Sep 21 2014 @ 04:13AM

పత్రికలకు బందరు పుట్టినిల్లు


మచిలీపట్నం-ఈడేపల్లి : స్వాతంత్య్ర ఉద్యమానికి బందరులో స్థాపించిన పత్రికలు తెలుగువారికి స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. స్థానిక మెహర్‌బాబా ఆడిటోరియంలో శనివారం భావ తరంగణి ఆధ్వర్యంలో వివిధ రంగాల ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, త్రివేణి వంటి పత్రికలు తెలుగు వారికి స్ఫూర్తిని కలిగించాయన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కళారంగానికి బందరు పుట్టిల్లన్నారు. డి.వి.సుబ్బారావు వంటి రంగస్థల నటులు రాష్ట్రస్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. శివశ్రీ వంటి నటులు తమ నటనా కౌశల్యంతో బందరు పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపచేశారన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌ మాట్లాడుతూ కళాకారులను కళాభిమానులు ప్రోత్సహించాలన్నారు. కమిషనర్‌ ఎ.మారుతీదివాకర్‌ మాట్లాడుతూ సాహిత్యానికి ఆది నుంచి బందరులో ఆదరణ ఉందన్నారు. సభాధ్యక్షుడు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ పత్రికలు సాహిత్యం, కళలపై కూడా కథనాలు ప్రచురించాలన్నారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సాహిత్యంలో కృషి చేస్తున్న ఎంవి.నరసింహారెడ్డి (జగిత్యాల), చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ (భద్రాచలం), బాల సాహితీ వేత్తలు ఆకెళ్ళ సుబ్బలక్ష్మి (హైదరాబాద్‌), వాడవల్లి విజయలక్ష్మి (మచిలీపట్నం) ఆధ్యాత్మిక సేవనందిస్తున్న విష్ణుభొట్ల సూర్యనారాయణ ఘనాపాఠి, భాషా సేవ లందిస్తున్న డా. కేతవరపు రాజ్యశ్రీ (హైదరాబాద్‌), అభ్యుదయ కవి రాచపాళెం రఘ (నెల్లూరు), నాటక రచయితలు రాంపిళ్ళ మోహనకృష్ణ (విజయవాడ), జె.జగన్మోహనరావు (మచిలీపట్నం), సామాజిక కార్యకర్త జెఎస్‌ఎస్‌ బ్రహ్మానందాచారి (వణుకూరు)లకు బుద్ధప్రసాద్‌ అవార్డులిచ్చి సత్కరించారు. అలాగే సాహితీవేత్తలు మాల్యశ్రీ, మహమ్మద్‌ సిలార్‌, దివాకర్ల వెంకటేశ్వర్లు, వి.నారాయణలను సత్కరించారు. శ్రీనివాసగాంధీ రచించిన పాటలను ప్రముఖ గాయకులు వడ్లమన్నాటి మహేష్‌, కాళీపట్నపు ఉమ, సింగరాజు కల్యాణి, కిరణ్మయి గానం చేశారు. అనంతరం ఎల్‌.సుస్మిత ప్రదర్శించిన కూచిపూడి నాట్యం అందరినీ ఆకట్టుకుంది. మణికుమార్‌ బహుదూర్‌ నాట్య ప్రదర్శన, చిన్నారుల విచిత్ర వేషధారణలు ప్రేక్షకుల వీనులకు విందు చేశాయి. ఈ కార్యక్రమంలో వేమూరి పూర్ణచంద్రరావు, లంకిశెట్టి బాలాజీ, చలమలశెట్టి నరసింహారావు, డాక్టర్‌ బి.ధన్వంతరీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.