Jan 12 2016 @ 03:19AM

కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు పల్లెంపాటి వెంకటేశ్వర్లు కన్నుమూత

  • పలువురు ప్రముఖుల నివాళి 
  • మహాప్రస్థానంలో అంత్యక్రియలు 
కవాడిగూడ/హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పల్లెంపాటి వెంకటేశ్వర్లు (90) సో మవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఉదయం తుదిశ్వాస విడిచారు. గుం టూరు జిల్లా అమర్తలూరు మండలం, మోపర్రు ఆయన స్వగ్రామం. పల్లెంపాటి వీరయ్య, నర్సమ్మల కుమారుడైన వెంకటేశ్వర్లుకు భార్య సామ్రాజ్యం, కుమారుడు వీరయ్య, నలుగురు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తె లక్ష్మీనళిని భర్త జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నల్గొండ జిల్లా దొండపాడులో 1979లో ‘కాకతీయ సిమెంట్‌ ఫ్యాక్టరీ’ని వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం జిల్లా కల్లూరులో చక్కెర ఫ్యాక్టరీ, విద్యుత్‌ సంస్థలను ఏర్పాటుచేసి, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. వెంకటేశ్వర్లు లోగడ టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా సేవలందించారు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లోని శ్రీ శివానంద ఆశ్రమం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. పలు ఆలయాల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. వెంకటేశ్వర్లు భౌతి కకాయాన్ని అశోక్‌నగర్‌ చౌరస్తా సమీపంలోని ఆయన నివాసానికి తరలించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, సినీనటుడు హరికృష్ణ, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ పక్షనేత కె.లక్ష్మణ్‌, నిర్మాత డీ సురేశ్‌, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, వేంకటేశ్వర రావు దంపతులు...వెంకటేశ్వర్లు భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన పార్థివదేహానికి టోలిచౌకి మహాప్రస్థానం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.