Sep 13 2015 @ 23:49PM

పాలేళ్ళను ప్రగతి పథంలో నడిపించిన భీమన్న

‘‘వ్యక్తుల వికాసమే జాతి. జాతుల వికాసమే వసుధ. వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం’’ అన్నారు మహాకవి, కళాప్రపూర్ణ, పద్మవిభూషణ్‌ బోయి భీమన్న. ఆయన సాహిత్యం బహుముఖంగా- కాలానుగుణంగా ప్రబోధాత్మకంగానూ ఆత్మాశ్రయంగానూ సాగింది. తొలి రచనలలో ప్రణయమూ, దేశభక్తీ ప్రధానంగా కనిపిస్తాయి. తర్వాత సంఘ సంస్కరణ దిశలో ఆయన ఆలోచనలు సాగాయి. అనంతరం మధురభక్తి, మార్మికత ఆయన రచనలలో గూడు కట్టుకున్నాయి. ‘రసాద్వైతం’, ‘శివ సోషలిజం’, ‘పులీ నక్కా గొర్రేయిజం’ వంటి సిద్ధాంత ప్రతిపాదనలూ ఆయన చేశారు.
 
తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలూ ఆయనకు కరతలామలకాలు. ఇంగ్లీష్‌లోనూ ఆయన పద్యాలు రాశారు. పాలేరు నాటకం (1940) ఆయనను విలక్షణ రచయితగా నిలబెట్టింది. ‘‘నాటక సాహిత్య మకుటం భీమన్న పాలేకు నాటకం’’ అన్నారు ‘సవేరా’. ముద్రణకు ముందే ఆ నాటకం ఎన్నో చోట్ల ప్రదర్శించారు. ఆ నాటకానికి 75 సంవత్సరాలు. నిమ్నజాతులనబడే వారిపై ఆ నాటకం చూపిన ప్రభావాన్ని స్మరించుకోవటం ఈ వ్యాస లక్ష్యం.
 
‘పాలేరు’ నాటకం రాసి మాలమాదిగ పల్లెలలో దానిని ప్రదర్శింపజేసి స్వయంగా పర్యవేక్షిస్తూ కొన్ని తరాల పాటు పాలేళ్ళను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఒక నూతన సమాజావిర్భావానికి మూలస్తంభంగా నిలిచారు భీమన్న. విద్యకు దూరం పెట్టబడిన కులంలో పుట్టి ప్రభుత్వ లేబరు స్కూలులో చదివి, స్వయంకృషితో కళాప్రపూర్ణుడైన భీమన్న ‘చదువు’ను తన జాతికి ఆయుధంగా ఇచ్చారు. అంతవరకు సామాజిక సమస్యలపైన - కన్యాశుల్కం, వరవిక్రయం, వేశ్యా ప్రియత్వం, బహు భార్యత్వం వంటి సమస్యలపైనా నాటకాలు వచ్చాయి గాని కుల సమస్యను ఎవరూ తీసుకోలేదు. వారికి చదువు నేర్పే దిశలో కొంత ప్రయత్నం జరిగింది గానీ వారికి స్వావలంబన మార్గాన్ని చూపే ప్రయత్నం జరగలేదు. మాలమాదిగ పిల్లలు పాలేరు తనాలు మానేసి చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచనను సమర్థంగా ఆ ప్రజలకు అందించారు భీమన్న.
 
ఒక పాలేరు కుర్రవాడు (వెంకన్న) కామందు దౌర్జన్యాల నుంచి తప్పించుకుని పారిపోయి ఆ ఊరి బడిపంతులు (ఉపకారి) సహాయంతో పట్టణంలోని అనాధ శరణాలయంలో చేరి చదువుకుని పరీక్షలు పాసై డిప్యూటీ కలెక్టరు కావటం పాలేరు నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. జనాకర్షణ కోసం ప్రేమ, వర్ణాంతర వివాహం - పోలీసు కేసులు వంటి సంఘటనలు నాటకీయంగా జతపరిచారు. పాలేరు కుర్రవాడు వెంకన్న చదువుకుని వెంకటేశ్వరరావుగా ఎదగటం, ఉన్నతాధికారిగా రావటం జనాన్ని ఆశ్చర్యపరిచింది. పాలేళ్ళంతా చదువుకుని ఉద్యోగస్థులైపోతే తమ పొలాన్ని ఎవరు చేస్తారని కామందులకు భయం పట్టుకుంది.
 
మొదటగా ఈ నాటకం రిహార్సళ్ళు రాజోలులో గొల్లచంద్రయ్య గారి హరిజన హాస్టలు విద్యార్థులతో చేయించారు. చంద్రయ్య గారు ప్రముఖ సంస్కర్త. హరిజన నాయకులూను. భీమన్నకు మామగారు. మాల మాదిగ పేటలలో అతి గోప్యంగా పాలేరు నాటక ప్రదర్శనలు జరిగేవి. నాటకం చూసిన తల్లులు, తండ్రులు, ఆ నాటకంలో తమను తాము చూసుకున్నారు. ఆ రోజుల్లో భీమన్న కాంగ్రెస్‌ వారితో ఉండేవారు. అయినప్పటికీ ఆయనపై డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గారి ప్రభావం బలంగా పడింది. మార్క్స్‌ సిద్ధాంతాలనూ ఆయన అప్పటికి బాగా ఆకళింపు చేసుకున్నారు. భూస్వా మ్య వ్యవస్థలో- ఉత్పత్తి రంగంలో కులం పాత్రనూ - శ్రమ దోపిడీనీ గ్రహించారు. ఆ విషయాలన్నీ దోపిడీకి గురి అవుతున్న ప్రజలకు అతి సరళంగా చెప్పడానికి నాటక ప్రక్రియను ఎన్నుకున్నారు. సమస్యనూ-పరిష్కార మార్గాన్నీ ఆ వర్గాలకు బలంగా అందించారు.
 
పాలేరు నాటకం చూసిన తల్లులు తమ పిల్లలు కూడా చదువుకుని వేంకటేశ్వర రావు లాగా తయారవ్వాలని ఆశపడ్డారు. ఇళ్ళలో దెబ్బలాడి మరీ పిల్లలను చదువులకు పంపారు. తండ్రులు ఊరి కామందుల దాష్టీకానికి జడిసి పిల్లలను బలవంతంగా పాలేరు తనానికి పెట్టిన సందర్భాలలో చాలామంది పిల్లలు ఇళ్ళనుంచి పారిపోయి ఆనాధ శరణాలయాలలోనో మరెక్కడో చేరి చదువుకున్నారు. ఈ విధంగా ‘పాలేరు’ నాటకం కొన్ని తరాల ప్రజలను చదువుల వైపు మళ్ళించింది. పాలేరు వెంకన్న కంటె తామే తండ్రి చేత ఎక్కువ దెబ్బలు తిన్నామని ఇప్పటికీ ఆ తరం వారు చెప్పుకుంటూ ఉంటారు. మొదట్లో నాటకంలోని సంభాషణలు వాస్తవంగా ఉన్నవి ఉన్నట్టే చెప్పించారట. పాలేళ్ల పట్ల కామందులు ఉపయోగించే భాషలో బూతు పదాలు మరీ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందిగా అనిపించి క్రమేపీ వాటి తీవ్రత తగ్గిస్తూ వచ్చారట. ముద్రణకు వెళ్ళే నాటికి అసభ్య పదజాలం బాగా తగ్గించారు.
 
పాలేరు నాటకాన్ని ఎక్కువగా మాలమాదిగ యువకులే ప్రదర్శించేవారు. ఒక ఊరిలో ఒక పేటలో ప్రదర్శన చూశాక మిగతా ఊళ్ళ వాళ్ళూ వచ్చి ఈ నాటక బృందాన్ని తీసుకువెళ్ళి తమ పేటలో వారికి తర్ఫీదు ఇప్పించి తామూ ఒక నాటక బృందాన్ని తయారు చేసుకునేవారు. ఈ విధంగా ఊరూరా నాటక బృందాలు ఏర్పడి పోటీపడి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నాటక ప్రదర్శనలు ఆపటానికి భూస్వాములు, కామందులు విశ్వప్రయత్నాలు చేసేవారు. పోలీసులను, ఆశ్రయించేవారు. రౌడీలను పెట్టి నటులను కొట్టించేవారు. జనాన్ని కూడా కొట్టి చెదరగొట్టేవారు. అయినా నాటక బృందాలు మళ్ళీమళ్ళీ ప్రదర్శనలకు సిద్ధమై పోయేవారు. అమలాపురం తాలూకా జెల్లగుంట గ్రామంలోని నటబృందం ఇలాంటి ప్రదర్శనలకు పేరు పొందింది. ఆ ఊళ్ళో చాలామంది నటుల అసలు పేర్లు మరుగున పడిపోయి జెల్లగుంట పుల్లయ్య, జెల్లగుంట రౌడీ రంగ వంటి పేర్లతో ప్రసిద్ధులయ్యారు. ఆరోజుల్లో పాలేరు నాటకం ప్రదర్శించి దెబ్బలు తినని నటులు లేరు. అయినా మళ్ళీ మళ్ళీ ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధమైపోయేవారు. ‘ఒక నాటకం ప్రదర్శింపబడుతుండగా పోలీసులో, రౌడీలో వచ్చి నటులను రంగస్థలం మీద నుంచి లాగి కొట్టి ప్రదర్శ భగ్నం చేయటం అనేది పాలేరు నాటకానికే ఉంది’ అంటారు మరపట్ల భాస్కరరావు.
 
అనుభవాలు అయ్యాక నాటక నిర్వాహకులు- సామాజికులు కూడా, రౌడీలనూ పోలీసులనూ ఎదుర్కోవటానికి సిద్ధపడే వస్తుండేవారు. కర్రలతో రక్షణ వలయం కాపలాగా ఉండేదట. పౌరాణిక నాటకాలు, మరాఠీ నాటక సమాజాల వారి ప్రదర్శనలు చూడటానికి అలవాటుపడ్డ జనం ఈ సాంఘిక నాటకాన్ని ఆదరించటం ఒక సామాజిక సంచలనానికీ చైతన్యానికీ నిదర్శనం. ఈ నాటకాన్ని మాలపల్లెలలో మాత్రమే గాక ఊరి సినిమా హాళ్ళలో టిక్కెట్టు పెట్టి మరీ ప్రదర్శించటం ఆనాటి సామాజిక నేపథ్యానికీ, మారుతున్న ప్రజల భావస్రవంతికీ అద్దం పడుతున్నది. నాటకంలోని పద్యాలు, ‘‘బానిసతనమును బాపుమురా’’ వంటి పాటలు ఆనాటి జాతీయోద్యమానికి కూడా వర్తించే విధంగా ఉండటం, ‘‘విద్య అనే కాగడా వెలుగు చూపి మీ పిల్లలను రక్షించుకోండి బడికి పంపండి’’ అనే అభ్యర్థనలూ కులవ్యవస్థ మీది వివరణలూ జనాన్ని ఆకట్టుకున్నాయి. రాతప్రతిని బెజవాడలోని దేశి కవితా మండలి వారు తీసుకుని (1940) అచ్చువేస్తూ వచ్చారు. నష్టాలలో ఉన్న తమ సంస్థను ‘పాలేరు’ నాటకం నిలబెట్టిందని వారు చెప్పుకున్నారు.
 
గుంటూరులో ఒక నాటక బృందం పాలేరు వంద ప్రదర్శనలు ఇచ్చిన సందర్బంలో 8-3-1953న చెరకుపల్లిలో అప్పటి మంత్రి దామోదరం సంజీవయ్య గారి అధ్యక్షతన భీమన్నగారిని పగటి దివిటీలతో ఊరేగించారు. హంస ఆకారంలో రథం తయారుచేసి, భీమన్నను, సంజీవయ్యను, సన్మాన సంఘాధ్యక్షుడైన పరవస్తు దాసు ను రథంలో కూర్చోబెట్టి రథాన్ని లాగుతూ తమ సంప్రదాయ కళలు ప్రదర్శిస్తూ ఊరేగించారు. చుట్టుపక్కల వాడలలో మూడు రోజుల పాటు సంబరాలు జరిగాయి.
‘‘వాల్మీకికి అతని సమకాలికుడైన రాముడు కథానాయకుడు. నాకు నా సమకాలికుడైన పాలేరు వెంకన్న కథానాయకుడు.అతని జీవితం నా నాటకానికి ఇతివృత్తం’’ అన్నారు భీమన్న. సత్యహరిశ్చంద్ర నాటకం చూసి ఎందరు సత్యవంతులయ్యారో తెలియదు గాని పాలేరు నాటకం చూసి వేలమంది పాలేళ్ళు పాలేరు తనాలు వదిలేసి పాఠశాలల్లో చేరి చదువుకోవటం వాస్తవంగా జరిగింది. పాలేరు నాటకం 19వ ముద్రణ కోసం భీమన్న రాసిన పీఠిక పేరు ‘బాణా కర్ర’. ఈ నాటకాన్ని కాకి మాధవరావు (ఐఏఎస్‌) ఇంగ్లీష్‌లోకి అనువదించారు. ఆయన చిన్నప్పుడు పాలేరు నాటకంలో ‘బాల’ పాత్ర ధరించారట. ఈ నాటకాన్ని ఆంధ్ర ప్రాంతాలలోనే కాక మద్రాస్‌లోనూ రంగూన్‌లోనూ బొంబాయిలోనూ కూడా ప్రదర్శించారు. 1947 ప్రాంతాలలో ఆయా ఊళ్ళ సినిమా హాళ్ళలో నేల టిక్కెట్టు అయిదణాలు, ఆరణాలు - బెంచీలకు పన్నెండు అణాలు, కుర్చీలకు ఒక రూపాయి నుంచి రెండు రూపాయిల వరకు టిక్కెట్టు ధర పెట్టి ప్రదర్శించే వారు. 1951లో మద్రాసులో ఆంజనేయనగర్‌ ఆది ఆంధ్ర విద్యార్థి కాంగ్రెసు సమాజం వారు భీమన్న పర్యవేక్షణలోనే వి.పి. హాలులో(23-6-1951) ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు కుర్చీ టిక్కెట్లు అయిదు రూపాయలు పెట్టారు. ఆ తర్వాత ఒక నెలకే సీతారామంజనేయ భక్త సమాజం వారు మద్రాసులోనే సౌందర్య మహల్‌లో దీనిని ప్రదర్శించారంటే ఈ నాటకానికి లభించిన ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
 
1952 జనవరి 12న రంగూన్‌లోని విన్‌ సినిమా హాలులోనూ 11-4-1954న బొంబాయి విలెపార్లేలోనూ ఈ నాటకం ప్రదర్శించారు. కరపత్రాలు ఇంగ్లీష్‌లోనూ ప్రాంతీయ భాషలలోనూ కూడా వేసి పంచేవారు. 1962లో వరంగల్‌లో అయినవోలు జాతరలో విరాళాల కోసం ఈ నాటకాన్ని ప్రదర్శించారట. ‘బానిస తనమును బాపుమురా భారతజాతికి భాగ్యము తేరా’ వంటి పాటలు, ‘పుణ్య భారత భారతీ పుత్రులారా’ వంటి సంబోధనలు అప్పటి కాంగ్రెస్‌ ఉద్యమాన్ని బలపరుస్తున్నందువల్ల ఈ నాటకంపై వ్యతిరేక భావం కొంత ఉపశమించిందనవచ్చు.
 
‘జ్ఞాన సమాజం జన్మసమాజం ఎలా అయిందా’ అని ప్రశ్నించుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ భారతీయ సమాజంలోని లోపాలు ఎత్తిచూపుతూ జాతి పునర్నిర్మాణానికి బాటలు వేసిన భీమన్న గారి నాటకాలనూ నృత్య గేయ నాటికలనూ, కావ్యాలనూ, వచన కవితలనూ ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది.
డా. బి. విజయభారతి
డా. బి. నాగవర్మ
(సెప్టెంబర్‌ 19న బోయి భీమన్న 105వ జయంతి)