Feb 22 2016 @ 11:31AM

పాలనపై పట్టుతప్పిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్న చంద్రబాబు ?

మబ్బులు వీడుతున్నాయి. నిజాలు వెలుగుచూస్తున్నాయి. బయటికి తెలిసింది కొంతే.. లోపల జరిగింది మరెంతో ఉంది. ఆరు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు విషయాన్ని అంగీకరించారు. కారణాలను విశ్లేషించారు. భవిష్యత్‌లో ఈ పరిస్థితి ఉత్పన్నం కానివ్వద్దు అని గట్టిగా నిర్ణయించుకున్నారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే మళ్లీ అధికారంలోకి వస్తామనే నిశ్చయానికి వచ్చారు. అందుకనే పార్టీపై దృష్టిపెట్టాలనీ, పాలనపై పట్టుబిగించాలనీ బాబు పట్టుదలగా ఉన్నారు. క్యాబినేట్‌లో ఆసక్తికరంగా జరిగిన సంభాషణలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సరదాగా సాగిన ఈ సంభాషణ ఆ తర్వాత సీరియస్‌గా పరిణమించింది. 
 
నెలలో పదిహేను రోజులకోసారి జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం విజయవాడలో సోమవారం జరిగింది. సమావేశానికి వెళ్లిన మంత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ కబురు అందింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులంతా ఇక్కడే ఉండాలనీ, పార్టీ- ప్రభుత్వపరమైన మరో భేటీ ఉంటుందని చల్లగా చెప్పారు. తొలుత... ఆరు గంటలపాటు సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం పార్టీ సమావేశం ప్రారంభమైంది. సీఎంఓలోని మొదటి అంతస్తులో జరిగిన ఈ సమావేశం వాడిగావేడిగా కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్ని అంశాలను బహిరంగంగానే అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు తమ మనోభావాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.
 
ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు కొనసాగిన తెలుగుదేశం ప్రభుత్వంలో పాలనాదక్షుడిగా, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన నేతగా, అధికార యంత్రాంగంపై పట్టుసాధించిన సమర్థునిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని ఓ మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఉద్యోగులలో ఏర్పడిన వ్యతిరేకత, ప్రకృతి సహకరించకపోవడంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయామని అన్నారు. ఆనాడు హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, పాలనాదక్షుడిగా బాబుకి ప్రజల్లో ఉన్న పేరు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు. అయితే ప్రస్తుతం ఏపీలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నదనీ, పాలనపై బాబుకి పట్టులేదన్న భావం ఏర్పడుతోందనీ, అవినీతి పెరిగిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లోకి ప్రవేశించిందనీ, దీనికి వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనీ సదరు మంత్రి స్పష్టంచేశారు.
 
సీఎం చంద్రబాబు కూడా మంత్రివర్గ సహచరుడు వ్యక్తంచేసిన ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. కారణాలను విశ్లేషించారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో పార్టీపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపించాననీ, రెండవసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీపై యాభైశాతం మాత్రమే దృష్టి సారించగలిగాననీ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మూడవ దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తాను రాష్ట్ర విభజన సవాళ్ల కారణంగా ఈ ఇరవై నెలల కాలంలో పార్టీపై దృష్టి పెట్టలేకపోయానని అంగీకరించారు.
 
అంతేకాదు- తాను విజయవాడలోను, అధికారులు- ఉద్యోగులు హైదరాబాద్‌లోను ఉండటంతో పాలనపై పట్టుతప్పిన విషయం వాస్తవమేననీ, జూన్ నాటికి అందరినీ రాజధానికి తరలించి తన మార్క్‌ పాలన ఏమిటో చూపిస్తానని తీవ్రస్వరంతో చంద్రబాబు చెప్పారు. ఉద్యోగులు ఏపీ రాజధానికి తరలి రావాల్సిందేననీ, ప్రత్యామ్నాయం లేనేలేదని కూడా కుండబద్దలు కొట్టారు. ఇక ముందు పార్టీ అంశాలను పూర్తిస్థాయిలో పట్టించుకుంటానని కూడా విస్పష్టంగా చెప్పారు.
 
ఈ సమావేశంలో అప్పటికప్పుడు చంద్రబాబు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈనెల 22, 23 తేదీలలో కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే విజయవాడలోనే పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేయాలనీ, ఇందుకు బందరురోడ్డులో ఓ భవనాన్ని అన్వేషించాలనీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లను సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. సమావేశాలలో లోటుపాట్లను చర్చించుకోవడంతో పాటు తెలంగాణలో టీఆర్‌ఎస్ బలపడినట్టుగానే ఏపీలో తెలుగుదేశం బలపడే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఒక మంత్రి సూచించారు. దీనికి స్పందించిన చంద్రబాబు పశ్చిమబెంగాల్‌లో పరిణామాలను ప్రస్తావించారు.
 
అధికారంలో ఉన్న పార్టీ సంస్థాగతంగా పటిష్టమయ్యేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పాలనాపరమైన శ్రద్ధ తీసుకోవడం అవసరమని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి రావాలనుకుంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయా ఎమ్మెల్యేలతో మాటామంతీ నెరపాల్సిందిగా కొంతమంది మంత్రులను తమ ఛాంబర్‌కి పిలిపించి మరీ చెప్పారు. ఆ దిశగా గేట్లు తెరవాల్సిందేనని తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా ప్రతిరోజూ తాను వస్తానని మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు చెప్పారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ఇతర నేతలకు బోలెడంత రిలీఫ్‌ వచ్చింది.
 
ఇలా మంత్రులు, పార్టీ బాధ్యుల సమావేశంలో చంద్రబాబు మనసు విప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్, ఇంటిలిజెన్స్ వర్గాలు అందిస్తున్న సమాచారం, పార్టీ వర్గాల పెదవి విరుపులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు ఆత్మవిశ్లేషణకు శ్రీకారం చుట్టారు. పొరబాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని పాలనను గాడిలోపెట్టి, పార్టీని పటిష్టం చేసే దిశగా మొత్తానికి మంత్రుల సమావేశంలో బీజం పడింది. కలెక్టర్ల సమావేశం అనంతరం పార్టీని పరుగులు తీయించాలనీ, అసంతృప్తులకు అడ్డుకట్ట వేయాలనీ తెలుగుదేశాధీశులు నిర్ణయించడం మంత్రులకు ఆరు గంటల తర్వాత బోలెడంత రిలీఫ్‌ కలిగించింది.