Nov 17 2015 @ 20:04PM

నలభై వసంతాల విశిష్ట నటుడు

పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి, దానిని రక్తి కట్టించగలిగిన అతికొద్దిమంది నటుల్లో డాక్టర్‌ మోహన్‌బాబు ఒకరు. 1975 నవంబర్‌ 22న ‘స్వర్గం-నరకం’ చిత్రంతో దాసరి నారాయణరావు పరిచయం చేసిన మోహన్‌బాబు చిరకాలంలోనే ఆర్టిస్టుగా అందరి మన్ననలు పొందగలిగారు. ముఖ్యంగా సన్నివేశానికి తగినట్లుగా డైలాగులు పలకడంలో తనకంటూ ఒక ఒరవడి ఏర్పరచుకున్నారు. నాయకునిగా, ప్రతినాయకునిగా, కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా... ఏ పాత్ర ధరించినా దానికి వన్నె చేకూర్చిన విశిష్టనటుడు మోహన్‌బాబు. అలాగే క్రమశిక్షణ పాటించడంలో మహానటుడు ఎన్టీఆర్‌ తర్వాత మోహన్‌బాబు పేరే చెప్పాలి.
 
‘స్వర్గం-నరకం’ చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు ఇంతవరకూ 520 చిత్రాలకు పైగా నటించారు, ప్రేక్షకుల్ని మెప్పించారు. 181 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్‌కింగ్‌గా కొలువయ్యారు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. సినీరంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
మోహన్‌బాబు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నలభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 22న కొన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.