Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 13 Dec 2015 19:06:08 IST

ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

ఆరడుగుల అందం..ఆకట్టుకునే కంచు కంఠం.. ఉరకలెత్తే భావుకత్వం.. మూర్తీభవించిన నటనా చాతుర్యం.. ఇవన్నీ కలిపితే నటుడు రంగనాథ్‌ అవుతారు. హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారాయన. నటుడుగానే కాక తనలోని కవిని కూడా బయటపెట్టారాయన. నాలుగు దశాబ్దాలుగా తెలుగువాళ్లను అలరిస్తున్న ఆయనలోని బహుముఖ కోణాలను ఆవిష్కరించారు. 3-3-14న జరిగిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ వివరాలు.. 


ఆర్కే : రంగనాథ్‌గారు ఎలా ఉన్నారు? నటులకు రిటైర్‌మెంట్‌ లేదు కదా! వ్యక్తి జీవితం ఎలా ఉంది? వృత్తి జీవితం ఎలా ఉంది?
రంగనాథ్‌ : అసంతృప్తి అయితే లేదు. మనం ఆశించిన జీవితం కోసం ఎదురుచూడటం కన్నా, జీవితం ఎలా వస్తే అలా స్వీకరించడమే మంచిది అన్నది నా ఉద్దేశ్యం.

ఆర్కే: వయసులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకుంటాం కదా? మీకు ఆ వయసులోనే అలాంటి భావన ఎలా కలిగింది?
రంగనాథ్‌ : మా తాతగారికి మా అమ్మ ఒక్కతే కూతురు. నేను పుట్టాక.. నన్ను ఇవ్వమని తాతగారు అడగడంతో వాళ్లింట్లోనే పెరగాల్సి వచ్చింది. ఆ ఇంట్లో ఆస్తిపాస్తుల మీద ఏనాడూ చర్చలు జరిగేవి కావు. చదువు, ఆటపాటలు తప్పిస్తే మరో టాపిక్‌ ఏదీ ఉండేది కాదు. మా తాతగారు మందసా మహారాజు ఎస్టేట్‌లో వైద్యుడుగా ఉండేవారు. ఆయనకు సంపాదన మీద ఆలోచనే ఉంటే అదీఇదీ చేసి.. అగ్రహారాలనే రాయించుకునేవారేమో! రాజుగారి గురించి వారు ఎప్పుడు చెప్పినా.. ఆయన గొప్పదనం గురించి చెప్పలేదు. వాళ్లు ప్రజలను ఎలా ఆదుకున్నారు, ఎలా సేవ చేస్తున్నారు అనేవే చెప్పేవారు. అవే ఆలోచనలు నాలో ఉండిపోయాయి.

ఆర్కే : మీరు సినిమా నటుడుగానే అందరికీ తెలుసు. మీలో కవి ఉన్నారని చాలామందికి తెలీదు? కేఆర్‌ విజయ నవ్వు మీద కూడా కవిత్వం రాశారట కదా?
రంగనాథ్‌ : ముప్పయి ఏళ్ల కిందట రాసిన కవిత అది..
‘‘కలకండ తొట్టిలో/మంచి గంధం మట్టివేసి
నిండు పున్నమినాటి /వెండి వెన్నెల మొక్క నాటి
పుట్టతేనెల నీరుపోసి/వెన్నముద్దల ఎరువు వేసి
నవరత్నరాసుల ఎండలో/పన్నీటి జల్లుల వానలో
ఉంచి పెంచి పోషిస్తే/దానికి పూచే పువ్వు పేరేమి?
కేఆర్‌ విజయ నవ్వుకాక వేరేమి?’’ అని రాశాను.

ఆర్కే : ఆమె నవ్వుకు మీరంతగా పడిపోయారే?
రంగనాథ్‌ : ప్రపంచమే పడిపోయింది కదండీ. తమిళంలో ఆవిడ నవ్వుకే ‘మోహనపున్నగై’ అనే టైటిల్‌ పెట్టారు. ఆ కవితను తమిళంలోకి అనువదించి దానికొక ఫ్రేము కట్టించి మొన్న రెండు సంవత్సరాల కిందట కేఆర్‌ విజయకు ఇచ్చొచ్చాను. ఆ కవిత ముప్పయి ఏళ్లు నా దగ్గర ఉంది.

ఆర్కే : కవిత్వం రాయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది?
రంగనాథ్‌ : మాది సంగీత విద్వాంసుల కుటుంబం. బాల్యంలో చదువుకుంటున్న రోజుల్లో తెలుగుమాస్ట్టారు ఒక పద్యం చెప్పారు. బాగుందే అనిపించింది. ఇంటర్‌వెల్‌లో పిల్లలందరూ బయటికి వెళ్లారు. నేను వెళ్లలేదు. పెన్ను కాగితం తీసుకుని.. ‘‘అత్తగారి పెత్తనంబు నెత్తి మీద రుద్దుచుండ తత్తరిల్లి బిత్తరిల్లి చెంతనున్న కత్తినెత్తి నెత్తిమీద మొత్తజూచ కొత్తదైన కోడలమ్మి’’ అని రాశాను. ఇది నా వయసుకు సంబంధం లేని కవిత. మాస్టారుకు చూపిస్తే బావుంది అన్నారు. ఆ తర్వాత రాయలేదు. మళ్లీ రామ్మోహన్‌ అనే ఆయన రాసిన గేయాలను చదివి.. నేను కూడా కొన్ని రాశాను. రాజమండ్రిలో ఉన్నప్పుడు మరికొన్ని కథలు రాశాను.
(ఇంకా ఉంది)
ఇంత భావుకత ఉంది కదా? యుక్తవయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు?.. వివరాలు తరువాతి పేజీలో..

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.