desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 11 2016 @ 01:13AM

గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌

  •  డిప్యూటీగా ఫసీయుద్దీన్‌కు చాన్స్‌ 
  •  నేడే ప్రథమ పౌరుడి ఎన్నిక 
  •  ముందుగా కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ భేటీ 
హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగర మేయర్‌గా బొంతు రామ్మోహన్‌కు పట్టంగట్టడం ఖాయమైంది. అలాగే డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయుద్దీన్‌కు అవకాశం దక్కనుంది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి, యువజన విభాగాలకే పదవులు కట్టబెట్టడానికి సీఎం కేసీఆర్‌ విధాన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిర్వహించిన గ్రేటర్‌ ఎన్నికల్లో కొత్త చరిత్ర సృష్టించిన నేపథ్యంలో మేయర్‌ అభ్యర్థిగా, ఓయూ పూర్వ విద్యార్థి బొంతు రామ్మోహన, డిప్యూటీగా బాబా ఫసీయుద్దీనలకు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. గ్రేటర్‌లోని 150 కార్పొరేటర్‌ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌ 99 గెలుచుకోగా, ఎక్స్‌-అఫీషియో బలం కూడా కలిసొచ్చింది. దీంతో వారిద్దరి ఎన్నిక లాంఛనం కానుంది. ఈ మేరకు మహానగర ప్రథమ పౌరుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలులో గురువారం ఉదయం 11 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. దీనికిముందు కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 150 మంది కార్పొరేటర్లతోపాటు, 67మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు కలిపి 217మందికి ఓటు హక్కుంది. వీరిలో 109 మంది హాజరైతేనే కోరం ఉన్నట్టు పరిగణిస్తారు. మేయర్‌ పదవికి పేర్ల ప్రతిపాదన తర్వాత వారి పేరు చదివినపుడు మద్దతిచ్చే సభ్యులు చేతులెత్తి అంగీకారం ప్రకటిస్తారు. ఈ మేరకు 109 మంది మద్దతు సాధించినవారు మేయర్‌గా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. డిప్యూటీ ఎన్నిక కూడా ఇదేవిధంగా జరుగుతుంది. ఈ ఎన్నిక రప్రక్రియకు ముందుగా ఉదయం 8 గంటలకు కార్పొరేటర్లు, ఎక్స్‌-అఫీషియో సభ్యులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశం కానున్నారు. ఇది ముగియగానే వారంతా నాలుగు బస్సుల్లో నేరుగా కార్పొరేషన కౌన్సిల్‌ హాలుకు చేరుకుంటారు.
 
ఇదీ బొంతు నేపథ్యం
వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ వాసులైన బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతుల కుమారుడైన రామ్మోహన్‌కు ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి యాదవ్‌ను ఆయన వివాహమాడగా వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఇంటర్‌, డిగ్రీ వరంగల్‌లో పూర్తిచేసి, ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేసిన రామ్మోహన, 2002లో టీఆర్‌ఎ్‌సలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అటుపైన 2005-07 మధ్య అధ్యక్షుడిగా, 2007-09 మధ్య ఆ విభాగం బాధ్యుడిగా, టీఆర్‌ఎస్‌ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారు.

 
బాబా ఫసీయుద్దీన్....
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
మెదక్‌ జిల్లా పొల్చారం మండంలానికి చెందిన బాబా ఫసీయుద్దీన్ కుటుంబం ప్రస్తుతం బోరబండలో స్థిరపడింది. తండ్రి బాబా షర్ఫొద్దీన వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేయగా... తల్లి రజియా ఫాతిమా ఉస్మానియా ఆస్పత్రి పూర్వ ఉద్యోగిని. బీకామ్‌దాకా చదివిన ఫసీయుద్దీన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం గ్రేటర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.