Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 17 Nov 2015 22:07:30 IST

విలన్‌గా భయపెడుతున్నా

విలన్‌గా భయపెడుతున్నా

 ఆ చారడేసి కళ్లు పాతికేళ్ల నుంచీ తెలుగు టెలివిజన ప్రేక్షకుల మనసుల్ని దోచేశాయి. సీరియల్సే శ్వాస, ధ్యాసగా దూసుకుపోతున్న ప్రీతినిగమ్‌
ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటీమణి. తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు...


ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉరుకులూ పరుగులే. సీరియల్స్‌ కూడా అంతే. టీఆర్‌పీ రేటింగ్‌ ప్రామాణికంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ సంఖ్య పెరగటం వల్ల బుల్లితెర రంగంలో ఉపాధి అవకాశాలు విరివిగా పెరిగాయి. టెక్నాలజీ మరిన్ని అద్భుతాలు చేస్తున్నది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన రోజుల్లో రెండున్నర రోజులకు ఒక ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తి చేసేవారు. ఇపుడలా కాదు.. ఒకే రోజులో మూడు ఎపిసోడ్స్‌ షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. అలాగే ఆర్టిస్టుల పని పెరిగింది. అందరూ ఎంత బిజీ అయిపోతున్నారంటే - ఈ సీరియల్స్‌ పనిలోపడిన నేను కూడా, ఇండసీ్ట్రలోకి మొన్నామధ్యనే వచ్చినట్లు ఫీలవుతున్నా. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే బుల్లితెరకొచ్చి పాతికేళ్లు పూర్తయ్యింది.
అదే నా అదృష్టం
మేం చిత్రగుప్త వంశానికి చెందిన వాళ్లం. కాయస్తా అనే సామాజిక వర్గం మాది. మా పూర్వీకులు దేశంలోనే చక్కని అడ్మినిసే్ట్రటర్స్‌గా పేరు ప్రతిష్ఠలు ఉన్నవారు. కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ నుంచి మా పెద్దవారు నిజాం రాజ్యంలోకి వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. నేను కూడా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. పక్కా హైదరాబాదీలా ఫీలవుతాను. మేం సుల్తాన్‌బజార్‌లో ఉండేవాళ్లం. అలనాటి అందమైన హైదరాబాద్‌ను చూడటం నా అదృష్టం. మా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేశారు. మా నాన్న స్టేజ్‌ ఆర్టిస్టు. మేం నలుగురం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. నేను మూడో అమ్మాయిని. అందరం స్టేజ్‌ ఆర్టిసులం. చిన్నప్పుడే కథక్‌, కూచిపూడి నేర్చుకున్నా. ఏడో తరగతిలోనే బిర్లాటెంపుల్‌ దగ్గర స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాను.
అలా యాక్టింగ్‌లోకి వచ్చాను
మా నాన్న తను స్వతహాగా స్టేజ్‌ ఆర్టిస్టు అయినా ఆడపిల్లలకు నాటకాలెందుకు అనేవారు. మా అమ్మ ‘పర్లేదు’ అని ప్రోత్సహించేది. స్కూల్‌డే్‌సలో ‘అశోక్‌ సామ్రాట్‌’ అనే నాటకంలో మహారాణి పాత్రలో నన్ను కాకుండా నా పంజాబీ స్నేహితురాలిని ఎంపిక చేశారు. ఆ విషయం తెలిసి నాకు అవకాశం రాలేదని ఏడ్చేశాను. డ్యాన్సు, నాటకాలు చేశాను కాబట్టి కెమెరా భయం ఉండేది కాదు. 1989లో డ్యాన్స్‌బేస్డ్‌ డ్యాక్యుమెంటరీ ఫిల్మ్‌లో చిన్నడైలాగ్‌ ఒకటి చెప్పాను. నటిగా అదే నా అరంగేట్రం. ఆ తర్వాత దూరదర్శన్‌లో ‘ఆరాధన’ (అప్పట్లో ఐదారు ఎపిసోడ్స్‌ ఉండేవి) అనే చిన్న సీరియల్‌కి కొరియోగ్రఫీ చేయడానికి వెళ్లాను. అక్కడ దర్శకులు నన్ను చూసి ‘నీ కళ్లు భావాల్ని పలికిస్తాయి. నటించు’ అన్నారు. అప్పుడు నాకు తెలుగు రాదు. భాష రాదని ఓ మూగమ్మాయి పాత్రను క్రియేట్‌ చేశారు. అందులో కళ్లతోనే నటించా. ‘ఆరాధన’తో నాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత అవకాశాలు పెరిగాయి.
ఆ రాగాలే నటిగా నిలబెట్టాయి
తొలిరోజుల్లో దూరదర్శన్‌లో సీరియల్స్‌ చేసేవాళ్లం. ఎక్కువగా ఆన్‌లైన్‌ సీరియల్స్‌ ఉండేవి. ప్రారంభంలో తెలుగు భాష రాకపోవడంతో ఇబ్బంది పడ్డాను. కెరీర్‌లో ఎదగాలని పట్టుదలతో భాష నేర్చుకున్నా. మంజులా నాయుడు గారు ‘రుతురాగాలు’ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సీరియల్‌లో హరిత పాత్ర పోషించాను. ఆ సీరియల్‌ ప్రసారమయ్యే సమయంలో ఎక్కడ చూసినా సాయంత్రం పూట టైటిల్‌ సాంగ్‌ వినిపించేది. ఇప్పటికీ చాలామంది ‘రుతురాగాలు’ సీరియల్‌ గురించి నాతో ప్రస్తావిస్తుంటారు. ‘రుతురాగాలు’ సీరియల్‌తో నా దశ తిరిగింది. బిజీ ఆర్టిస్టును అయ్యాను. ‘కస్తూరి’, ‘ఆడది’, ‘ఎండమావులు’, ‘కావ్యాంజలి’, ‘శాంతినివాసం’ ఇలా వరుసబెట్టి సీరియల్స్‌లో నటించాను.
విలన్‌గానూ భయపెడుతున్నా
‘నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయాలని’ మంజులానాయుడు గారు ‘కస్తూరి’ సీరియల్‌లో ప్రతినాయిక పాత్ర ఇచ్చారు. కొందరు ప్రేక్షకులు ఆ పాత్ర చూసి ‘మీరు పాజిటివ్‌ క్యారెక్టర్లు చేస్తే బావుంటుంది’ అనేవారు. ఆ తర్వాత ‘చంద్రముఖి’ సీరియల్‌తో విలన్‌గా పాపులర్‌ అయ్యాను. ఏడేళ్ల పాటు విలన్‌ వేషంలో కనిపించాను. ప్రస్తుతం ‘స్వాతిచినుకులు’ సీరియల్‌లో నెగటివ్‌ షేడ్‌ రోల్‌ చేస్తున్నా. ‘అమెరికా అమ్మాయి’, ‘శ్రావణసమీరాలు’ సీరియల్స్‌లో అమ్మ పాత్రలు పోషిస్తున్నా.
శ్యాంబెనగల్‌ చిత్రాల్లో నటించా
నేను హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితం. డిడి- 2 ఛానల్‌లో హిందీ సీరియల్స్‌లో చేశాను. ‘హరీబరీ’, ‘వెల్‌డన్‌ అబ్బా’ చిత్రాల్లో నటించాను. ఆయన దర్శకత్వంలో నటించాలంటే పెట్టి పుట్టాలి అనిపిస్తుంది. తెలుగు సినిమాల విషయానికొస్తే ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’, ‘సై’, ‘చాకలి ఐలమ్మ’, ‘జై తెలంగాణ’ చిత్రాల్లో నటించాను. ఈ మధ్య కాలంలో ‘త్రిపుర’ చిత్రంలో నటించా. హైదరాబాద్‌ పాతబస్తీ లోకల్‌ హిందీలో ‘స్టెప్నీ’ అనే సినిమాలో చేసే అవకాశం వచ్చింది. దానికి భలే పేరొచ్చింది.
అంతకంటే ఏం కావాలి?
జీవితం అనే ఓడలో మనం ఉన్నాం. అలలు చాలా వస్తాయి. దానికి భయపడితే ముందుకుపోలేం. భయంకరమైన అలలు వచ్చినపుడు కుటుంబం సపోర్టు ఉండాలి. నా జీవితంలో ఫ్యామిలీ సపోర్ట్‌ ఉంది కాబట్టే కెరీర్‌లో సక్సె్‌సఫుల్‌గా ముందుకు వెళుతున్నాను.

 నవ్య డెస్క్‌ 
ఫొటోలు: శివకుమార్‌ 

‘రుతురాగాలు’ సీరియల్‌లో హరీష్‌ పాత్రను పోషించిన నగేష్‌ను  పెళ్లి చేసుకున్నా. మాది ప్రేమ వివాహం. తను ఐఐఎమ్‌ పట్టభద్రుడు. నటనంటే ఆయనకు ఆసక్తి. అందుకే నన్ను బాగా అర్థం చేసుకుంటారు. అందరిలాగే ఇంట్లో గృహిణిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను. నాకు ఇద్దరు పిల్లలు. ఆదితిశ్రీ, ఆర్యన్‌. పిల్లలతో పాటు కెరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చినపుడు బాలెన్స చేసుకోలేక ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా ఆయన అండగా ఉండేవారు. దీనికే భయపడితే ఎలా అని ధైర్యం చెప్పేవారు. ఒకసారి నా కూతురు హాస్పిటల్‌లో ఉంది. మా అబ్బాయిని తీసుకుని షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లాను. ఆ రోజు ఏడుపు సీన్‌లో నటించాలి. ఒక పక్క కూతురు ఎలా ఉందో అనే బాధ, దీంతో పాటు ఎదురుగా ఆర్నెల్ల పసిబిడ్డ గుక్కపట్టి ఒకటే ఏడుపు. ఆ వేదనను వర్ణించలేను. జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో పాఠాలు నేర్పాయి.


నెగటివ్‌ పాత్రల్లో నటిస్తుంటే సత్యదూరంగా ఉందని తెలుస్తుంటుంది. మేం దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాలి. ఓ పాత హిందీ నటి ఇంటర్వ్యూలో విని సీరియల్‌ అంతా ఒకే కట్టు బొట్టుతో కనిపిస్తుంటా. ఇలా చేయటం వల్ల జనాలకి నోటెడ్‌ అవుతామనేది నా భావన. ‘చంద్రముఖి’ సీరియల్‌లోని యశోధర పాత్రను చాలా మంది ద్వేషిస్తారు. అంతగా విలనిజం వర్కవుట్‌ అయింది. ఓసారి రైల్లో వెళ్తుంటే ఓ పెద్దాయన ‘మా వైజాగ్‌కు వస్తే నిన్ను ఆడవారు కొట్టేస్తారు’ అన్నారు. అలాగే ఓ వేడుక కోసం విజయవాడకు వెళ్లాను. ఓ హోటల్‌ గదిలో దిగాను. అక్కడున్న ఆఫీస్‌ బాయ్‌ నన్ను చూసి నవ్వాడు. ఎందుకని అడిగితే ‘మా అమ్మమ్మ ‘చంద్రముఖి’ సీరియల్‌ చూసి మిమ్మల్ని తిడుతుంది’ అన్నారు. అలాగే వైజాగ్‌ బీచ్‌లో ఓ లఘుచిత్రంలో నటిస్తుంటే.. చేపలు అమ్మే వారు గుంపులు గుంపులుగా వచ్చారు. ‘మర్డర్స్‌ చేయిస్తుంది’ అంటూ నాతో గొడవ పెట్టుకున్నారు. మరి కొందరు ‘పాపం.. ఆవిడ నటి కదా’ అన్నారు. ఆ సీన్‌ చూసి వామ్మో.. నా పాత్రలు ఇంత ప్రభావం చూపిస్తున్నాయా? అనుకున్నాను. అలాగే ‘ఆడది’ సీరియల్‌ చేసేటప్పుడు సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాను. అక్కడికి వచ్చిన ఒకామె.. నా చెయ్యి పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఆడది’ సీరియల్‌లో రూప పాత్రలో నేను పడిన కష్టాలు చూసి ఆమె ఆ విధంగా ప్రతిస్పందించిందట. సీరియల్స్‌లో వైవిధ్యమున్న పాత్రలు చేస్తున్న నటిగా.. ప్రేక్షకుల నుంచి ఇలాంటి స్పందనే నేను కోరుకునేది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.