Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Fri, 25 Mar 2016 16:19:58 IST

ఊపిరి

ఊపిరి

‘ఊపిరి - సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన టైటిల్‌, ప్రచార చిత్రాలు కలిసి మసాలా సినిమాలతో మొహం మొత్తేసిన సినీ ప్రియులకు కొత్త ఊపిరి పోశాయి. ఫ్రెంచ్ సినిమా ‘ఇన్ టచ్‌బుల్స్’ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాని నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ రెడీమేడ్ కథకు ఆయన ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఎలా ఉందో తెలుసుకునే ముందు కథలోకి ఎంట్రీ ఇచ్చేద్దాం.
 
కోటీశ్వరుడైన విక్రమ్ ఆదిత్యకు (నాగార్జున) ఓ ప్రమాదం వల్ల కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోతాయి. అతని అవసరాలన్నీ చూసుకునేందుకు ఓ వ్యక్తి కావాల్సివస్తుంది. అదే సమయంలో పెరోల్‌పై బయటికొచ్చిన శీను (కార్తి) సత్ప్రవర్తనతో జైలు నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంటాడు. ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నంలో విక్రమ్ ఆదిత్య సహాయకుడిగా నియమింపబడతాడు. డబ్బుంటే చాలు అన్నది శీను పాలసీ. కోట్లున్నా కోరిన జీవితం పొందలేకపోతున్నానన్నది విక్రమ్ బాధ. ఇలాంటి ఆలోచనలతో పరిచయమైన వీరు ఒకరి జీవితాలని మరొకరు ఎలా ప్రభావితం చేశారన్నది సినిమా. చెప్పుకోడానికి ఇంతకుమించిన కథ ఈ సినిమాలో ఏమీ లేదు. అయితే కథనంలో ఎన్నో భావోద్వేగాలను మిళితం చేశాడు దర్శకుడు.
 
ఆ భావోద్వేగాలను పండించి కథకు ఊపిరి పోసిన వైద్యుడు (దర్శకుడు) దానికి ముందు ఉన్న భాదని మాత్రం విక్రమ్‌కు అతను చెప్పే ఓ రెండు మాటలకే పరిమితం చేశాడు. తనకు నచ్చినట్టుగా గొప్ప జీవితాన్ని గడిపిన విక్రమ్‌ గతాన్ని, నందిని(అనుష్క)తో అతని ప్రేమ, ప్రమాదం వంటి వాటిని పైపైనే చూపించడంతో విక్రమ్ సంతోషాన్ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు అతడి బాధను అనుభవించలేకపోతాడు. దీనివల్ల కష్టం తర్వాత వచ్చే హాయి పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి. చివరి వరకూ శీను పాత్ర కూడా అలాగే సాగుతుంది. క్లైమాక్స్‌లో అతడి చిన్ననాటి సంగతులను, దొంగగా మారిన పరిస్థితులను చెప్పడంతో అతడి పాత్ర కొంతవరకు ప్రేక్షకులను సమాధానపరుస్తుంది. తర్వాత విక్రమ్ ఓ ఆర్టిస్ట్ (శ్రేయ శరణ్)తో నడిపే మరో ప్రేమకథ కూడా అర్థాంతరంగానే ఉంటుంది. వారి మధ్య గల బంధం కూడా ఓ మాటకే పరిమితం. బహుశా ‘ఏడుపుగొట్టు సినిమా’ అనే మాట రాకుండా ఉండేందుకే ఈ రకంగా నడిపించేసారు కాబోలు. అయితే విక్రమ్ బాధ పోగెట్టేందుకు వంశీ పైడిపల్లి చేసిన ప్రయత్నం ప్రశంసించదగ్గది.
 
నటీనటుల ప్రస్తావనకు వస్తే మొదలుపెట్టాల్సింది మన్మధుడు నాగార్జునతోనే. శరీరం కదలని బాధలోనూ ముఖంపై చిరునవ్వు చిందిస్తూనే లోలోపల ఆవేదిన నిండిన పాత్రలో ఆయన నటన అందిరినీమెప్పిస్తుంది. తర్వాత కార్తి అమాయక యువకుడి పాత్రలో నవ్విస్తూ, కంటితడి పెట్టిస్తాడు. సెక్రటరీ (కీర్తి) పాత్రలో తమన్నా, లీగల్ అడ్వయిజర్‌గా ప్రకాష్ రాజ్ ఆకట్టకుంటారు. జయసుధ, తనికెళ్ళ భరణి పాత్రలు అంతంతమాత్రమే. అలీకి, కార్తి పాత్రకు వ్యక్తిగత సంబంధమేమిటన్నది తెలియలేదు. ద్విభాషా సినిమా కావడంతో కొంతమంది తమిళ నటులు కనపడతారు.
 
సాంకేతికంగా గోపీసుందర్ బాణీలు - నేపథ్య సంగీతం, పి.ఎస్.వినోద్ కెమెరా పనితనం సినిమాకి ఊపిరి పోసాయనడం అతిశయోక్తి కాదు. సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి రాసిన పాటలు అర్థవంతంగా కథను ఇనుమడింపజేసేలా ఉన్నాయి. అబ్బూరి రవి రాసిన ‘ప్రేమంటే భయం. భయం ఉందంటే అక్కడ ప్రేమ ఉన్నట్టే’ లాంటి సందర్భోచిత సంభాషణలు సినిమాకి ప్లస్‌గా నిలిచాయి. నిర్మాణంలో పీవీపీ సంస్థ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదన్నది ప్రతీ సన్నివేశంలోనూ స్పష్టం.
 
రేటింగ్ : 3/5

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.