తులు ధరించేవారు. అనసూయ అక్క, సీతాదేవి చెల్లెలు. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోడానికి అవసరమైన అనుకూల పరిస్థితులన్నీ కలిసి వచ్చిన అదృష్టవంతులు వారిద్దరూ. ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణ శాసి్త్రగారి మేనకోడళ్ళే ఈ సీతా అనసూయలు. వీరి తండ్రి పండితుడు, నాటకకర్త వింజమూరి నరసింహారావు. వీరు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పిఠాపురం ప్రాంతంవారు. కృష్ణ శాసి్త్ర గారు ఎక్కడికి వెళ్ళినా మేనకోడళ్ళిద్దర్నీ వెంటతీసుకొని వెళ్ళి సాహిత్య సభా వేదికలపై పాడిస్తూ ఉండేవారు. అక్కచెల్లెళ్ళిద్దరూ మొదట కర్ణాటక శాసీ్ట్రయ సంగీతం నేర్చుకున్నారు. తర్వాత లలిత సంగీత శైలిలో కృష్ణ శాసి్త్ర గారివి, ఇతర కవులవీ భావ గీతాలు పాడుతూ ఉండేవారు. తర్వాత జానపద సంగీత పితామహుడుగా పేరొందిన వల్లూరి జగన్నాథరావు గారి వద్ద జానపద సంగీతం నేర్చుకున్నారు. ఇన్ని రకాల సంగీతాలు గానం చేసినా ఈ అక్కచెలె ్లళ్ళు ప్రధానంగా జానపద సంగీత గాయనులు గానే ప్రసిద్ధికెక్కారు. ఆంధ్ర దేశంలో జానపద సంగీతానికి సభా గౌరవం సంపాదించి పెట్టిన మొదటి గాయనీమణులు వీరిద్దరే.
 
తెలుగు జానపద గేయ సాహిత్యాన్ని, సంగీతాన్ని సేకరించి, పరిష్కరించి, ప్రచురించి, రికార్డు చేసి, ప్రచారం చేసింది వీరిద్దరే. వీరు ఉమ్మడి గానూ, విడివిడిగానూ ఈ రంగంలో చేసిన కృషి అనుపమానం. ఇప్పుడు వింజమూరి సీతాదేవి అస్తమయంతో ఒక గొప్ప అధ్యాయం ముగిసిపోయింది. ఆకాశవాణి జానపద సంగీత విభాగంలో ప్రొడ్యూసర్‌గా పనిచేసిన ప్రముఖ సంగీత విద్వాంసురాలు, జానపద పరిశోధకురాలు వింజమూరి సీతాదేవి మంగళవారం అమెరికాలో కన్నుమూశారు.
 
సీతగారు కర్ణాటక శాసీ్త్రయ సంగీతంలో బి.ఏ. డిగ్రీ తీసుకున్న తర్వాత ‘ఆంధ్రదేశపు జానపద సంగీతం’పై పరిశోధన చేసి 1952లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం.లిట్‌ డిగ్రీ తీసుకున్నారు. ఆ పరిశోధన సారాన్నే ఆమె ఇంగ్లీషులో ’'Folk Music of AndhraPradesh’ అనే గ్రంథంగా రచించారు. సుమారు 1960 ప్రాంతంలో ఆవిడ ఆకాశవాణిలో జానపద సంగీత నిర్వాహకురాలిగా చేరారు. పాతిక సంవత్సరాలు ఆ ఉద్యోగం చేసి 1985లో రిటైరయ్యారు. ఆ ఉద్యోగ కాలంలో ఆవిడ మద్రాసు, విజయవాడ, హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రాలలో పనిచేసి గొప్ప కళా సేవ చేశారు. ఆంధ్ర దేశంలోని మారుమూల గ్రామాలకు వెళ్ళి జానపద గాయకులను కలుసుకొని, వారిచేత పాటలు పడించి, భాషాదోషాలను పరిహరించి, రికార్డు చేసి భద్రపరిచారు. ఆకాశవాణిలో ఉద్యోగం చేయడం ఆవిడ అదృష్టం, ఆకాశవాణి అదృష్టం, తెలుగు కళా ప్రియుల అదృష్టం.
 
ఉద్యోగ విరమణ అనంతరం సీతగారు తన జీవిత కాలంలో సేకరించిన వందల, వేల జానపద గేయాల నుంచి కొన్నింటిని ఎంపిక చేసి ఐదు సంపుటాలను ప్రచురించారు. వాటిలో మొదటిది ‘లాలి-తాళి’. అది 1986లో ప్రచురితమయింది. అందులో దాదాపు 170 పాటలున్నాయి. అన్నీ లాలి పాటలు, పెళ్ళి పాటలు. రెండో సంపుటం ‘గోపాలకృష్ణుడు’. ఇందులో 95 పాటలున్నాయి. ఇవన్నీ కృష్ణుడి మీద పాటలు. మూడోది ‘పండుగలు-పబ్బాలు’. ఇందులో సంక్రాంతి, శివరాత్రి, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, వరలక్ష్మీవ్రతం, కృష్ణాష్టమి, మొహర్రం, వినాయకచవితి, దసరా, దీపావళి, నాగులచవితి, క్రిస్మస్‌ పాటలు, ఇంకా కొన్ని చిన్న చిన్న పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపుల పాటలు - అన్నీ కలిపి సుమారు 160 దాకా ఉన్నాయి. నాలుగో సంపుటం ‘భక్తి-ముక్తి’. ఇందులో 91 పాటలున్నాయి. ఐదో సంపుటం ‘ప్రేమ-విరహం’లో అన్నీ అచ్చమైన జానపద యువతీయువకుల ప్రేమగీతాల్లాంటివి. ఇందులో 125 పాటలున్నాయి. గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వంలో బి.నరసింగరావు నిర్మించిన ‘మా భూమి’ చిత్రానికి సీతాదేవి గారు సంగీతం అందించారు.
 
సీతాదేవి ఎంతో శ్రద్ధతో, అందంగా, అచ్చుతప్పుల్లేకుండా ఈ సంపుటాలను ప్రచురించారు. వీటిలో చాలా పాటలను పాడి, పాడించి కేసెట్లుగా కూడా వెలువరించారు. ఇప్పుడు కేసెట్లు వాడుకలో లేవు కనుక వాటిని సీడీలుగా మార్చి విడుదల చేసి ఉంటారు. వాటిలో పాటలన్నీ దాదాపుగా ‘ఆకాశవాణి’ ద్వారా ప్రసారమైనవే. శ్రోతల అభినందనలందుకున్నవే.జానపద సంగీతమంటే మొరటుగా ఉంటుందనీ, అలాగే ఉండాలనీ, ఉంచాలనీ అనేవాళ్ళు కొందరుంటారు. కాని, జానపద సంగీత సౌరభం ఏమాత్రం చెడకుండా, సాహిత్యంలోని సహజత్వం పోకుండా సీత అనసూయలు ఆ పాటలను పాడి ప్రచారం చేశారు. వారి గాన మాధుర్యం పండితుల మన్ననలు కూడా పొందాయి.
 
సీతగారు రికార్డు చేసి భద్రపరిచిన గీతాలు ‘ఆకాశవాణి’ వారి వద్ద ఎన్ని ఉన్నాయో, వాటిలో ఇంకా సీడీలుగా వెలువడనివి ఎన్ని ఉన్నాయో పరిశీలించి వాటిని కూడా అందుబాటులోకి తీసుకురావడం అవసరం.
నంపాసా