Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 13 Sep 2015 17:15:14 IST

నృత్య వైభవం... నేటి యువతరం

నృత్య వైభవం... నేటి యువతరం

 •   శాస్త్రీయత నృత్యం వైపు యువత ఆసక్తి
 •  కళారూపాలను ప్రదర్శించడమే లక్ష్యమంటున్న యువత
 భారతీయ కళా వైభవానికి తార్కాణం శాస్త్రీయత నృత్యం. ఇది విజ్ఞానం, వినోదం కలగలిపిన కళారూపం. అయితే, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొంతకాలంగా ఆదరణకు నోచుకోవడం లేదు. ఇప్పుడు యువతరం మళ్లీ.. శాస్త్రీయత నృత్యం వైపు దృష్టిసారించడంతో ఆ కళలకు పూర్వ వైభవం రానుందనిపిస్తోంది. కళారాధకుల కోసం...నగరంలోని దాదాపు 300 నృత్య కళాశాలలు పలు కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో అమ్మాయిలు, అబ్బాయిలు కొంచె కష్టమైనా.... ఇష్టమేనంటూ అటువైపు పయనిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ
 
కార్పొరేట్‌ కొలువు కన్నా, నృత్యమే మిన్నగా 
వైష్ణవి సాయినాథ్‌. భరతనాట్యాచారిణి రాజేశ్వరి సాయినాథ్‌ తనయగానే కాక శాస్త్రీయ నృత్య కళాకారిణిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు వైష్ణవి. ఇల్లే ఒక శాస్త్రీయ కళా నిలయం కావడంతో ఊహతెలిసిన నాటినుంచే భరతనాట్యం అభ్యసించడం ప్రారంభించారు. బీఏ జర్నలిజమ్‌ తర్వాత ఎంఏ హ్యూమన్‌ రీసోర్స్‌ చదివారు. భరతనాట్యంలో కూడా మాస్టర్‌ డిగ్రీ పొందారు. చిన్ననాటి నుంచి వైష్ణవి చదువులో ఎప్పుడూ ముందుండేవారు. తోటివారంతా కార్పొరేట్‌ కొలువుల్లో స్థిరపడటం చూసి తను అటువైపు వెళదామనే ఆలోచన చేశారు. మంచి ఉద్యోగ అవకాశాలు సైతం తలుపుతట్టాయి. అవేవీ కాదనుకున్నారు. శాస్త్రీయ కళల ద్వారా సమాజానికి తన వంతు సేవ చేయాలనుకున్నారు. జూబ్లీహిల్స్‌లో వైష్ణవి నాట్య కేంద్రం ప్రారంభించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కలరీ నృత్యాలను నేర్పుతున్నారు. పలు సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో నృత్యరూపకాలను ప్రదర్శిస్తున్నారు.‘‘నా దగ్గర సుమారు 140 మంది వరకూ భరతనాట్యం, ఒడిస్సీ, కలరీ నేర్చుకుంటున్నారు. 5ఏళ్ల నుంచి 63 ఏళ్ల వరకూ వారు కూడా భరతనాట్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 55ఏళ్ల వయస్సులో డా జయశ్రీ రెడ్డి భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించి రెండేళ్ల తర్వాత అరంగేట్రం చేశారు. నృత్యం నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధంలేదు. శరీరం సహకరిస్తే సరిపోతుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.’’
-వైష్ణవి సాయినాథ్‌
 
 
కూచిపూడి మై లైఫ్‌
తెలుగువారి ఇలవాకిలి కూచిపూడి నృత్యం సామాన్యులకు సైతం చేరువ చేసేందుకు కృషిచేస్తున్నారు అచ్యుత మానస. 5వఏటే శాస్త్రీయ సంగీతంతో పాటు కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించారు మానస. 8వ ఏట నుంచి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పటికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 800ప్రదర్శనల వరకు ఇచ్చారు. యునెస్కో నుంచి యువ మయూరి అవార్డు అందుకున్నారు. కూచిపూడితో పాటు భరతనాట్యం, కథక్‌, ప్రేంకిణీ నృత్యాల్లో ఈమెకు ప్రవేశం ఉంది. ఇంజనీరింగ్‌ చదివారు. పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ఉద్యోగ జీవితం ప్రారంభించారు. మంచి జీతం. తక్కువకాలంలోనే ప్రమోషన్‌ ఇవేవీ ఆమెకు తృప్తి ఇవ్వలేదు. తనకు వచ్చిన కళను పదిమందికి నేర్పించాలనే ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనాథ వసతి గృహాల్లోని పిల్లలకు కూచిపూడి, కర్ణాటిక్‌ సంగీతం, చిత్రలేఖనం వంటి కళలను నేర్పిస్తున్నారు. కూచిపూడి మై లైఫ్‌ పేరిట క్యాంపైన్‌ మొదలుపెట్టారు. కూచిపూడి కళా పీఠంలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. ‘‘మన శాస్త్రీయ కళల పట్ల ప్రభుత్వాలకు చిన్న చూపు ఉంది. పేద, మధ్యతరగతి వారికి సైతం శాస్త్రీయ నృత్యం చేరువకావాలి. అందుకోసం కూచిపూడి నృత్యాభినయ వేదం .. మోక్షమార్గం డీవీడీని సైతం అందుబాటులోకి తెచ్చాము. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో శాస్త్రీయ నృత్యం, సంగీతం గురించి బోధనలు జరగాలి.’’ అంటారు మానస.
-అచ్యుత మానస
 
 
సినిమా అవకాశాలు సైతం కాదని
స్మితా మాధవ్‌ అంటే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణంలో సీత పాత్రధారిణి అంటే చాలా మందికి తెలుస్తుంది. స్మిత భరతనాట్యంతో పాటు కర్ణాటిక్‌ సంగీతంలోనూ ప్రావీణ్యం పొందారు. 5ఏళ్ల వయస్సులోనే గురువు రాజేశ్వరి సాయినాథ్‌ దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆమె చదువులో కూడా ఎప్పుడూ ముందుండేవారు. ఎం.ఏ భరతనాట్యం, ఎం.ఏ కర్ణాటిక్‌ సంగీతంతో పాటు న్యాయశాస్త్రా‌న్ని అభ్యసించారు. బాలరామాయణం తర్వాత పలు సినిమా అవకాశాలు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించారు. శాస్త్రీయ కళారాధనే తనకు అత్యంత ఇష్టమని చెబుతారు. జూబ్లీహిల్స్‌లో వర్ణ ఆర్ట్స్‌ అకాడమీ ప్రారంభించారు. కర్ణాటిక్‌ సంగీతంతో పాటు భరతనాట్యం నేర్పుతున్నారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. ‘‘మా నాన్న గారు నాకు ఎప్పుడూ కళాశాల ఫీజు కట్టలేదు. నేను మెరిట్‌ స్టూడెంట్‌ను కదా! స్కాలర్‌షిప్స్‌ వచ్చేవి. శాస్త్రీయ నృత్యం లేక సంగీతంలో ప్రవేశమున్నవారికి క్రమశిక్షణ, సమయపాలన సహజంగానే అబ్బుతాయి. 
 -స్మితా మాధవ్
 
 
కష్టమైనా, ఇష్టమైనా నృత్యమే
కిరణ్మయి. మధ్యతరగతి కుటుంబం. సీబీఐటీలో ఇంజనీరింగ్‌ చదివారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో డెలాయిట్‌కు సెలక్ట్‌ అయ్యారు. మంచి జీతం కాలం గడిచిపోతుంది. కానీ ఏదో వెలితి. మనసంతా భరతనాట్యంపైనే. కారణం 6ఏళ్ల వయస్సు నుంచి కిరణ్మయి భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు. నెల జీతం తీసుకున్నప్పుడు కన్నా నృత్య ప్రదర్శన ఇస్తున్నప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది అంటారు ఆమె. అందుకే ఉద్యోగం మానేయాలనుకున్నారు. ఫర్వాలేదు మీకు వెసులుబాటు కల్పిస్తాం ఉద్యోగం చేసుకుంటూనే నృత్య ప్రదర్శనలివ్వచ్చు అన్నారు బాస్‌. సమయం సరిపోవడం లేదు. కానీ కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రమే. ఏదైతే అది అవుతుంది అని ముందడుగు వేశారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. గురువు పేరుతో హేమ ఆరంగం డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించారు. ఈ మధ్యన లండన్‌లో ప్రదర్శన ఇచ్చారు. ‘‘ఇష్టమైన పనినే వృత్తిగా మలుచుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు. కష్టమైనా, ఇష్టమైనా నృత్యమే ఊపిరి. ’’ అని ఆమె అన్నారు.
-కిరణ్మయి
 
 ఓవైపు ఉద్యోగం మరోవైపు నృత్యం
కీర్తి ప్రస్తుతం విప్రోలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వారంలోని మొదటి 5రోజులు ఆఫీసు జీవితం. వీకెండ్‌ మాత్రం నృత్య ప్రదర్శనలు ఇవ్వడం. ఒకవైపు ఉద్యోగజీవితం మరో వైపు నాట్యసాధన ఎలా సాధ్యం అని అడిగితే తనకు ఒత్తిడి, అలసట అంటే తెలియదు అంటారు కీర్తి. ‘‘8వ ఏట నుంచి కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టాను. 12వ ఏట అరంగేట్రం చేశాను. భరతనాట్యం, కథక్‌లోకూడా ప్రవేశం ఉంది. నాట్యం వల్లే నాకు మానసిక ప్రశాంతత లభిస్తోంది. ఉదయం సాయంత్రం ఇంట్లో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తాను. దాంతో నాకు చాలా మానసిక ఉల్లాసంగా అనిపిస్తుంది. బిట్స్‌పిలానీలో ఎమ్‌.ఎస్‌ చేశాను. చదువులో కూడా ముందుండేదాన్ని. ఇదంతా శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం వల్లే అని అనుకుంటాను. జీవితం క్రమబద్ధంగా సాగడానికి శాస్త్రీయ కళలు ఎంతో ఉపకరిస్తాయి. అందుకు నా జీవితంలోనే ఎన్నో ఉదాహరణలు. సుమారు 300ప్రదర్శనలు ఇచ్చాను. .’’
-కీర్తి
 
 
 
 అబ్బాయిలకెందుకు అని ఇంట్లో వారు అన్నా...
అబ్బాయిలు కూడా శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తిచూపుతున్నారు. శరత్‌, శ్రీను ఇద్దరూ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎం.ఏ కూచిపూడి చదువుతున్నారు. శరత్‌ ఫిజియోథెరపీ చదివారు. తనకు చిన్నప్పటి నుంచి కూచిపూడి నేర్చుకోవాలని కోరిక. ఆ ఆశ 22ఏళ్లకు తీరింది. శాస్త్రీయనృత్యం నేర్చుకోవాలని గురువు రాజారెడ్డి ని కలిశారు. శరత్‌ ఆసక్తిని గమనించిన వారు తనకు కూచిపూడి నేర్పించడానికి అంగీకరించారు. తర్వాత వారి కూతురు గురువు యామినీ రెడ్డి దగ్గర 5ఏళ్లు కూచిపూడి నేర్చుకున్నాడు శరత్‌. వారితో పాటు పలు ప్రదర్శనలు, నృత్యరూపకాలు చేస్తున్నారు. శ్రీను కూ చిన్నప్పటి నుంచి కూచిపూడి నేర్చుకోవాలని కోరిక. ఇది కేవలం ఆడవాళ్లు నేర్చుకుంటారు. నీకెందుకు అని నిరుత్సాహ పరిచారు ఇంట్లో వారు. కానీ తన ఆసక్తిని మాత్రం చంపుకోలేదు. 23ఏళ్ల వయస్సులో కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించారు. త్యాగరాయ నృత్య కళాశాలలో డిప్లొమా కోర్సు చేశారు. తర్వాత సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎం.ఏ కూచిపూడిలో సీటు సంపాదించారు. ఫీజు కూడా కట్టలేని స్థితి. తన ఆసక్తిని గమనించిన స్నేహితుడు ప్రవీణ్‌ ఆర్థికసహకారం అందించారు. ఇప్పుడు వీరు పలు ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు.
 
శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి పెరిగింది
నేడు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సు నుంచి శాస్త్రీయ నృత్యం నేర్పించడానికి ముందుకొస్తున్నారు. చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. కానీ 7వతరగతికి రావడంతోనే ఆపేస్తున్నారు. డ్యాన్స్‌ క్లాస్‌ వల్ల చదువులో వెనకబడతారు అనే భావన ముఖ్య కారణం. శాస్త్రీయ నృత్యం వల్ల మానసిక వికాసం లభిస్తుంది. చదువులో కూడా ముందుంటారు అనే సంగతి తల్లిదండ్రులు గుర్తించాలి. గత 35ఏళ్ల నుంచి కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేయడంకోసం సొంతంగా అకాడమీని ప్రారంభించాను. నామమాత్రపు ఫీజుతో కూచిపూడి నేర్పుతున్నాం. పేదపిల్లలకు ఉచితంగా చెబుతున్నాం. వ్యవస్థాగతంగా ప్రభుత్వం శాస్త్రీయ నృత్యం ముఖ్యంగా తెలుగువారి కళా వైభవం కూచిపూడిని ఆదరించాలి, ప్రోత్సహించాలి .
-డా. శోభానాయుడు, కూచిపూడి గురువు 
 
శాస్త్రీయ నృత్యంపై ప్రభుత్వం చిన్నచూపు
శాస్త్రీయ కళలకు ఆదరణ అనేది ప్రజల నుంచి ఎప్పుడూ ఉంటుంది. కానీ ప్రభుత్వాలకే అవి అంటే చిన్నచూపు. ఈ రోజు ఎవరైనా శాస్త్రీయ నృత్యాన్ని ప్రధాన వృత్తిగా తీసుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఆటలకు ప్రత్యేక కోటా ఉంది. కళలకు మాత్రం లేదు. మా లాంటి వాళ్లం ఏడాదికి ఓ నృత్య రూపకం చేస్తున్నాం. అదే ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ప్రజలను చైతన్యవంతంచేసే విధమైన నృత్యరూప ప్రదర్శనలు సృజనాత్మకంగా వస్తాయి.
-డా అలేఖ్య పుంజల
ప్రొఫెసర్‌, తెలుగు యూనివర్సిటీ శాసీ్త్రయ నృత్య విభాగం
 
 
50ఏళ్లవారు సైతం వస్తున్నారు
శాస్త్రీయ నృత్యరీతుల్లో కథక్‌ కూడా ప్రధానమైంది.. ఇప్పుడు కథక్‌ నేర్చుకోవడానికి కూడా చాలా మంది ముందుకొస్తున్నారు. చిక్కడపల్లిలో కథక్‌ కళా క్షేత్రం ప్రారంభించాం. గృహిణులు, 50ఏళ్ల వారు కూడా కథక్‌ నేర్చుకోవాలని మా దగ్గరకు వస్తున్నారు. మెడిసిన్‌ చదువుతూ,సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్న వారు కూడా వారాంతపు రోజుల్లో ప్రత్యేక కథక్‌ తరగతులకు హాజరవుతున్నారు. 
-పండిట్‌ అంజుబాబు, కథక్‌ గురువు 
నగరంలోని ప్రభుత్వ నృత్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు
 • త్యాగరాజ ప్రభుత్వ నృత్య, సంగీత కళాశాల, కింగ్‌కోఠి
 •  భక్త రామదాసు ప్రభుత్వ నృత్య, సంగీత కళాశాల, ఈస్ట్‌మారేడ్‌ పల్లి, సికింద్రాబాద్‌
 •  శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ నృత్య, సంగీత కళాశాల, హైకోర్టు ఎదురుగా, పాతబస్తీ, ఈ కళాశాలల్లో కూచిపూడి నృత్యం పార్ట్‌టైం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్‌ కోర్సు వ్యవధి 4 సంవత్సరాలు., డిప్లొమా కోర్సు 2ఏళ్ల ఉంటుంది. 
 •  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడి, ఆంధ్రనాట్యం ఎం.ఏ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 
 •  తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే కళాప్రవేశిక పార్ట్‌టైం కోర్సు కూడా ఉంది. కూచిపూడి ప్రథమ స్థాయి నుంచి నేర్పుతారు. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. 
 •  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సైతం కూచిపూడి, భరతనాట్యంలో ఎం.ఏ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 
 •  నాట్యాచారులు నిర్వహిస్తున్న నగరంలోని కొన్ని ప్రముఖ నృత్యాలయాలు.
 •  శ్రీనివాస కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ, దోమల్‌గూడ, ఫోన్‌ నెంబర్‌: 93910 21062, 040 27637688, నిర్వాహకులు : డా.శోభానాయుడు
 •  కథక్‌ కళా క్షేత్రం, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌, ఫోన్‌ నెంబర్‌ : 98492 59133, నిర్వాహకులు: పండిట్‌ అంజుబాబు
 •  రాధాకృష్ణ కూచిపూడి నాట్యాలయం, వనస్థలిపురం, ఫోన్‌ నెంబర్‌ : 93903 55603, నిర్వాహకులు : చింతా ఆదినారాయణ శర్మ
 •  నాట్య తరంగిణి కూచిపూడి నృత్యాలయం, ఫిల్మ్‌నగర్‌, ఫోన్‌ నెంబర్‌ : 9866267980, నిర్వాహకులు : యామిని రెడ్డి
 •  అభినయ దర్పణ ఆర్ట్స్‌ అకాడమీ (ఆలయ నృత్యం, కూచిపూడి), నల్లకుంట, ఫోన్‌ నెంబర్‌ : 27618449, నిర్వాహకులు : ఒలేటి రంగమణి
 •  శంకరానంద కళా క్షేత్ర, (కూచిపూడి, భరతనాట్యం, జూబ్లీహిల్స్‌, ఫోన్‌ నెంబర్‌ : 23548384, నిర్వాహకులు : ఆనంద శంకర్‌ జయంతి
 •  సిద్దేంద్ర కూచిపూడి కళా క్షేత్రం, గాంధినగర్‌, ఫోన్‌ నెంబర్‌ : 099494 46144, నిర్వాహకులు : వేదాంతం సత్యనరసింహ శాస్త్రి
 •  తృష్ణ కూచిపూడి నాట్యాలయం, హిమాయత్‌నగర్‌, ఫోన్‌ నెంబర్‌ : 23226100, నిర్వాహకులు : డా. అలేఖ్య పుంజల
 •  లాస్య ప్రియ కూచిపూడి నృత్యాలయం, బంజారాహిల్స్‌, ఫోన్‌ నెంబర్‌ : 23352115, నిర్వాహకులు : ఉమారామారావు
 •  నృత్యాంకిత కూచిపూడి నృత్యాలయం, జూబ్లీహిల్స్‌, ఫోన్‌ నెంబర్‌ : 23548253, నిర్వాహకులు : జొన్నలగడ్డ అనూరాధ, (హెచ్‌.సీ.యూ)
 •  శ్రుతిలయ కేంద్ర, (భరతనాట్యం, ఒడిస్సీ, కలరీ), సికింద్రాబాద్‌ ఫోన్‌ నెంబర్‌ : 27892735, నిర్వాహకులు : రాజేశ్వరీ సాయినాథ్‌

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.