Sep 9 2014 @ 01:32AM

తపోధనుడు.. హుస్సేన్‌షాపిఠాపురం: ఉపనిషద్రూపంగా వచ్చిన ధ్వని ఆయన చేతిలో అక్షరరూపంలో దాల్చింది.. ఆశ్రయించిన భక్తకోటిని ముముక్షువులుగా మార్చిన తపోధనుడు.. ఆదర్శప్రాయమైన జీవితానికి పెట్టింది పేరైన విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్మాత్మిక పీఠం సప్తమి పీఠాధిపతి హుస్సేన్‌షా 109వ జయంతి ఈ నెల9వ తేదిన జరగనున్నది. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలోని పీఠం ఆవరణలో మహాసభ నిర్వహించనున్నారు. ఆర్ష, సూఫీ సిద్ధాంతాల స్ఫూర్తితో మానవ శ్రేయస్సుకు, విశ్వమానవ శాంతికి కృషి చేస్తున్న విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్మాత్మిక పీఠం ఆది పీఠాధిపతి మదీన్‌ కబీర్షా 1472లో భారతదేశానికి వచ్చి పిఠాపురంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం నవమ పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ఆలీషా పీఠాధిపత్యం వహిస్తున్నారు.ఈ పీఠాధిపతుల్లో సప్తమ పీఠాధిపతిగా బ్రహ్మర్షి హుస్సేన్‌షా 10.02.1945న పీఠాధిపత్యం వహించి 24.09.1981 వరకూ పీఠాన్ని నడిపించారు. ఆదర్మప్రాయమైన జీవితానికి నిలువటద్దంగా నిలిచే హుస్సేన్‌షా 09.09.1905న బ్రహ్మర్షి ఉమర్‌ఆలీషా, అగ్బరున్నీసాబేగంలకు జన్మించారు. అయిదేళ్ల వరకూ రాజమండ్రిలో ఉన్న ఈయన పిఠాపురం రాజావారి హైస్కూల్‌లో విద్యను అభ్యసించారు. ఎనిమిదో తరగతి చదువుతుండగా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి ఆకర్షించబడి చదువు మానివేశారు. తండ్రి సలహా మేరకు బందర్‌ నేషనల్‌ కళాశాలలో చేరి చదువు కొనసాగించారు. పన్నాల సుబ్రహ్మణ్యశాసి్త్ర వద్ద సంస్కృత విద్యను అభ్యసించారు. 1945లో పీఠాథిపత్యం వహించిన హుస్సేన్‌షా పలువురు భక్తులను ముముక్షువులుగా మార్చారు. ఈయన రచించిన షా తత్వం అభౌతికమైన వాక్సందేశం. ఉపనిషద్రూపంగా వచ్చిన ధ్వని. ఇది మతమతాంతరములపై విమర్శలు లేకుండా సర్వమత సమ్మతమైన మానవ వ్యక్తిత్వ పరిణామంపై మోసి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనలపై వచ్చిన భావపరిణామంగా చెబుతారు. ఈయన రచించిన గ్రంథాల్లో మానవుడు మొదలు అస్వాసాంతం వరకూ 79 అధ్యాయాలు ఉన్నాయి. రచయితగా, పీఠాధిపతిగా పీఠం చరిత్రలో ఈయనదొక ప్రత్యేక ముద్రగా చెబుతారు.
ఏటా అవార్డుల ప్రదానం...సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి హుస్సేన్‌షా పేరున ఏటా డాక్టర్‌ ఉమర్‌ఆలీషా సాహితి సమితి ఆధ్వర్యంలో హుస్సేనేషా కవి పురస్కారాలు అందచేస్తున్నారు. 2001 నుంచి ఇప్పటి వరకూ ప్రతీ హుస్సేన్‌షా కవి పురస్కారాలను ప్రకటించడంతో పాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో జనవరి 23న నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. 2014లో ఈ పురస్కారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ మేడసాని మోహన్‌కు అందించారు. 2013లో సమాచార కమిషనర్‌ పి.విజయబాబు, 2012లో మండలి బుద్దప్రసాద్‌లకు అందించగా అంతకుముందు కోవెల సుప్రసన్నాచార్యులు, ఆచార్య చిత్రకవి ఆత్రేయ, వంశీ రామరాజు, తుర్లపాటి కుటుంబరావు, షేక్‌ మస్తాన్‌, డాక్టర్‌ ఆవుల మంజులత, రావూరి భరద్వాజ, ఆచార్య ఎన్‌.గోపి, ఆచార్య షేక్‌ముస్తాఫా, ఆచార్య కోలవెన్ను మలయవసిని, డాక్టర్‌ అద్దేపల్లి రామ్మోహనరావులు పురస్కారాలు అందుకున్నారు.
9న మహాసభ.. సప్తమ పీఠాధిపతి 109వ జయంతిని పురస్కరించుకుని పిఠాపురం పట్టణ శివారులో ఉన్న విశ్వవిజ్ఞాన విద్యా ఆద్మాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 9గంటలకు జన్మదినోత్సవ మహాసభ నిర్వహించనున్నారు. పీఠాధిపతి ఉమర్‌ఆలీషా అధ్యక్షతన జరిగే సభలో హుస్సేన్‌షా విశిష్టత, ఆయన రచించిన గ్రంథాలపై వక్తలు ప్రసంగిస్తారని పీఠం కన్వీనర్‌ పేరూరి సూరిబాబు తెలిపారు. అనంతరం భక్తులనుద్దేశించి పీఠాధిపతి అనుగ్రహభాషణ చేస్తారని చెప్పారు.