Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Wed, 02 Dec 2015 00:32:23 IST

శాంతిప్రదాయిని బౌద్ధం

శాంతిప్రదాయిని బౌద్ధం

యుగయుగాల చరిత్రలో ఎందరో మహానుభావులు ఉద్భవించారు. మరెందరో మహోన్నతులు, మానవతా వాదులు, సంస్కర్తలు, ప్రవక్తలు ప్రాదుర్భవించారు. ఎన్నో మతాలను, సిద్ధాంతాలను, ధర్మాలను ఆవిష్కరించారు. సూక్తులను, స్మృతులను భావితరాలకు ఉపదేశించారు. అన్ని మతాలూ, మతాచార్యులూ బోధించిన సారాంశం ఒక్కటే -మోక్ష సాధన. అందుకు వారు అవలంభించిన లేక బోధించిన మార్గాలు అనేకం. అటువంటి మహనీయుల్లో గౌతమ బుద్ధుడొక మహోన్నతుడు.

 
                  ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటివరకూ ఎక్కువ మందిలో ఉన్నది దుఃఖం. కాదని ఏ సత్య ద్రష్టా అనలేదు. ఏ భౌతికవాదీ వచించలేదు. ఏ ఆధ్యాత్మికుడూ పలకలేదు. దుఃఖం ఎక్కువ మందిలో ఉంటే -తక్కువ మందిలో ఉంటుంది సుఖం. అవిద్య, అనారోగ్యం ఉన్న వాళ్ళ సంఖ్య అధికం. దుఃఖమే బంధన. సుఖమే స్వేచ్ఛ. స్మరణాతీత కాలం నుంచి మానవుడ్ని ఈ దుఃఖం నుంచి విముక్తుడ్ని చేయాలనే ఎందరో మహనీయులు, ఎన్నొన్నో, సిద్ధాంతాలను, మతాలను మార్గాలను ప్రవేశపెడుతూ వచ్చారు. కాని మానవుని బాధ లు, బంధనలు పెరుగుతూనే వున్నాయి గాని తరగటం లేదు. దేవుడు అనే అస్తిత్వంతో సంబంధం లేకుండానే కొన్ని సహేతుక సిద్ధాంతాలను బుద్ధుడు బోధించాడు.
 
                    బౌద్ధపు మూల సిద్ధాంతం దుఃఖాన్ని దాటడం ఏ విధంగా అని. అందుకు నాలుగు సూత్రాలను బుద్ధుడు బోధించాడు. వాటినే నాలుగు ఆర్య సత్యాలు అన్నారు. అవి: దుఃఖం అనేది ఉన్నది; దుఃఖానికి కారణాలు ఉన్నాయి; దుఃఖానికి నివారణ ఉన్నది; నివారణకు మార్గంఉన్నది. ఇక్కడ తలయెత్తే సందేహం ఏంటంటే దుఃఖనివారణకు విరాగమే మార్గమా అని. అనురాగం, కుటుంబజీవితం అవరోధాలా అని. కాని పక్షంలో -సిద్ధార్థుడు వృద్ధుడినీ, రోగినీ, భిక్షకుడినీ, శవాన్నీ చూచి విరక్తి చెంది తనను ప్రేమిస్తున్న, తాను ప్రేమిస్తున్న పత్నిని యశోధరనూ, పుత్రుడు రాహులునీ ఎందుకు పరిత్యజించి వారికి తెలియకుండా అర్థరాత్రి అజ్ఞాత గమ్యాలకు పయనిస్తాడు? సత్యాన్వేషణకు పత్నీ పుత్రు లు కంటకాలా? మరి సిద్ధార్థుడు ఎందుకు అంతటి బాధామయ మార్గాన్ని ఎంచుకున్నాడు బాధానివారణార్థం? ఆనాడు వ్యాప్తిలో ఉన్న విధానం అదే! దాన్నే సిద్ధార్థుడు అనుసరించటంలో వెనుకాడలేదు.
ఆనాడు వ్యాప్తిలో ఉన్న, ఇది వరకు తాను ఆచరించిన సాధనాలన్నిటినీ త్యజించి నూతన భావాలతో ఓ రావిచెట్టు క్రింద తదేక ధ్యానంతో ఏడు రోజులు గడిపి వైశాఖ పూర్ణిమ రోజున మహాసంబోధి అనబడే జ్ఞానోదయాన్ని పొందాడు సిద్ధార్థుడు. అంతటితో సిద్ధార్థుడు బుద్ధుడైనాడు. రావిచెట్టు బోధి వృక్షం అయింది. బుద్ధుని ప్రథమ ధర్మోపన్యాసం కాశీ సమీపంలోని ఇసిపట్నం(నేటి సారనాథ్‌)లో జరిగింది.
బుద్ధునిది మధ్యే మార్గం. అతి భోగం, అతి త్యాగం రెండూ దుఃఖాన్ని కలిగించేవే! అతిని వర్జించటం, మితాన్ని స్వీకరించటం వాంఛనీయం. ఇది బౌద్ధానికి ప్రాతిపదిక. బుద్ధుడు ప్రవచించింది -సర్వ దుఃఖాలకు హేతువు కోరిక (తన్హా) అని. ఆర్య చతుష్టయం, పంచ శీలాలు, అష్టాంగమార్గం, దశ శీలాలూ, బౌద్ధంలోని విధానాలు.
 
                  బౌద్ధంలోని నిర్వాణం అంటే కోరికలు ఆరిపోవటం, బంధనాలు తెగిపోవటం, దుఃఖాలు తొలగిపోవటం, పునర్జన్మ లేకుండా పోవటం. ఈ స్థితిని హిందువులు ముక్తి లేక మోక్షం అంటారు. బుద్ధుడు జీవించి ఉండగా ఆయన ఉప దేశాలు ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో తప్ప వ్యాప్తి చెందలేదు. ఆయన మరణానంతరమే అవి భారతదేశంలోనే కాక దేశ దేశాలలో ప్రత్యేకించి దూరప్రాచ్య దేశాల్లో వ్యాపించాయి. ‘ఈ మహా విశ్వం పరిపూర్ణమైన -అభేద్యమైన -కార్యకారణా బద్ధమైన ఓ శృంఖల నిర్హేతుక సంఘటనల మీదను, భగవంతుని ఇచ్ఛ మీదను, ఆధారపడి లేదు. కేవలం పరిణామ సిద్ధాంతం వల్లనే ప్రపంచం రూపొందించబడింది’. ఇదీ బుద్ధుని తాత్వికపరిశీలన. 
అంతేగాదు- ‘అజ్ఞానం కోరికల్ని జనింప చేస్తుంది. ఆ కోరికలు మరుజన్మ కోసం ప్రాకులాడుతాయి. మరుజన్మ దుఃఖ హేతువవుతున్నది. ఆ దుఃఖ నివారణోపాయమే -మరుజన్మకు దారితీసే కోరికల్ని, అందుకు కారణమైన అజ్ఞానాన్ని అంతమొందించటం’ -ఇది బుద్ధ సూక్తి. బౌద్ధత్వం సూక్ష్మంగా గోచరిస్తుంది ఈ మాటల్లో.
 
           భగవంతుని గురించి బుద్ధుడు యిలా అంటాడు- ‘... ఈ సకల చరాచర విశ్వమూ ఎవరి చేతా సృష్టించ బడలేదు. పరిణామం ద్వారా రూపొందించబడింది మాత్రమే. భగవానుడు ఉన్నాడన్నది నిజంకాదు. లేడన్నది రుజువు లేదు’. అందుకే బుద్ధుడిని ఆస్తికుడూ కాదు, నాస్తికుడూ కాదు, సంశయ వాది అన్నారు. బుద్ధుని అనంతరం వికసించిన బౌద్ధంలో అనేక మూఢనమ్మకాలు, అనాచారాలు, దురాచారాలు చోటుచేసుకున్నాయి. ఏది ఏమైనా బుద్ధుని వ్యక్తిత్వం మాత్రం మహనీయమైంది. వెలుగుకు ఆయనొక ప్రతిరూపం. విశ్వ ప్రేమికుడు. కారుణ్య మూర్తి. క్షాంతివాది. ఆ మానవతావాదిని తరువాత తరాలు భగవదవతారంగా పేర్కొనటమే విస్మయ పరుస్తుంది.
 
             మానవుడిగా జన్మించి, మహా మానవుడుగా పరిణతి చెంది-మహోన్నత సూక్తులు ప్రవచించి -మానవాళికి మానసిక స్వాస్థ్యం చేకూర్చిన మహనీయుడుగా మనందరి మనో మందిరాల్లో అందమైన స్థానాన్ని ఆక్రమించిన బుద్ధుడు కేవలం మనుష్యమాత్రుడు మాత్రమే. హేతుదృష్టికి అందని ఏ అంశమూ ఆయన ప్రవచించలేదు. తను నమ్మిన సిద్ధాంతాన్ని -అహింసావాదాన్ని -దుఃఖ నివారణోపాయాన్ని - బహుజనహితాన్ని మాత్రమే బోధించాడు. ఏది వివరించాడో అది ఆచరించాడు. కుల మత జాతి వర్గ విచక్షణే లేని సర్వమానవ సమతావాదం ఆయన బోధ. సమస్త జంతు జాలంపై దయను, సానుభూతిని చూపమని ఆయన ప్రబోధం. పాపం చేయరాదని, మంచిని సాధించమని, హృదయ పవిత్రతను పెంచుకోమని, ఆయన నిర్వచించిన బౌద్ధ మత సారాంశం.
ఎన్‌. రతన్‌ బాబు 
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ సభ్యులు 
(నేడు నెట్యం రతన్‌ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన అమ్రుదిత రచనలోని కొన్ని భాగాలివి)

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.