Dec 6 2015 @ 00:30AM

నిరక్షరాస్యుని శిష్యునిగా మహామేధావి

దేశ చరిత్రలో డిసెంబర్‌ 6, 20 తేదీలకు ఒక ప్రత్యేక స్థానముంది. వాటికి ఒక విశిష్టత ఉంది. ఈ రెండు తేదీలు దళిత బహుజనులు బాధతో తలచుకునే రోజులు. తమ తమ జాతుల ఉద్ధరణకు పునరంకితమయ్యే రోజులు. డిసెంబర్‌ 6వ తేదీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కన్నుమూసిన రోజు. డిసెంబర్‌ 20 సంత గాడ్గే బాబా మహారాజ్‌ అమరులైన రోజు. అంబేద్కర్‌ మెహర్‌ కులంలో జన్మిస్తే, గాడ్గే బాబా పరిత (రజక) అనే బట్టలుతికే కులంలో పుట్టారు. ప్రాణప్రదంగా భావించే ఆత్మీయుడు, తనకలలను సాకారం చేసే ఒక నాయకుడు, మేధావి అంబేద్కర్‌ మర ణాన్ని జీర్ణించుకోలేక, కుంగి, కృశించి మంచాన పట్టి 14 రోజులకు గాడ్గే బాబా కన్నుమూశారు. అపార జ్ఞాన సంపన్నుడు, కులవ్యవస్థ నిర్మూలన ఉద్యమనేత, మహామేధావి, దార్శనికుడు అంబేద్కర్‌కు జ్యోతీరావు ఫూలే, గాడ్గే బాబాలిద్దరూ స్ఫూర్తిదాతలు, గురువులు.
 
గాడ్గే బాబా నిరక్షరాశ్యుడే అయినా మహామేధావి అంబేద్కర్‌కు గురువు కావడం విశేషం. ఇద్దరూ మహారాషీ్ట్రయులే. ఇద్దరూ బడుగు బలహీనవర్గాలకు చెందినవారే. గాడ్గే బాబా సాంఘిక కార్యక్రమాలు అంబేద్కర్‌ను ఉత్తేజితం చేశాయి. రుణమోచన్‌ అనే ప్రాంతంలో నది పక్కన ఒక ధర్మశాల నిర్మించి దానికి ‘చొక్కమేల’ అనే సాధువు పుంగవుడి పేరు పెట్టారు బాబా. చొక్కమేల అంటరాని కులాల్లో ఉద్భవించిన సంఘసంస్కర్త. చొక్కమేల పేరిట బాబా ఒక ధర్మశాల నిర్మించడం అంబేద్కర్‌ దృష్టిని ఆకర్షించింది. నది ఒడ్డునే ఉన్న విఠలేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకుని ఎండ, వానల్లో అంటరాని కులాలకు చెందిన భక్తులు పడుతున్న అవస్థలు, ఇబ్బందులనుచూసి తట్టుకోలేక గాడ్గే బాబా ఆ ధర్మశాలను నిర్మించారు. బడుగు, బలహీనవర్గాలు, అంటరాని కులాల వారికోసం ఉద్దేశించి బాబా ఒక్కడే కష్టపడి ధర్మశాల ఏర్పాటు చేశారు. పని వత్తిడుల కారణంగా బాబాను అంబేద్కర్‌ చాలాకాలం కలుసుకోలేక పోయారు. అయితే ఎండనకా, వాననకా పలుగు, పారలతో పనిచేస్తున్న గాడ్గే బాబాను గురించి విని, ఆయన్ని కలుసుకునేందుకు అంబేద్కర్‌ ఆ గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు కింద చినిగిన దుస్తులతో, చేతిలో చిప్పతో ఉన్న ఒక వ్యక్తిని కలసి, బాబా గురించి అంబేద్కర్‌ వాకబు చేశారు. ముష్టివాని రూపంలో ఉన్న ఆ వ్యక్తి తానే గాడ్గే బాబానని సమాధాన మివ్వగా అంబేద్కర్‌ షాక్‌ తిన్నారు. బాబాలంటే ఒక రకమైన వేషధారణ, భాష కలిగి ఉండటానికి భిన్నంగా బిక్షగాడి మాదిరిగా ఉండడం ఆయనకు ఆశ్చర్యమేసింది. గాడ్గే బాబా అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి అంటరాని పిల్లల చదువు కోసం అక్కడ బడిని నిర్మిస్తుండడం గురించి విన్న అంబేద్కర్‌ మరింత విస్మయానికి గురయ్యారు. అస్పృశ్యుల చదువు కోసం బాబా ఆరాటపడడం ఆయన్ని అమితంగా ఆకర్షించింది. సరిగ్గా అప్పుడే అంబేద్కర్‌ మదిలో పుట్టిందే మిలింద్‌ విద్యాలయం. బాబా స్ఫూర్తితో ఆ తరువాత అంబేద్కర్‌ వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారు.
 
అణగారిన వర్గాలకు చదువు ఎంత ముఖ్యమో గ్రహించి విద్య ప్రాధాన్యతను నొక్కి చెప్పడం ప్రారంభించారు. చదువు, పుస్తకాలు రాయడం, చర్చలు చేయడం, మీటింగ్‌లు పెట్టడం, ఉపన్యాసాలివ్వడం ఎంత ముఖ్యమో అణగారిన వర్గాల్లో విద్యావ్యాప్తికి నిర్మాణాత్మకంగా కృషి చేయడం, అందుకోసం పాఠశాలలు, కళాశాలలు నిర్మించడం కూడా అంతే ముఖ్యమని గాడ్గే బాబా కృషి ద్వారా అంబేద్కర్‌ గ్రహించారు. అందుకే గాడ్గేబాబా తన గురువు అని అంబేద్కర్‌ ప్రకటించుకున్నారు. గాడ్గే బాబాకు దేవుళ్లు, పూజలన్నా పట్టింపులేదు. ఏనాడూ గుడికి వెళ్లలేదు. కానీ ఎన్నో బడులను నిర్మించారు. అంటే అణగారిన వర్గాలకు గుడి కంటే బడి అవసరం ఎంతో ఎక్కువని ఆనాడే గ్రహించిన బాబా ఆ దిశగా సుమారు 150 విద్యాసంస్థలు, అనాథాశ్రమాలు, ధర్మశాలలు, గోశాలలు కట్టించారు. పొద్దంతా ఏదో ఒక పని చేయడం, భిక్షమెత్తుకోవడం రాత్రిపూట గోపాలా... గోపాలా.. దేవకీనందన్‌ గోపాలా.. అని కీర్తనలు పాడడం బాబా దినచర్య. ఈ కీర్తనలు ద్వారా సాంఘిక దురాచారాల దుష్పరిణామాల గురించి ప్రజలను మేలుకొలిపేందుకు ఒక మార్గంగా ఎంచుకున్నారు.
 
ఏనాడూ ఏ మీటింగ్‌లోనూ, ఏ జనసమూహం సందర్భంలోనూ దేవుడన్నాడని చెప్పని బాబా ఒకసారి మాత్రం ఒక మీటింగ్‌లో ‘దేవుడున్నాడు’ అని చెప్పారు. జనమంతా అవాక్కయ్యారు. దేవుడెక్కడున్నాడని కొందరు ఆయన్ని ప్రశ్నించగా- ‘అదిగో ఆ పక్కన, ఓ మూలకు నక్కి ఉన్నాడే అతడే మీ దేవుడు’ అని బాబా సమాధానిమిచ్చారు. అంతే ప్రజల్లో కలకలం రేగింది. చూసేసరికి ఆ మూలన కూర్చున్న వ్యక్తి నిజంగానే అణగారిన వర్గాల ఆరాధ్యుడైన అంబేద్కర్‌. అంటే బాబాకు అంబేద్కర్‌ పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం అట్లాంటిది. గురువు గాడ్గే బాబా పుట్టిన బట్టలు ఉతికే కులాన్ని ఎస్సీల్లో చేర్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అంబేద్కర్‌ దోహదపడ్డారు. ఆ స్ఫూర్తితో రజకులను కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ సరైనది. అదే నిరక్షరాస్య గురువు గాడ్గే బాబా, మహా మేధావి శిష్యుడు అంబేద్కర్‌లకు మనమిచ్చే నిజమైన నివాళి.
-నీలం ఉపేంద్ర
(నేడు బి.ఆర్‌.అంబేద్కర్‌ వర్ధంతి)