
విజయవాడ/గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): అత్యంత వైభవోపేతంగా.. శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పండితులు నిశ్చయించిన శుభ ఘడియల్లో తంతును పూర్తిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. యాగశాలకు వచ్చిన ప్రధాని నుదుట తిలక దిద్దిన వేద పండితులు.. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పండితులు అందించిన మంగళద్రవ్యాలను ప్రధాని.. 12.37 నిమిషాలకు హోమగుండంలో వేశారు. 12.38- 12.42 నిమిషాల మధ్య శిలాన్యాసం రత్నన్యాసం నిర్వహించారు. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. అనంతరం వాస్తు దోషాల నివారణతోపాటు, రాజధానికి ఆకర్షణ, బలాన్ని చేకూర్చి, లక్ష్మీప్రదంగా ఉండేందుకు హరిద్వార్ నుంచి తీసుకొచ్చి, కనకదుర్గమ్మ సన్నిధిలో 9రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన 21యంత్రాలతో శాస్ర్తోక్తంగా పవిత్రఘాతంలో శిలాన్యాసం చేశారు. అనంతరం వేదపండితులు రాజధాని నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలంటూ ఆశీస్సులు పలికారు. తదనంతరం 12:45కు మోదీ, నరసింహన్, చంద్రబాబు, కేసీఆర్, వెంకయ్యనాయుడు తదితరులు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం వారు వేదిక వద్దకు వెళ్లారు. ఈ క్రతువు మొత్తాన్ని పది నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు.