desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 21 2015 @ 23:53PM

ప్రజాసేవకుడైన ప్రభుత్వాధికారి

ఉన్నత భావాలతో, సమాజ మార్పును ఆశించిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ బ్రహ్మచారిగానే తన జీవితాన్ని గడిపారు. భార్య, పిల్లలు తన కార్యాచరణకు ప్రతిబంధకంగా ఉండకూడదనేది ఆయన భావన. కుటుంబ సభ్యులు లేనంత మాత్రాన ఆయన ఏనాడు ఒంటరి వాడిననుకోలేదు. నిరాదరణకు గురైన ప్రజలు, కూలీలు, దళితులు మొదలైన బలహీన వర్గాల వారు తన కుటుంబమే అని ఆయన అనుకునేవారు. పేద ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తి ఎప్పటికీ ఒంటరి వాడు కాడు.

ప్ర‌స్తుత మన భారతావనిలో వెయ్యి రూపాయల నుంచి లక్షలు సంపాదించే ఉద్యోగులు, కార్మిక, కర్షకులు ఏ రంగంలోనివారైనా తమకు ఉన్నంతలో గొప్పగా జీవించాలని, తమ కుటుంబ సభ్యులకు సకల సౌకర్యాలు సమకూర్చుకోవాలని సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు ఆలోంచిచే రోజులివి. ఇటువంటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగిగా అత్యున్నతమైన పదవులను నిర్వహించి ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోకుండా సామాన్యుడిగా జీవించిన మహోన్నత వ్యక్తి ఎస్‌ఆర్‌ శంకరన్‌. ఆయన గురించి మాట్లాడుకోవడమంటే ఒక నిజాయితి, మానవీయత, నైతికత, పేదల పక్షపాతం గురించి మాట్లాడు కోవడమే అవుతుంది. ఆ కోవలో అట్టడుగున ఉన్న ప్రజలు ముఖ్యంగా దళితులు, గిరిజనులు బాగుపడితేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని విశ్వసించిన వ్యక్తి శంకరన్‌. నిరుపేదల జీవితాలను మార్చడం తన ధ్యేయంగా తీసుకొని, ఆచరించి, కార్యాచరణను రూపొందించిన మానవతామూర్తి శంకరన్‌. ఈనాటి సమాజంలో ఒక సామాన్యడు ఎమ్మార్వో, ఆర్డీఓ, లేదా కలెక్టర్‌లాంటి ఉన్నతాధికారులను కలసి తమ గోడును వినిపించుకునే అవకాశం దొరకడం ఒక సమస్యగా ఉంది. అలాంటిది - మాసిన బట్టలతో బడుగు వర్గాల ప్రజలు తనను కలవడానికి ఎవరొచ్చినా వెంటనే తన దగ్గరికి పంపమని ఆదేశాలు జారీ చేసిన ఉదార స్వభావి ఎస్‌ఆర్‌ శంకరన్‌.

 
                   పట్టుదల, విధి నిర్వహణలో ఎదుటివారికి ఆదర్శంగా నిలిచిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ తమిళనాడులోని తంజావూరు దగ్గరలో ఉన్న సిరిగలత్తూరులో 1934 అక్టోబర్‌ 22న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1954లో డిగ్రీని పూర్తి చేసి 1957లో ఐఏఎ్‌సగా సివిల్‌ సర్వీ్‌సలో చేరారు. మొదటి నుంచి అభ్యుదయ భావజాలం కలిగిన శంకరన్‌ తను చేపట్టిన పదవులను చిత్తశుద్ధితో నిర్వర్తించి ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. విద్య పట్ల ఆయనకు గల ముందుచూపుతో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను ప్రైవేటు హాస్టళ్ళను దీటుగా నడపాలని 1984లో సూచించారు. తన సొంత పనులకు ఆయన ఏనాడు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకపోవడం ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. ఉన్నతభావాలు, సమాజమార్పును ఆశించిన శంకరన్‌ బ్రహ్మచారిగానే తన జీవితాన్ని గడిపారు. భార్య, పిల్లలు తన కార్యాచరణకు ప్రతిబంధంగా ఉండకూడదనేది ఆయన భావన. కుటుంబ సభ్యులు లేనంత మాత్రాన ఆయన ఏనాడు ఒంటరి వాడిననుకోలేదు. నిరాదరణకు గురైనప్రజలు, కూలీలు, దళితులు మొదలైన బలహీన వర్గాల వారు తన కుటుంబమే అని ఆయన అనుకునేవారు. కూలీనాలీ చేసుకొని తమ పిల్లల్ని పెద్ద చదువులు చదివించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాల నుంచి వచ్చి పోటీ పరీక్షలలో నెగ్గి ఉన్నతాధికారులు ఇతర ఉద్యోగులుగా వృద్ధిలోకి వచ్చిన వారిని చూసి శంకరన్‌ ఎంతో తృప్తిపడేవారు. పేద ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తి ఒంటరివాడు ఎప్పటికీ కాడు అని ఎస్‌ఆర్‌ శంకరన్‌ విషయాన్ని ప్రొ. హరగోపాల్‌ ఎన్నో సందర్భాలలో ప్రస్తావించేవారు. 
 
                       ఎస్‌ఆర్‌ శంకరన్‌ అంటే అడవి బిడ్డలకు అత్యంత ప్రేమాభిమానాలు అనడం ఏ మాత్రం యాదృచ్ఛికం కాదు. అందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. వారి అభ్యున్నతి ఆయన జీవిత లక్ష్యం. ఆ దిశగా ఆయన అవిరళ కృషిచేశారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల రూపకల్పన ఆయన కలలను కొంతవరకు సాకారం చేసింది. అందుకే కావచ్చు 1989లో గుర్తేడు ప్రాం తంలో నక్సల్స్‌కుబందీగా వున్నప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వ్యవహరించారు. నిజాయితీగా వాస్తవాల్ని అర్థంచేసుకున్నారు. ఇతర యువ ఐఏఎ్‌సలతో బాటు శాసనసభ్యుడు బాలరాజ్‌ సహా వారి బందీ నుంచి క్షేమంగా తిరిగి రావడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ సంచలనం ఆయనను అన్నలకే పెద్దన్నగా నిలబెట్టాయి. అంతేగాక 2004లో జరిగిన చర్చల్లో శంకరన్‌ ప్రధాన పాత్ర పోషించారు. అయితే అవి సఫలం కాకపోవడం తనను జీవితాంతం బాధపెట్టినవైనంగా ఆయన అభివర్ణించుకునేవారు.
1987లో పాలమూరు జిల్లా ఆకలి కేకలతో అలమటిస్తున్నప్పుడు రెండున్నర సంవత్సరాలపాటు కూలీ జనాలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి శంకరన్‌ చూపిన చొరవ మరువరానిది. ఇప్పటికీ పాలమూరు జిల్లా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకున్నారంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇలాంటి వ్యక్తిత్వంగల అధికారులు చాలా అరుదు కదా. అధికారుల్లో తాము ప్రజాసేవకులమనే భావన రావాలని శంకరన్‌ కోరిక.
శంకరన్‌ది అతి సామాన్యమైన జీవితం. ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు కన్నతల్లి మరణిస్తే సోదరునితో కలిసి ఒక అటెండర్‌ సాయంతో ఆమెకు అంత్యక్రియలను నిర్వహించారు. ఇది ఆయన కు మాత్రమే చెల్లింది. ఇలాంటి ఉదంతాలెన్నో ఎస్‌ఆర్‌ శంకరన్‌ జీవితంలో కోకొల్లలు. ఈ నిస్వార్థ మానవతా మూర్తి తన జీవితాన్ని 2010 అక్టోబర్‌ 7వ తేదిన చాలించారు. ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి గుర్తుగా పాలమూరు జిల్లా ప్రజలు 2011, అక్టోబర్‌ 7వ తేదిన వనపర్తి పట్టణంలో పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహకారంతో జనశ్రీ సంస్థ ఆధ్వర్యంలో శంకరన్‌ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్‌ హరగోపాల్‌, బొజ్జాతారకం, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరై ఆయనకు నివాళులర్పించారు. శంకరన్‌ భావజాలాన్ని పాలమూరు ప్రజలకు మరోసారి తెలియజేశారు. తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు, జాక్‌ చైర్మన్‌ కోదండరాం, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ, వనపర్తిలో ఎస్‌.ఆర్‌. శంకరన్‌కు అంజలి ఘటించారు. రాష్ట్రంలో వనపర్తి తర్వాత పాలమూరు జిల్లాలోని, గట్టు, మల్డకల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, నెల్లూరుజిల్లాలోనూ ఆయన శిలావిగ్రహాలు స్థాపించడం అభినందించదగ్గ విషయం.
 
                        సాధారణంగా శిలా, సిమెంట్‌విగ్రహాలు రహదారి కూడళ్ళలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజాదరణ ఉన్నా లేకపోయినా తమ నిర్ణయమే ప్రజల నిర్ణయంగా భావిస్తూ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ శంకరన్‌ విషయంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందకు వచ్చి ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలా శంకరన్‌ విగ్రహాలు నెలకొల్పిన వారు ఏదో సందర్భంలో ఎస్‌ఆర్‌ శంకరన్‌ను కలిసిన వారు కొందరైతే, ఆయనను చూడకుండా, కలవకుండా కేవలం ఆయన మానవీయతను, నిజాయితీని విని విగ్రహాలు పెట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. చరిత్రలో ఒక ఐఏఎస్‌ అధికారికి విగ్రహాన్ని పెట్టడమనేది ఇదే ప్రథ మం కావచ్చు. ఆయన స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో నడుస్తూ శంకరన్‌ లక్ష్య సాధనకు నేటి తరం కృషి చేస్తుందని ఆశిద్దాం. బతికున్ననాడు శంకరన్‌ సన్మానాలు, సత్కారాలను తన దారికి రానివ్వలేదు. అయితే ఆయన భావజాలాన్ని ఈ సంస్మరణ సభల ద్వారానైనా కొనసాగించడం సముచితంగా ఉంటు ంది. ఆయన జీవితం ఒక పాఠ్యాంశంగా రూపుదిద్దుకోవాలి.
 జి. రాజు 
తెలంగాణ విద్యావంతుల వేదిక 
(నేడు ఎస్‌.ఆర్‌. శంకరన్‌ 81వ జయంతి)