Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 07 Sep 2015 02:10:46 IST

తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి

తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి

  • 9న అధికారికంగా వేడుకలు
  • కాళోజీ పేరిట స్మారక అవార్డు ప్రదానం
  • అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
హైదరాబాద్‌/హన్మకొండ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘బడి పలుకుల భాషకాదు, పలుకుబడుల భాష కావాలి’’ అని ప్రకటించిన తెలంగాణ సాంస్కృతిక ప్రతీక.. కాళోజీ నారాయణరావు జయంతిని ఇక నుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల తొమ్మిదో తేదీన కాళోజీ జయంతిని హైదరాబాద్‌లో అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు.. అధికారులను ఆదేశించారు. జయంతి నాడు రాష్ట్రవ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. పాఠశాల విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేషకృషి చేసిన వారికి కాళోజీ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
 
నాడే దినోత్సవం జరిపారు!
కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆయన స్వస్థలం వరంగల్‌ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి, ఈ హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడాది క్రితం ఇచ్చారని కాళోజీ సన్నిహితులు, సాహితీవేత్తలు గుర్తు చేసుకొన్నారు. అప్పుడు కేసీఆర్‌ కాజీపేట నిట్‌ కళాశాలలో జరిగిన కాళోజీ జయంత్యుత్సవాలకు హాజరయ్యారు. కాళోజీ జయంతిని తెలంగాణ అధికార భాషాదినోత్సవంగా జరుపుతామని, కాళోజీ పేరిట అవార్డు ఇస్తామని.. రెండు వాగ్దానాలు చేశారు. హన్మకొండ బాలసముద్రంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి.. కాళోజీ పేర ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇన్నాళ్లకయినా రాష్ట్ర ప్రభుత్వం మాట నిలుపుకోవడం సంతోషమని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకొనే సంప్రదాయం తెలంగాణలో ఎప్పటినుంచో కొనసాగుతున్నది. సమైక్య రాష్ట్ర పాలనలో ఒకే భాషకే ప్రాధాన్యం లభిస్తున్నందున, అన్ని మాండలికాలకు ప్రాధాన్యం దక్కాలన్నది కాళోజీ ఆకాంక్ష. ఈ క్రమంలోనే కాళోజీ జీవించి ఉన్న రోజుల్లోనే ఆయన జన్మదిన రోజును తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా కాళోజీ పౌండేషన్‌ జరుపుకుంటూ వస్తోంది. ఆ రోజున తెలంగాణ భాష, యాస పరిరక్షణకు విశేషంగా కృషి చేసిన సాహితీ వేత్తలను సత్కరిస్తోంది.
 
ఫలించిన కల
‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ భాష అధికార భాష అయింది. ఈ పరిస్థితుల్లో, కాళోజీ జయంతిని తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. కీర్తి కండూతి కోసం కాకుండా ప్రజాప్రయోజనం కోసం ప్రజల భాషలో కవిత్వాన్ని రాయాలనేవారు కాళోజీ. అందుకే ఆయన ప్రజాకవి అయ్యారు. మనిషితనం పట్ల ప్రేమ కలిగిన కాజోజీకి తెలంగాణ భాష అన్నా, తెలంగాణ యాస అన్నా విపరీతమైన అభిమానం. ఆయన ధిక్కార కవిత్వమంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది’’
పొట్లపల్లి శ్రీనివాసరావు, 
కాళోజీ ఫౌండేషన్‌ సంయుక్త కార్యదర్శి

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.