Oct 1 2015 @ 12:39PM

నేటితో అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'దొంగరాముడు'

తెలుగు చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల్లో 'అన్నఫూర్ణ' స్థానం ప్రత్యేకమైనది... ఈ సంస్థ వెలుగు చూసి నేటితో అరవై ఏళ్ళవుతోంది... అన్నపూర్ణవారి తొలిచిత్రంగా 'దొంగరాముడు' అరవై ఏళ్ళ క్రితం తెలుగువారిని విశేషంగా అలరించింది...
అక్కినేని నాగేశ్వరరావుకు చిత్రసీమలో అడుగు పెట్టక ముందు నుంచీ దుక్కిపాటి మధుసూదనరావు గైడ్, ఫిలాసఫర్... ఏయన్నార్ తో వైవిధ్యమైన పాత్రలు పోషింపచేయాలని దుక్కిపాటి తపించేవారు... ఆ తపనతోనే ఏయన్నార్ ను ఛైర్మన్ గా చేసి తాను మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ 'అన్నపూర్ణ' సంస్థను స్థాపించారు దుక్కిపాటి... ఈ సంస్థకు ఈ పేరు పెట్టడానికి కారణం- దుక్కిపాటి సవతితల్లి, ఆయనను పెంచి పెద్ద చేశారు. ఆమె పేరు మీదనే సంస్థకు 'అన్నపూర్ణ' అని నామకరణం చేశారు. ఇక ఏయన్నార్ అర్ధాంగి పేరు కూడా అన్నపూర్ణనే కావడం విశేషం... ఆ విధంగా అన్నపూర్ణ సంస్థ రూపొందింది... తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి దర్శకత్వంలో 'దొంగరాముడు' చిత్రాన్ని నిర్మించారు... ఈ చిత్రం 1955 అక్టోబర్ 1న విడుదలయి విజయఢంకా మోగించింది...
అంతకు ముందు విజయా సంస్థకు 'పాతాళభైరవి' వంటి సూపర్ హిట్ ను అందించిన కేవీ రెడ్డి కొన్ని కారణాలవల్ల విజయా-వాహినీ సంస్థకు కాకుండా బయటి చిత్రాలకు పనిచేయాలని నిర్ణయించారు... ఆ సమయంలోనే దుక్కిపాటి, అక్కినేని వెళ్ళి కేవీ రెడ్డిని కలసి, తమకు సినిమా రూపొందించమని కోరారు... అప్పటికే 'పెద్దమనుషులు'తో డి.వి.నరసరాజును రచయితగా పరిచయం చేసిన కేవీరెడ్డి ఆయనతోనే 'దొంగరాముడు'కు రచన చేయించారు... ఈ సినిమా నరసరాజుకు మంచి పేరు సంపాదించి పెట్టింది...
'దొంగరాముడు' కథ విషయానికి వస్తే- రాముడు చిన్నతనం నుంచీ దొంగగా ముద్రపడి ఉంటాడు. ఓ నేరంలో జైలుకు వెళతాడు. అతని చెల్లెలు అనాథ శరణాలయంలో చదివి పెరిగి పెద్దదవుతుంది. రాముడు జైలు నుండి వచ్చాక ఓ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. రామునికి ఓ కూరగాయలు అమ్మే అమ్మాయితో నేస్తం. ఆమెపై మరో రౌడీ మనసు పారేసుకొని ఉంటాడు. అతడు రాముణ్ణి ఓ కేసులో ఇరికించి జైలుకు పంపిస్తాడు. కూరగాయలమ్మాయి చాకచక్యంతో రాముడు నిర్దోషిగా నిలుస్తాడు... కూరగాయల అమ్మాయిగా సావిత్రి, రౌడీగా ఆర్. నాగేశ్వరరావు, రాముని చెల్లెలుగా జమున నటించారు... జమున భర్తగా జగ్గయ్య, షావుకారుగా రేలంగి, అతని భార్యగా సూర్యకాంతం అలరించారు...
కేవీ రెడ్డి తన చిత్రాలను పక్కా ప్రణాళికతో రూపొందించేవారు... ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయాలని ముందే ప్లాన్ చేశారు... అక్టోబర్ 2న గాంధీ జయంతి కాబట్టి, ఈ సినిమాలో సందర్భాను సారంగా గాంధీజీ గొప్పతనం వివరిస్తూ ఓ పాటను కూడా పెట్టడం విశేషం...
'దొంగరాముడు' చిత్రం ఆరంభంలోనే పిల్లల కథ చాలాసేపు సాగుతుంది... అది ఈ నాటి ప్రేక్షకులకు కాసింత బోర్ కొడుతుంది కానీ, ఆ తరువాత కథ సాగే తీరు భలేగా ఆకట్టుకుంటుంది... ఓ వైపు దొంగరాముని కథ, మరోవైపు అతని చెల్లెలు కథ సమాంతరంగా సాగుతూ ఉంటాయి... పేదపిల్ల అయినా దొంగరాముని చెల్లెలును ఓ ధనవంతుల అబ్బాయి ప్రేమించి పెళ్ళి చేసుకోవడం కథను రక్తి కట్టిస్తుంది... ఓ వైపు నాగేశ్వరరావు, సావిత్రి జంట- మరోవైపు జమున, జగ్గయ్య జోడీ కూడా 'దొంగరాముడు'కు కళ తీసుకువచ్చారని చెప్పాలి...
'దొంగరాముడు' చిత్రాన్ని తమిళంలోనూ రూపొందించారు. అక్కడ 'తిరుట్టు రామన్'గా ఈ సినిమా విడుదలై విజయం సాధించింది. అప్పటి నుంచీ అన్నపూర్ణ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో పలు ద్విభాషా చిత్రాలను నిర్మించింది... 'దొంగరాముడు' చిత్రానికి సముద్రాల సీనియర్ పాటలు, పెండ్యాల సంగీతం కూడా దన్నుగా నిలిచాయి... అరవై ఏళ్ళ క్రితం విడుదలైన 'దొంగరాముడు' చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది... ఈ సినిమా విజయంతో తెలుగునాట 'అన్నపూర్ణ' సంస్థ వెలిసింది... ఆ తరువాత ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను నిర్మించింది... అన్నపూర్ణకు బీజం వేసిన చిత్రంగా 'దొంగరాముడు' చరిత్రలో నిలిచింది... ఈ నాటికీ ఈ చిత్రంలోని పలు పాటలు వీనులవిందు చేస్తూనే ఉండడం విశేషం...