
తెలంగాణ ప్రాంత ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని గళం విప్పినప్పుడల్లా కొన్ని సందేహాలు, ప్రశ్నలు
ఎదురవుతూ ఉండేవి. తొలి దశలోనూ, మలి దశలోనూ అవే వచ్చాయి. వీటిని వేసేవారిలో కొందరికి చారిత్రక నేపథ్యం తెలియదు. మరికొందరికి రాజకీయ పరిణామాలపై అవగాహన ఉండదు. ఇంకొందరికి ఉండేది కేవలం స్వార్థచింతన. తెలుగు రాష్ట్ర సమగ్రతను కాపాడాలనే కోరిక ఇంకొంతమందిది. ఈ ప్రశ్నలకు వివిధ వేదికలపైన, ఇంటర్వ్యూల్లో ప్రొఫెసర్ జయశంకర్ పలు పర్యాయాలు సమాధానాలు ఇచ్చారు. అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురితం అయ్యాయి. ఈ పుస్తకం ప్రొఫెసర్ జయశంకర్ జీవించి ఉన్న కాలంలోముద్రించారు. నిజానికి తెలంగాణకు సంబంధించిన చాలా ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. ఒక్క విద్యార్థులకే కాదు తెలంగాణను అర్థం చేసుకోవాలనుకునే అందరూ చదవాల్సినవి ఇవి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం మళ్లీ ఎందుకు వినిపిస్తోంది?
తెలంగాణ ప్రాంతపు ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం కొత్త విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ఒక దశాబ్దం ముందే ఈ ప్రాంత ప్రజలు విశాలాంధ్రపై తమ వ్యతిరేకతను చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. దానికి కారణం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తమకు న్యాయం జరగదనే అనుమానం. రాష్ట్రావతరణ జరిగిన తరువాత దశాబ్దాలు గడిచినా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం విశాలమైన ఈ తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగని చేదు అనుభవాలు, ఇకముందు కూడా న్యాయం జరగదనే నమ్మకం.
రాష్ట్రావతరణకు పూర్వం
1) 1946-48: విశాలాంధ్ర వాదాన్ని తెలంగాణలోని అత్యధికులు ఎప్పుడూ సమర్థించలేదు. దానిపై వారి వ్యతిరేకత 1946-48 మధ్యకాలంలో మరింత ప్రస్ఫుటమైంది. అప్పుడు రజాకార్ల అరాచక చర్యలను తట్టుకోలేని కొందరు హైదరాబాద్ రాష్ట్రవాసులు తలదాచుకోవడానికి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. కొందరు నాగపూర్ మరికొందరు విజయవాడ, కర్నూలు పట్టణాలకు వెళ్లారు. నాగపూర్ వెళ్లినవారికి అక్కడి స్థానికులు అత్యంత ఆప్యాయతతో ఆశ్రయం ఇచ్చారు. ఇలా నాగ్‌పూర్ వెళ్లినవారిలో పి.వి. నరసింహారావు కూడా ఉన్నారు. విజయవాడ, కర్నూలు వెళ్లినవారికి మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నిజాం రాష్ట్రం నుంచి వచ్చిన వారందరూ బాగా ధనవంతులని భావించి ఇంటి అద్దెలు, హోటళ్ల రేట్లు, నిత్యావసరాల ధరలను అనేక రెట్లు పెంచడమే కాకుండా, వారితో అమర్యాదగా ప్రవర్తించారు. అటువంటి చేదు అనుభవాలను చవిచూసినవారిలో కొందరు ఇప్పటికీ జీవించే ఉన్నారు.
2) 1952: 1948లో జరిగిన పోలీస్ యాక్షన్ తర్వాత అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. 1948 నుంచి 1952లో సాధారణ ఎన్నికలు జరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడే వరకూ హైదరాబాద్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన మిలటరీ/ సివిల్ అడ్మినిసే్ట్రటర్స్ పాలనలో ఉండేది. ఈ సంధి కాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అనేకమంది ఆంధ్రులు ఉద్యోగాల కోసం తెలంగాణప్రాంతానికి రావడం ప్రారంభమైంది. స్థానికేతరులైన అడ్మినిసే్ట్రటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రభుత్వ యంత్రాంగం ఉండటంతో ఈ వలస నిరాటంకంగా కొనసాగింది. ఆ విధంగా బతుకుతెరువు కోసం వలస వచ్చినవారు ఉద్యోగ స్తులుగా నడుచుకోడానికి బదులు ఈ ప్రాంతానికి వచ్చిన విజేతలుగా, తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన సంస్కర్తలుగా ప్రవర్తించారు. అందువల్ల తెలంగాణ ప్రజలు 1952లో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ‘‘నాన్ ముల్కీ ఉద్యమం’’ పేరుతో చరిత్ర పుటలకెక్కింది. ఈ ఉద్యమంలో అనేకమంది తెలంగాణ యువకులు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
3) 1954-56: ఈ దశలో కేంద్ర ప్రభుత్వం స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్(ఎస్ఆర్సి)ని నియమించి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. 1954లో ఈ సంఘం హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు తెలంగాణ ప్రజలు, నాయకులు తమ అభిప్రాయాలను దాని ముందుంచారు. గత చేదు అనుభవాల జ్ఞాపకాలను, భవిష్యత్తు గురించి ఉన్న భయ, సందేహాలను తెలంగాణ ప్రజలు ఫజల్ అలీ కమిషన్ ముందు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత భవిష్యత్తు సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే ఈ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని ఇవ్వడం అనివార్యమని విన్నవించారు. తెలంగాణ ప్రాంత ప్రజల అభీష్టం, రాజకీయ నాయకుల అభిప్రాయాలు, జాతీయ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసింది.
రాష్ట్రావతరణ తర్వాత...
1) 1958-61: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం చేసిన స్పష్టమైన సిఫారసుకు విరుద్ధంగా తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, నాటి ప్రధాని నెహ్రూ అభిమతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబరు 1న ఏర్పాటైంది. కానీ ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ విలీనం బేషరతుగా జరగలేదు. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే ఈ హామీల ఉల్లంఘన రాష్ట్రం అవతరించిన మొదటి రోజే మొదలైంది. దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించిన క్రమంలో అఖిల పక్షాలతో కూడిన ‘‘తెలంగాణ మహాసభ’’ అనే సంస్థ ఆవిర్భవించింది. తెలంగాణ మహాసభ చాలాకాలం వరకు ఈ ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చింది. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీల అమలు జరగకపోతే ఆ ప్రాంతపు ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరతారని హెచ్చరించింది.
2) 1960: తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన రక్షణల అమలును పర్యవేక్షించడానికి చట్టబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ సంఘం ఒప్పందాల ఉల్లంఘనల గురించి అధికారికంగా ఏకరువు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ స్థాపనకు మూలాధారమైన రక్షణల ఉల్లంఘన రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని వివరించింది.
3) 1961: అ) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వివక్షకు గురవుతున్న తెలంగాణ సమస్య పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావనకు వచ్చింది.
ఆ) తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీల అమలు గురించి, అమలు జరగని అంశాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించాల్సి వచ్చింది.
4)1967-68: తెలంగాణ ప్రాంతానికి నిరాటంకంగా జరుగుతున్న అన్యాయాల గురించి తెలంగాణ ప్రాంతీయ సంఘం అసంఖ్యాకమైన నిరసనలు తెలిపింది. పర్యవసానాలపై హెచ్చరికలు చేసింది.
5) 1968-71: ఎవరెన్ని చెప్పినా, ఏం చేసినా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగలేదు. దోపిడీ నిరాటంకంగా కొనసాగింది. దాని పర్యవసానమే 1968-71 నాటి ‘‘జై తెలంగాణ’’ ఉద్యమం. దాన్ని అణచివేయడానికి ఆనాటి పాలక వర్గాలు చేపట్టిన దమనకాండలో 370 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.
6) 1972-73: తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలన్నింటినీ రద్దుచేసి వారికి ఏ హక్కులూ లేకుండా చేస్తే తప్ప ఉమ్మడి రాష్ట్రం అవసరం లేదని ‘‘జై ఆంధ్ర’’ ఉద్యమం మొదలైంది. ఆ విధంగానైనా తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఆశించారు. కానీ, తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలను రద్దుచేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని చల్లార్చారు.
7) 1985: కరీంనగర్లో తెలంగాణ సమస్యపై విద్యావంతుల సదస్సులో అధ్యయనం చేశారు.
8) 1986: తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు స్థాపన, కొనసాగిస్తున్న అధ్యయనాలు
9) 1988: తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది.
10) 1989: తెలంగాణ అభివృద్ధి ఫోరమ్ స్థాపన, చేపట్టిన కార్యక్రమాలు
11) 1991-92: తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఫ్రంట్ స్థాపన, చేపట్టిన ఆందోళనలు
12) 1992: నాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమర్పించిన నివేదికలు, విన్నపాలు.
13) 1996-2004: 1996 అక్టోబరు 27న నిజామాబాద్‌లో కొందరు యువకులు ఏర్పాటుచేసిన చిన్న సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చ పునరావృతమైంది. తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో 1996 నవంబరు 1న వరంగల్‌లో జరిగిన సదస్సుతో ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. 1997 జనవరి 14న మల్లెపల్లి రాజం మెమోరియల్ ట్రస్టు గోదావరిఖనిలో, జనవరి 17న ఫోరమ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలు ఉద్యమానికి నూతనోత్తేజం కలిగించాయి. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో అనేక వేదికలు, సంస్థలు, పార్టీలు ఉద్భవించి, ఉద్యమాన్ని కొనసాగించాయి.
తెలంగాణ ఉద్యమ సమితి, తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రజా పరిషత్, తెలంగాణ ప్రజాపార్టీ, తెలంగాణ జనసభ వంటి సంస్థల స్థాపన ఉద్యమాన్ని మరికొంత ముందుకు తీసుకుపోయింది. రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థల సమీకరణతో తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భవించింది. సంప్రదాయేతర రాజకీయ వేదికగా రూపుదిద్దుకున్న ఈ సంస్థ తెలంగాణ సమస్యపై జనసామాన్యంలో విశేషమైన చైతన్యాన్ని కలిగించింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనతో రాజకీయ ప్రక్రియ మొదలై తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరింది. తెలంగాణ సాధన సమితి స్థాపన, తదుపరి తెలంగాణ రాష్ట్ర సమితిలో దాని విలీనం, తెలంగాణ ఉద్యమానికి మరికొంత బలాన్ని చేకూర్చింది. ఈ వాతావరణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వంటి సంస్థల స్థాపనతో విద్యావంతులకు ఉద్యమంలో మరింత భాగస్వామ్యం లభించింది. ఇదేకాలంలో అమెరికాలో స్థిరపడిన తెలంగాణవారు ఈ సమస్య గురించి ఆలోచించడం మొదలైంది. 1999లో న్యూయార్క్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్థాపించారు. ఈ ఫోరం 2000-2002లో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో ఆ దేశంలోని పది ప్రముఖ నగరాల్లో సదస్సుల నిర్వహణ, వాటిలో ప్రసంగించడానికి ప్రముఖ తెలంగాణవాదులను ఆహ్వానించడం తెలంగాణ ఉద్యమానికి నైతిక బలాన్ని సమకూర్చాయి.
ఈ విధంగా నిలదొక్కుకున్న తెలంగాణ ఉద్యమానికి 2001 ఏప్రిల్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించిది. ఈ ఉద్యమం నిరంతరం నడుస్తున్న చరిత్ర అని నిరూపించింది.
తెలంగాణ ప్రాంత నాయకులు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు కదా! మరి ఈ ప్రాంతాభివృద్ధికి వారెందుకు కృషి చేయలేదు?
తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి (రెండుసార్లు), టి. అంజయ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన మాట వాస్తవమే. వారంతా కలిసి రాష్ట్రాధికారాన్ని చేపట్టిన కాలం నాలుగు విడతల్లో ఆరు సంవత్సరాలు. వారెవరూ తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఏమీ చేయలేకపోయిన మాట కూడా వాస్తవమే. జలగం వెంగళరావును తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిగా లెక్కించడం న్యాయం కాదు. ఆయన కోస్తా ఆంధ్రలో పుట్టి జీవనోపాధి కోసం తెలంగాణకు వచ్చిన వ్యక్తి. ఆయన రాజకీయ ఎదుగుదల తెలంగాణలోనే జరిగినా, ఈ ప్రాంతంతో మమేకం కాలేకపోయాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఖమ్మం జిల్లాను కోస్తా ఆంధ్రలో కలిపేస్తానని బెదిరించి అపహాస్యం పాలయ్యాడు. తెలంగాణ శ్రేయస్సును కాలరాసి నాగార్జునాసాగర్ ఎడమ కాలువను ఆంధ్ర ప్రాంతంలో పొడిగించిన ఘనత వెంగళరావుకే దక్కింది.
మరి రాయలసీమ మాటేమిటి?ఆ ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి(రెండుసార్లు), దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి(రెండుసార్లు), చంద్రబాబునాయుడు(రెండుసార్లు), వైస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వారంతా కలసి రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని ఏలారు. అయినా రాయలసీమ ఇంకా వెనుకబడిన ప్రాంతంగా ఎందుకు ఉండిపోయింది? కింగ్‌మేకర్‌గా చెలామణి అవుతున్న చంద్రబాబునాయుడు, తనకు తానే కింగ్ అనుకున్న సంజీవరెడ్డి వంటివారు ఈ రాష్ట్రాన్ని ఏలిన తరవాత కూడా రాయలసీమకు ఆ దుర్గతి ఎందుకు పట్టింది?
నిజానికి తెలంగాణ లేదా రాయలసీమకు చెందిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమీ చేయలేదు. కనీసం తమ ప్రాంతానికి, తాము జన్మించిన జిల్లాలకు కూడా ఏమీ చేయలేకపోయారు. లేకపోతే రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన నీలం సంజీవరెడ్డి జన్మించిన అనంతపురం జిల్లా దేశంలోనే వెనుకబడిన జిల్లాల జాబితాలో ఎందుకు ఉంటుంది? ఈ నాయకులందరూ చేసిన సేవ(దాస్యం) కోస్తా జిల్లాల్లో ఉత్పత్తి అయిన సంపదకు, సంపన్న వర్గాలకు మాత్రమే. ఆ వర్గాలే రాష్ట్ర రాజకీయాలను నియంత్రించి ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతంలో వెనకబడిన ప్రాంతాన్ని విలీనం చేస్తే ఇలాగే జరుగుతుందన్న సత్యాన్ని గుర్తించిన ఫజల్ అలీ కమిషన్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని స్పష్టమైన సిఫారసు చేసింది. ఈ దేశంలో విజ్ఞుల హితవును పాటించే అలవాటు రాజకీయ నాయకులకు ఉంటే ఈనాడు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు.
చిన్న రాష్ట్రాలను సృష్టిస్తూ పోతే దేశ సమగ్రతకు భంగం కాదా?
దేశంలో ఇప్పుడున్న 35 రాష్ట్రాల్లో (28 రాష్ట్రాలు - 7 కేంద్రపాలిత ప్రాంతాలు) 70 శాతం రాష్ట్రాలు తెలంగాణ కంటే చిన్నవి. ప్రస్తుతం తెలంగాణ జనాభా మూడు కోట్లు దాటింది. ఇది 1956లో ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. దేశంలో ఇదివరకే ఉన్న 25 రాష్ట్రాల కంటే తెలంగాణ చాలా పెద్ద రాష్ట్రం అవుతుంది. వాటితో దేశ సమగ్రతకు భంగం కలగనప్పుడు, అంత కంటే పెద్ద రాష్ట్రంగా ఉండే తెలంగాణతో ప్రమాదం ఎందుకు వస్తుంది?
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం లోని వెనుకబడిన జిల్లాలు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఏం చేస్తారు?
వెనుకబాటుతనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం వెనుక గల ప్రధాన కారణాల్లో ఒకటి. అదే ఏకైక కారణం కాదు. తెలంగాణలోని పది జిల్లాలకు చారిత్రకంగా ఒకే నేపథ్యం ఉంది. భౌగోళికంగా సామీప్యం ఉంది. సాంస్కృతికంగా సారూప్యం ఉంది. భాషాపరంగా ఒక ప్రత్యేకత ఉంది. ప్రజల మధ్య పరస్పర అవగాహన ఉంది. ఇవన్నీ భావ సమైక్యతకు గట్టి పునాదులు. ఈ ప్రాంతంలోని ఏ జిల్లావారు కూడా తమకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలనే భావన ఏనాడూ పరోక్షంగా కూడా వెలిబుచ్చలేదు. అటువంటి అవకాశాలు కూడా లేవు. ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. అంతమాత్రాన అవి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నాయా? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక ప్రతిపత్తిని కోరే అవకాశం ఉంటుందనే వాదన ఆధార రహితం, అర్థరహితం.
ఒకే భాష మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఎందుకు?
ఒక భాష మాట్లాడేవారికి ఒకే రాష్ట్రం ఉండాలంటే, హిందీ మాట్లాడేవారికి తొమ్మిది రాష్ట్రాలు ఎందుకు? హిందీ తరవాత దేశంలో అధికంగా మాట్లాడే భాష తెలుగు. అటువంటప్పుడు తెలుగు మాట్లాడేవారికి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు? తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష సిసలైన తెలుగు అనికొందరు, అది అసలు తెలుగే కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. తెలంగాణ యాసను వేరే భాషగా చిత్రీకరించి ఎగతాళి చేసేవారికి ఆ ప్రాంతం వేరే రాష్ట్రమైతే అభ్యంతరం దేనికి?
ప్రత్యేక రాష్ట్ర నినాదం వేర్పాటువాదం కాదా?
ఒక ప్రాంత ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం వేర్పాటువాదమైతే, భారతదేశంలోని ప్రతి రాష్ట్ర స్థాపనకు మూలం వేర్పాటువాదమే అవుతుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల స్థాపనకు ప్రాతిపదికే వేర్పాటువాదం. ఇలా ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రానికి కారకుడైన పొట్టి శ్రీరాములు దేశంలోని మొదటి వేర్పాటువాది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలు విడిపోవాలని ఏ కారణాలు చూపి పొట్టి శ్రీరాములు పోరాటం చేశాడో, సరిగ్గా అవే కారణాలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రం నుంచి విడిపోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఒకప్పుడు ఆంధ్రులు కోరిందే ఇప్పుడు తెలంగాణ వారు కోరుతున్నారు. ఇందులో ఒకటి వేర్పాటువాదం కానప్పుడు ఇంకొకటి వేర్పాటువాదం ఎలా అవుతుంది?
రాష్ట్రాల పునర్విభజన ఇంకా ఎంతకాలం కొనసాగాలి?
భారతదేశంలో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఫజల్ అలీ కమిషన్ రాకముందే ఈ కార్యక్రమం మొదలైంది. ఉదా: ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఆ తరవాత కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఉదా: ఈశాన్య రాష్ట్రాల పునర్విభజన. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్,, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల స్థాపన. ఇన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు లేని అభ్యంతరాలు ఒక్క తెలంగాణ విషయంలోనే ఎందుకు తలెత్తుతున్నాయి?
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు మరికొన్ని ఉన్నాయి కదా! తెలంగాణ ప్రజలకే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలి?
తెలంగాణ తరహాలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలుకూడా వివక్షకు గురైన విషయం నిజమే. కానీ తెలంగాణ ప్రాంతం వివక్షతోపాటు దోపిడీకి కూడా గురైంది. ఈ ప్రాంతానికి చెందిన జల వనరులను, ఇతర ప్రకృతి సంపదను, నిధులను, ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం, ఇక్కడి ప్రజలకు లభించాల్సిన ఉపాధి అవకాశాలను ఇతర ప్రాంతాలవారికి అందించడం, వలసీకరణ వంటి సమస్యలు ఇతర వెనుకబడిన ప్రాంతాలకు లేవు. వీటికితోడు తెలంగాణ ప్రజల భాష, సంస్కృతి విషయంలో అవహేళనకు, రాజకీయంగా చిన్నచూపునకు గురై తమ అస్తిత్వాన్నే కోల్పోయే దశకు చేరుకున్నారు. తమ ప్రాంతంలో ఉన్న అపారమైన వనరులను తమ ప్రాంత అభివృద్ధికి వినియోగించుకునే స్వేచ్ఛ కోసం, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుని ఆత్మగౌరవంతో బతకడానికి తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు.
(26/11/15 ... దిక్సూ చి ఫ్లస్ సంచికలో)
(03-11-15 దిక్సూచి ఫ్లస్ సంచికలో)
- ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్