Mar 9 2016 @ 19:37PM

హీరో కంటే కథకే విలువిస్తా - ఆర్పీ పట్నాయక్‌

‘‘నేను హీరో కంటే కథకే ఎక్కువ విలువనిస్తాను. కథకంటే తమకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే హీరోలతో నేను పని చెయ్యలేను’’ అని చెప్పారు ఆర్పీ పట్నాయక్‌. ఐదు రకాల బాధ్యతలు మోస్తూ ఆయన తీసిన చిత్రం ‘తులసీదళం’. రచయితగా కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చి, సంగీత దర్శకునిగా స్వరాలు కూర్చి, నటుడిగా ఓ కీలక పాత్ర పోషించి, స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆయన నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆర్పీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేనేం కావాలనుకున్నానో అవి చేసే అవకాశం వీటివల్ల వస్తోంది. ఈ మధ్య చాలామంది ‘మీ మ్యూజిక్‌ మిస్‌ అవుతున్నామండీ’ అంటున్నారు. వాళ్ల ఆశలు ‘తులసీదళం’తో తీరుతాయనుకుంటున్నా. అందులోని పాటలు చాలా బావుంటాయి. ఇప్పటివరకూ ఎవరూ చెయ్యని ప్రయత్నం చెయ్యాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. రాత్రివేళ కూడా అతి ప్రకాశవంతంగా కనిపించే లాస్‌వేగాస్‌లో 44 రోజుల పాటు షూటింగ్‌ చేసిన సినిమా ‘తులసీదళం’. హారర్‌ సినిమాల్లో ఇది భిన్నంగా కనిపిస్తుంది. ఒక బ్రైట్‌ లవ్‌స్టోరీకి హారర్‌ను జోడించి చేసిన సినిమా. దీన్ని నేనే నిర్మిస్తున్నా. సినిమాకు సంబంధించిన 25 క్రాఫ్టులు (24+కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) నాకు అవగతమే. కానీ నిర్మాణం అనేది అర్థం కావటానికి నాకు టైమ్‌ పట్టింది. అందుకే ‘తులసీదళం’ విడుదల ఆలస్యమైంది. యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ‘తులసీదళం’కు, నా సినిమాకూ ఎలాంటి పోలికా లేదు. ఇది ఫక్తు ఆర్పీ పట్నాయక్‌ ‘తులసీదళం’. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుణ్ణి తులసీదళంతో రుక్మిణి గెలుచుకున్న విషయం మనకు తెలుసు. తులసికి అంత గొప్ప విలువ, పవిత్రతా ఉన్నాయి. నా దృష్టిలో ఈ సినిమా కథ కూడా అలాంటిదే. ఇందులో హీరో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయితే, హీరోయిన లాస్‌వేగాస్‌లో టూరిస్ట్‌ గైడ్‌గా కనిపిస్తుంది. నేను డాక్టర్‌ తిలక్‌గా కనిపిస్తా. ఒక కథకు సంబంధించి సాధారణంగా ఎవరి ఆలోచనలైనా ఎక్కడ ఆగుతాయో అక్కణ్ణించి ఆలోచించడం నా అలవాటు. ఇప్పుడు మీడియాపై నేను చేస్తున్న ‘మనలో ఒకడు’ కూడా అంతే. సాధారణంగా మీడియా ప్రధానాంశం అంటే హీరో జర్నలిస్ట్‌గా కనిపిస్తాడు. అలా కాకుండా హీరో ఓ సామాన్య పౌరుడైతే ఎలా ఉంటుందని ఆలోచించి చేస్తున్న సినిమా.

 
జీవిత కాలాన్ని మించిన కథలు
సంగీత దర్శకుడిగా వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోవాలని నేను అనుకోవట్లేదు. నాకు ‘మనం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చక్కని సినిమాలకు సంగీతం అందించాలని ఉంది. నాకు కథ నచ్చితే నూటికి నూరు శాతం సంగీతానికి న్యాయం చేస్తా. ‘మనం’ సంగీతం విని వెంటనే అనూప్‌కు ఫోన చెయ్యకుండా ఉండలేకపోయా. చాలా చక్కని సంగీతం ఇచ్చాడు అనూప్‌. కొంతమంది సినీ రంగంలో పనిచేస్తూనే రియల్‌ ఎస్టేట్‌ లేదా మరొక ఏదో రంగంలో రాణిస్తుంటారు. నా దృష్టిలో వాళ్లు చాలా టాలెంటెడ్‌. నేనలా కాకుండా సినిమా కోసమే రకరకాల పనులు చేస్తున్నా. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా సినిమా కోసమే పనిచేస్తున్నా. నా ఆలోచనల నుంచి పుట్టిన కథలతోనే నేను సినిమాలు తీస్తున్నా. నా జీవిత కాలానికి మించిన కథలు నా దగ్గరున్నాయి. అవన్నీ ఎంతో కొంత సమాజాన్ని స్పృశించే కథలే.