desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 8 2015 @ 20:15PM

అప్పటికీ ఇప్పటికీ ఇండియానే బెస్ట్‌

మన దేశంలో బిబిసి కరస్పాండెంట్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మార్క్‌టులీ పదవీ విరమణ చేసిన తర్వాత భారత్‌లో స్థిరపడ్డారు. భారత సామాజిక,  రాజకీయ పరిస్థితులపై విశేషమైన అవగాహన ఉన్న మార్క్‌టులీ హైదరాబాద్‌లో ‘యువకళావాహిని - గోపీచంద్‌ నేషనల్‌ లిటరరీ’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నవ్యకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 
మీరు 1990లలో పదవీ విరమణ చేశారు. అప్పట్లో సోషల్‌ మీడియా లేదు. ఇప్పుడు సోషల్‌ మీడియా హవా నడుస్తోంది. ఈ మార్పును మీరెలా చూస్తారు?
అప్పట్లో న్యూస్‌ ఏజన్సీల నుంచి రిలీజ్‌లు వచ్చేవి. వాటిలో న్యూస్‌ ఏజన్సీ అభిప్రాయాలు కూడా ఉండే అవకాశముంది. ఇప్పుడు చాలా రిలీజ్‌లు ట్విట్టర్‌లో పెడుతున్నారు. వీటిలో అభిప్రాయాలుండవు. అయితే ఇంటర్నెట్‌ వల్ల చెడు కూడా జరిగే అవకాశముంది. నా వ్యక్తిగత అనుభవం చెబుతాను. ఇంటర్నెట్‌లో ఎవరో ఇందిర(గాంధీ)ను తప్పుపడుతూ నేను రాసినట్లు ఒక వ్యాసం పోస్ట్‌ చేశారు. దానిని చూసి అనేక మంది నాకు ఫోన్‌ చేశారు. ఇందిరపై నా అభిప్రాయం ఎలాంటిదో ప్రపంచానికి తెలుసు. నేను ఆమెను ఎప్పుడూ తిట్టలేదు. అయినా చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ విషయంపై నేను ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశాను. అయినా ఇప్పటి దాకా దానిని ఎవరు పోస్ట్‌ చేశారో తెలియలేదు. ఇంటర్నెట్‌ వల్ల ఇలాంటి దుష్ప్రచారాలు జరిగే అవకాశముంది. ఇక టెలివిజన్‌ విషయానికి వస్తే- చానల్స్‌లో న్యూస్‌ కన్నా వ్యూస్‌ ఎక్కువ ఉంటున్నాయి. కంటెంట్‌ కన్నా ఊకదంపుడు వ్యవహారాలు ఎక్కువ కనిపిస్తాయి. కొందరు ప్రెజంటర్లు- ఇతరులను అవమానిస్తుంటారు. వారు నవ్వుతూ ఉంటారు. ఈ రణగొణ ధ్వనిని భరించలేక దూరదర్శన్‌ వార్తలపై ఆధారపడేవాళ్లను చాలామందిని చూశాను. నిస్పాక్షికంగా, నిజమైన వార్తలను అందిస్తే ప్రజలు ఆదరిస్తారు.
 
మీరు గత ఏడు దశకాలుగా భారత్‌లో వచ్చిన రకరకాల మార్పులు చూశారు. ప్రస్తుతం భారత్‌ ఎలా ఉంది-?
చిన్నప్పుడు మా అమ్మానాన్న నన్ను భారతీయులతో కలవనిచ్చేవారు కాదు. ‘జంగ్లీ’ ప్రజలకు దూరంగా ఉంచాలని చూశారు. ఆ తర్వాత నేను ఇక్కడ పనిచేశాను. ఇప్పుడు స్థిరపడ్డాను. అప్పటికీ, ఇప్పటికీ భారత్‌లాంటి దేశం మరొకటి లేదనిపిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం చిన్నాభిన్నం అయిపోతుందేమోనని చాలామంది భయపడ్డారు. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, కాందిశీకులు... ఇలా రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. వీటిని దాటుకొని ఇప్పుడు ఆర్థికవ్యవస్థ బలపడింది. అయితే సామాజికంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. వాటి వల్ల ప్రతి మనిషికి ఒక నెట్‌వర్క్‌ ఉండేది. అస్థిత్వం లభించేది. అవి విచ్ఛిన్నమయ్యాయి. చిన్న కుటుంబాలొచ్చాయి. వీటి వల్ల ఒత్తిడి పెరిగింది. ప్రతి వ్యక్తి తన అస్తిత్వాన్ని తానే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. యువకుల సంఖ్య పెరగటం వల్ల తమకు మంచి అవకాశాలు లభించాలనుకొనే వారి సంఖ్య పెరిగింది. అవకాశాలు పెరిగాయి కానీ అవి అందరినీ సంతృప్తిపరచలేకపోతున్నాయి. విద్య, ఆరోగ్యం, ఉపాధి- ఈ మూడు మనముందున్న పెనుసవాళ్లు. వీటిని అందించగలిగితే ప్రపంచంలో మనకు తిరుగే ఉండదు.
 
ప్రస్తుతం యూరప్‌ కాందిశీకుల సమస్యను ఎదుర్కొంటోంది. యూరప్‌ దేశాలు కాందిశీకులను దరి చేర్చుకుంటున్నాయి. ఈ సంఘటనలను ఏ కోణం నుంచి చూడాలి?
ప్రపంచంలో సమతౌల్యం లేదనటానికి ఇదొక ఉదాహరణ. మధ్యప్రాశ్చ్యంలో ఏర్పడిన సంక్షోభం యూరప్‌కు పాకింది. ఈ సంక్షోభం ఏర్పడటంలో యూరప్‌ దేశాల పాత్ర కూడా ఉంది. దీనిని ఎవరూ కాదనలేరు. సమస్యను సృష్టించటంలో వారికి కూడా పాత్ర ఉంది కాబట్టి పరిష్కారం చూపించటంలో కూడా వారే చొరవ తీసుకోవాలి. ఇక కాందిశీకుల సమస్య ఈ నాటిది కాదు. బంగ్లాదేశ్‌ యుద్ధసమయంలో అక్కడ నుంచి భారత్‌కు కాందిశీకులు వచ్చారు కదా. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న సమయంలో భౌగోళికంగా తమకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు వలస వెళ్తారు. ఉదాహరణకు సిరియా పక్కన అమెరికా ఉంటే ఆ దేశానికే కాందిశీకులు వెళ్లేవారు. ఈ సమస్య తీరే వరకూ కాందిశీకుల వలసలు తప్పవు. దీనిని మనం ఈ కోణం నుంచే చూడాలి.