Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Wed, 21 Oct 2015 13:23:30 IST

అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'జయసింహ'

అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న జయసింహ

తెలుగు చిత్రసీమలో అరుదైన చిత్రాలను నిర్మించిన సంస్థ ఎన్.ఏ.టి.... ఆ సంస్థను నిలిపిన చిత్రం, జనం మదిని గెలిచిన చిత్రం 'జయసింహ'... నేటితో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న 'జయసింహ' విశేషాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకుందాం...
 
నటరత్న యన్టీ రామారావు నెలకొల్పిన తొలి నిర్మాణ సంస్థ 'నేషనల్ ఆర్ట్ థియేటర్స్'... యన్టీఆర్ కాలేజ్ లో చదువుకొనే రోజుల్లోనే తమ నాటక సంస్థకు 'నేషనల్ ఆర్ట్ థియేటర్స్' అని నామకరణం చేశారు... ఆ తరువాత అదే బ్యానర్ పై పలు నాటకాలు ప్రదర్శించారు... అందువల్లే యన్టీఆర్, ఆయన సోదరుడు ఎన్.త్రివిక్రమరావు తమ నిర్మాణ సంస్థకు 'నేషనల్ ఆర్ట్ థియేటర్స్' అని పేరు పెట్టుకున్నారు... తొలి ప్రయత్నంగా నందమూరి సోదరులు 'పిచ్చిపుల్లయ్య' తీశారు, తరువాత 'తోడుదొంగలు' తెరకెక్కించారు... ఈ రెండు చిత్రాలు నందమూరి సోదరులకు నిర్మాతలుగా మంచి పేరు సంపాదించి పెట్టాయే కానీ, ఆర్థికపుష్టి కలిగించలేకపోయాయి... ఎన్.ఏ.టి సంస్థ తమ మూడో ప్రయత్నంగా జానపద చిత్రం 'జయసింహ'ను నిర్మించింది... 1955 అక్టోబర్ 21న దసరా కానుకగా విడుదలయిన 'జయసింహ' అపూర్వ విజయం సాధించింది...
 
'జయసింహ' కథ విషయానికి వస్తే- రుద్రసింహుడు తన అన్నను చంపి సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడు... అందుకు అడ్డుగా ఉన్న అన్న కొడుకు జయసింహను కూడా మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూంటాడు... అయితే రుద్రసింహుని తనయుడు విజయసింహ మాత్రం అన్న జయసింహ అంటే ప్రాణం పెడుతుంటాడు... పినతండ్రి రాజ్యం కోసం తనను మట్టు పెట్టాలని చూస్తున్నాడని తెలిసి జయసింహ రాజ్యం వీడి పరాయి రాజ్యం వెళతాడు... అక్కడ అతణ్ణి రాజకుమారి, మరో అమ్మాయి కాళింది ప్రేమిస్తారు... చివరకు రుద్రసింహుడు, జయసింహను చంపాలని వస్తాడు... అయితే పినతండ్రిపై కత్తిదూయడానికి జయసింహ అంగీకరించడు... జయసింహను చంపబోతున్న రుద్రసింహుని అతని కొడుకు విజయసింహుడే చంపడంతో కథ ముగుస్తుంది...
 
'జయసింహ' చిత్రంలో జయసింహగా యన్టీఆర్, రుద్ర సింహగా ఎస్వీ ఆర్, విజయసింహగా కాంతారావు నటించారు... కాళింది పాత్రలో అంజలీదేవి, రాజకుమారిగా వహిదారెహమాన్, కాళింది తండ్రిగా గుమ్మడి, ఆమె అన్నగా రేలంగి, జయసింహుని పినతల్లిగా ఋష్యేంద్రమణి అభినయించారు... మిగిలిన పాత్రల్లో మహంకాళి వెంకయ్య, రాజనాల, కేవీఎస్ శర్మ, వంగర నటించారు... వహిదారెహమాన్ కు నాయికగా ఇదే తొలి చిత్రం... నిజానికి వహిదాను ఈ చిత్రంలో నాయికగా ఎన్నుకున్న తరువాతే 'రోజులు మారాయి'లో ఆమెతో నృత్యగీతం చేయించారు... 1955లోనే ఈ రెండు చిత్రాలు విడుదలై వహిదా రెహ్మాన్ కు విపరీతమైన క్రేజ్ ను సంపాదించి పెట్టాయి... ఆ తరువాత హిందీ చిత్రసీమలో ఆమె స్థిరపడ్డారు...
 
'జయసింహ' చిత్రానికి మాటలు, పాటలు జూనియర్ సముద్రాల సమకూర్చారు... టి.వి.రాజు సంగీతం సమకూర్చారు... ఎమ్.ఎ.రెహమాన్ కెమెరా పనితనం చిత్రానికి అందం తెచ్చింది... ఈ చిత్రానికి నిర్మాణనిర్వహణ ఎ.పుండరీకాక్షయ్య , యన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత... డి.యోగానంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది... ఈ సినిమాలోని పాటలు ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి... ఇందులో యన్టీఆర్ ఓ డ్రీమ్ సీక్వెన్స్ లో అర్జునునిగా కనిపించడం మరో విశేషం...
'జయసింహ' చిత్రం అఖండ విజయం సాధించింది... ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది... విజయవాడ లక్ష్మి టాకీసు, గుంటూరు ఆనంద మహల్ లో ఈ సినిమా 169 రోజులు ఏకధాటిగా ప్రదర్శితమయింది... బెంగళూరులోని జయశ్రీ థియేటర్లో 175రోజులు ఆడింది... 1955లో అత్యధిక రోజులు ప్రదర్శితమై ఆ యేడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది 'జయసింహ'... అరవై ఏళ్ళ కిందటే 'జయసింహ' చిత్రం విజయవాడలో లక్షా పాతికవేలు వసూలు చేసి అంతకు ముందున్న 'పాతాళభైరవి' రికార్డును బద్దలు చేసింది... 'జయసింహ' జైత్రయాత్ర ఆ తరువాత కూడా పలు కేంద్రాలలో విజయవంతంగా సాగింది...

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.