desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 30 2016 @ 07:15AM

వడివడిగా వంద రోజుల ప్రణాళిక

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తోంది హెచ్‌ఎండీఏ. ప్రణాళికబద్దంగా ముందడుగు వేస్తూ నగర శివారులోని గాజుల రామారంలోని క్వారీ ప్రాంతాన్ని సుందరవనంగా తీర్చిదిద్దింది. హెచ్‌ఎండీఏ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎంచుకున్న అంశాల్లో గాజుల రామారంలోని చెత్త డంపింగ్‌ యార్డు సుందరీకరణ ఒకటి. ఒకప్పుడు భారీ క్వారీ గుంతగా ఉన్న ఆ ప్రాంతంలో హుస్సేన్‌సాగర్‌లోంచి తొలగించిన వ్యర్థాలతో క్వారీని నింపారు. ఆ తర్వాత దాన్ని అలాగే వదిలేయకుండా అక్కడ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నగరంలోపలే కాదు వెలుపల సైతం పచ్చదనాన్ని నింపేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ర్టీ విభాగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గాజుల రామారం క్వారీ, సంజీవయ్య పార్కులోని కొంతభాగంలో థీమ్‌ పార్కులను పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే గాజుల రామారంలో సుందరీకరణ పనులు పూర్తి కాగా, సంజీవయ్య పార్కు థీమ్‌ పార్కు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
పార్కులో పవిత్ర వృక్షాలు...

మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న గాజుల రామారం డంప్‌యార్డు సుందరీకరణలో ఎన్నో అంశాలకు హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ర్టీ విభాగం ప్రాధాన్యతనిచ్చింది. కేవలం పచ్చని గడ్డి, మొక్కలు మాత్రమే కాకుండా మనం ఎంతో పవిత్రంగా భావించే వృక్షాలను అక్కడ నాటి వాటిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ పవిత్ర వృక్షాలైన మారేడు, వేప, రాగి, మర్రి, కందంబం, పొగడ, పొన్న, అశోక, చింత, కైజీరియా, రోజ్‌వుడ్‌ రకాలకు చెందిన మొక్కలను నాటారు. రాళ్ల మధ్యే అద్భుతంగా కనిపిం చేలా పచ్చని నందనవనాన్ని అక్కడ తీర్చిదిద్దారు. స్థాని కులు ఊహించని విధంగా పలు ప్రత్యేక మౌలిక సదుపాయాలను కల్పించారు. సాయంత్రం వేళల్లో వాహ్యాళికి వెళ్లేవారికి అనుకూలంగా ఉండేలా వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భారీగా ఎదిగే వృక్షజాతి మొక్కలతో పాటు పర్యాటకుల మదిని దోచేలా వివిధ రకాల రంగు రంగుల పూల మొక్కలను నాటి సందర్శకులు సేద తీరేందుకు అక్కడ బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు.
పచ్చదనానికి ప్రాధాన్యం...
హెచ్‌ఎండీఏ పరిధిలో పచ్చదానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు పార్కులను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గాజుల రామారంలో క్వారీ గుంతగా ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం సుందరీకరణ చేసి పచ్చని చెట్లను నాటాం. మునుముందు ఆ ప్రాంతం మరింత పచ్చదనంతో నిండిపోయి ప్రాధాన్యత సంతరించుకునే అవకాశముంది. ఖాళీ స్థలాలు ఉన్న చోట హెచ్‌ఎండీఏ సూచనల మేరకు అద్బుతమైన థీమ్‌లతో పార్క్‌లను ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. ప్రస్తుతం సంజీవయ్య పార్క్‌లోనే థీమ్‌ పార్కు నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇది ఎన్నో ప్రత్యేకతలు కూడుకొని ఉన్నది. ముఖ్యంగా రాశి వనం, నక్షత్ర వనం, బ్యాంబూ గార్డెన్‌, బట్టర్‌ఫ్లై గార్డెన్‌ వంటి పేర్లతో థీమ్‌ పార్కు నిర్మాణం చేపడుతున్నాం. దీన్ని మే చివరి నాటికి పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తాం. గాజుల రామారం, సంజీవయ్య పార్క్‌లోని థీమ్‌ పార్కుకు సుమారు రూ.3 కోట్ల జైకా నిధులు ఖర్చు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాం.
- స్వర్గం శ్రీనివాస్‌, డైరెక్టర్‌,
అర్బన్‌ ఫారెస్ర్టీ విభాగం,